జిల్లాతో రోశయ్యకు విడదీయరాని అనుబంధం

ABN , First Publish Date - 2021-12-05T05:23:49+05:30 IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, తమిళ నాడు గవర్నరుగా పనిచేసిన డాక్టరు కొణిజేటి రోశయ్యకు జిల్లాతో పాటు చీరాల నియోజకవర్గంతో అవినాభావ బంధం ఉంది.

జిల్లాతో రోశయ్యకు విడదీయరాని అనుబంధం
రోశయ్య పార్ధివదేహం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే కరణం బలరాం, వెంకటేష్‌

మాజీ సీఎం, దివంగత కొణిజేటి రోశయ్యకు జిల్లాతో విడదీయరాని అనుబంధం ఉంది. శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన రెండుసార్లు చీరాల నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పాటు మంత్రివర్గంలో క్రియాశీలకంగా పనిచేశారు. 2004-2009 మధ్యకాలంలో ఐదేళ్లపాటు జిల్లా మంత్రిగా పనిచేశారు. అలాగే నర్సరావుపేట ఎంపీగా జిల్లాలోని పశ్చిమప్రాంతానికి ప్రతినిధిగా పనిచేశారు. ఇలా పలు రకాలుగా జిల్లాలోని విభిన్నరంగాల వారితో సన్నిహితంగా ఉండేవారు. అలాంటి మంచి మనిషి రోశయ్య అనారోగ్యంతో శనివారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన మరణానికి జిల్లాలోని వివిధరంగాల వారు దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. 

చీరాల, డిసెంబరు 4: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌  ముఖ్యమంత్రిగా, తమిళ నాడు గవర్నరుగా పనిచేసిన డాక్టరు కొణిజేటి రోశయ్యకు జిల్లాతో పాటు చీరాల నియోజకవర్గంతో అవినాభావ బంధం ఉంది. శనివారం ఆయన మరణవార్త తెలిసి ఆయనతో పరిచయం ఉన్న జిల్లా నేతలు, వివిధవర్గాల ప్రజలు పార్టీలకతీతంగా నివాళులర్పించారు. జనతాపార్టీ తరపున 1978లో చీరాలలో ప్రగడ కోటయ్యపై రోశయ్య పోటీచేసి ఓటమి చవిచూశారు. ఆ తర్వాత మూడు పర్యాయాలు 1989, 1994, 2004లలో కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీచేశారు. 1989, 2004 ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994లో పాలేటి రామారావు చేతిలో ఓటమి చెందారు. ఎమ్మెల్సీగా మంత్రి పదవిలో కొనసాగిన సందర్భంలోనూ ఆయన చీరాల ప్రజలతో కలసి ప్రయాణం చేశారు.  చిన్న, పెద్ద తేడాలేకుండా అందరిని ఆప్యాయంగా పలకరించే వ్యక్తిగా చీరాల ప్రజల మన్ననలు రోశయ్య పొందారు.

ఎవరో కాళ్లు నరికేస్తామన్నారు..

స్థానికంగా నెలకొన్న రాజకీయ విభేదాల నేపథ్యంలో ఓ నాయకుడు ఈసారి రోశయ్య చీరాల వస్తే కాళ్లు నరికేస్తామని వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత చీరాలకు వచ్చిన రోశయ్య రైల్వేస్టేషన్‌లో రైలు ఆగాక తన బోగీ నుంచి దిగకుండా గేటు వద్ద నుంచొని అటూఇటు చూస్తూ ఉన్నాడు. ఆయనతో చనువున్నవారు రైలు నుంచి దిగమని కోరారు. చీరాలలో కాలుపెడితే కాళ్లు నరికేస్తామన్నారంట, అందుకని దిగకుండా చూస్తున్నానని చమత్కరించారు. దీంతో విషయం అర్థమైన అందరూ ఆయన సమయస్ఫూర్తిని మరోమారు చెప్పుకున్నారు.

అభివృద్ధిలో ప్రత్యేకస్థానం

చీరాల ఎమ్మెల్యేగా రోశయ్య ఎన్నికై ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ కూడా ప్రాంత అభివృద్ధికి కృషిచేశారు. ప్రస్తుతం సర్వహంగులతో ఉన్న మున్సిపల్‌ కార్యాలయం ఆయన హయాంలోనే నిర్మించారు. అతి ఇరుకు రోడ్డుగా ఉన్న కొట్లబజారు విస్తరణతో పాటు పలు రోడ్లు విస్తరణకు శ్రీకారం చుట్టింది ఆయన హయాంలోనే.

పలువురు సంతాపం..

రోశయ్య పార్థివదేహానికి చీరాల, అద్దంకి, పర్చూరు ఎమ్మెల్యేలు కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు, కరణం వెంకటేష్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో రోశయ్య నివాసంలో ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు  ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, రోశయ్య మరణవార్తతో చీరాల ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వైసీపీ నేత కరణం వెంకటేష్‌, చాంబర్‌ ఆఫ్‌ కామర్‌ అధ్యక్షుడు టి.వెంకటసురేష్‌, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ సంతాపాన్ని ప్రకటించారు. వేటపాలెంలో మాజీ పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో సంతాపం తెలిపారు. కార్యక్రమంలో పత్తి వెంకట సుబ్బారావు పాల్గొన్నారు. చీరాల మున్సిపల్‌ కార్యాలయం వద్ద మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సంతాపం తెలిపారు. చీరాల కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అధ్యక్షుడు గుంటూరు మాధవరావు, రవిపార్శిల్‌ సర్వీస్‌, రవి షామింగ్‌ మాల్‌ అధినేత తిరువీధుల బాల నాగేంద్ర రవికుమార్‌ సంతాపం ప్రకటించారు.

 రోశయ్యతో ఏలూరికి అనుబంధం

పర్చూరు:కె.రోశయ్యతో ఉన్న అనుబంధాన్ని ఎమ్మె ల్యే ఏలూరి సాంబశివరావు గుర్తుచేసుకున్నారు. రోశయ్య మరణం పట్ల ఏలూరి శని వారం ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. రోశయ్య సీఎంగా ఉన్న సమ యంలో తన అనుభవాన్ని ఎమ్మెల్యే గుర్తుచేసుకున్నారు. రైతాంగానికి వ్యవసాయ పరి జ్ఙానాన్ని సులభమైన సరళమైన రీతిలో ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక పద్ధతులను అందిం చేందుకు ఎమ్మెల్యే ఏ లూరి సంపాదకునిగా ప్రవేశపెట్టిన అగ్రిక్లినిక్‌ మ్యాగజైన్‌ను అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య తన చేతుల మీదుగా ఆవిష్కరించారన్నారు. 

Updated Date - 2021-12-05T05:23:49+05:30 IST