పప్పుశనగకు వేరుకుళ్లు

ABN , First Publish Date - 2021-11-12T05:54:07+05:30 IST

పప్పు శనగ పంటకు వేరుకుళ్లు తెగులు సోకింది. ఇటీవల తుఫాను ప్రభావంతో నల్లరేగడిలో తేమశాతం ఎక్కవ కావడంతో పంట దెబ్బతింటోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

పప్పుశనగకు వేరుకుళ్లు
మొళగవల్లిలో పప్పుశనగ పంటను ట్రాక్టర్ల సహాయంతో దున్నేస్తున్న రైతులు

  1. దిక్కుతోచక దున్నేస్తున్న రైతులు
  2. మట్టిలో కలిసిపోయిన పెట్టుబడి
  3. భారీగా నష్టపోయిన అన్నదాతలు


ఆదోని, నవంబరు 11: పప్పు శనగ పంటకు వేరుకుళ్లు తెగులు సోకింది. ఇటీవల తుఫాను ప్రభావంతో నల్లరేగడిలో తేమశాతం ఎక్కవ కావడంతో పంట దెబ్బతింటోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదోని డివిజన్‌లో ఏటా రబీలో నల్లరేగడి పొలాల్లో పప్పుశనగ సాగు చేస్తారు. ఆదోని, హొళగుంద, ఆలూరు, చిప్పగిరి, ఆస్పరి, కౌతాళం, మంత్రాలయం మండలాల్లో పప్పుశనగ సాగు విస్తీర్ణం ఎక్కువ. అక్టోబరులో విత్తనం నాటారు. పంట ఎదుగుతున్న సమయంలో వేరు కుళ్లు తెగులు సోకడంతో పలువురు రైతులు పంటను తొలగిస్తున్నారు. ఆలూరు మండలం మొళగవల్లి గ్రామంలో దాదాపు 600 ఎకరాల్లో పంటలకు తెగులు సోకడంతో ట్రాక్టర్ల సాయంతో పంటను తొలగిస్తున్నారు.


పప్పుశనగ సాకుకు ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చు చేశారు. మొలకశాతం బాగా వచ్చి, పంట ఎదుగుతున్న సమయంలో తేమ అధికమైంది. దీంతో తెగులు సోకి కుళ్లిపోతోంది. దీంతో రైతులు పంటను దున్నేసి జొన్న సాగుకు సిద్ధమవుతున్నారు. పప్పుశనగ పంటకు పెట్టిన పెట్టుబడులు మట్టిపాలయ్యాయి. ఇప్పటికే వందలాది ఎకరాల్లో పంటను దున్నేశారు. పిచికారీ మందులు వినియోగించినా ఫలితం కనిపించడం లేదని మొలగవల్లి గ్రామానికి చెందిన రైతులు లక్ష్మన్న, గాదిలింగ, మల్లికార్జున, హనుమన్న తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తేమకు జొన్న విత్తు వేస్తున్నామని తెలిపారు. తెగులు కారణంగా ఈ ప్రాంత రైతులకు రూ.కోటికి పైగానే నష్టం వచ్చినట్లు భావిస్తున్నారు. పంట దుస్థితిని చూసి లింగమయ్య అనే రైతు రెండు రోజుల క్రితం పొలంలోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు. 


మూడెకరాలు దున్నేశాం..


నాకున్న మూడెకరాల్లో రూ.40 వేలు ఖర్చు చేసి పప్పుశనగ పంటను సాగు చేశాను. ఇటీవల తుఫాన్‌ కారణంగా వర్షాలు కురవడంతో పంటకు వేరుకుళ్లు సోకింది. పంటను దక్కించుకునేందుకు రసాయన మందులు వాడాను. అయినా ఫలితం కనిపించలేదు. రోజు రోజుకూ పంట ఎండిపోతోంది. చేసేదిలేక దున్నేశాను. వేరే ఏదైనా పంటను సాగు చేద్దామని చదును చేస్తున్నాను. 


- లక్ష్మన్న, మొళగవల్లి


జొన్న సాగు చేస్తాను..


నాలుగు ఎకరాల్లో శనగ పంటను తొలగించాను. అందులో జొన్న సాగు చేస్తే కనీసం తిండి గింజలైనా వస్తాయి. నాలుగు ఎకరాలకు రూ.60 వేలకు పైగా ఖర్చు చేశాను. తేమ శాతం అధికం కావడంతో ఎన్నడూ లేని విధంగా వేరుకుళ్లు తెగులు సోకింది. ప్రతి సంవత్సరం ఏదో ఒక సమస్యతో పంటను కోల్పోతున్నాం. ప్రభుత్వం సాయం అందించి ఆదుకోవాలి. 


- గాదిలింగ, మొళగవల్లి

Updated Date - 2021-11-12T05:54:07+05:30 IST