YS Jagan ఓదార్పు.. KCR దీక్ష మధ్య నలిగి.. చివరకు ముఖ్యమంత్రిగా వైదొలగి..!

ABN , First Publish Date - 2021-12-05T09:08:49+05:30 IST

ప్రతి ముఖ్యమంత్రికీ విధేయుడిగా, సమర్థమైన మంత్రిగా పేరు తెచ్చుకున్న రోశయ్య... అనూహ్యంగా ముఖ్యమంత్రి అయ్యారు. అంతే అనూహ్య పరిస్థితుల మధ్య ఆయన పీఠం నుంచి వైదొలిగారు. ఆయన సుమారు 14 నెలలపాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు.

YS Jagan ఓదార్పు.. KCR దీక్ష మధ్య నలిగి.. చివరకు ముఖ్యమంత్రిగా వైదొలగి..!

  • అనూహ్యంగా అధికార పీఠం!

హైదరాబాద్ సిటీ : ప్రతి ముఖ్యమంత్రికీ విధేయుడిగా, సమర్థమైన మంత్రిగా పేరు తెచ్చుకున్న రోశయ్య... అనూహ్యంగా ముఖ్యమంత్రి అయ్యారు. అంతే అనూహ్య పరిస్థితుల మధ్య ఆయన పీఠం నుంచి వైదొలిగారు. ఆయన సుమారు 14 నెలలపాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నిజానికి... ఆయనకు అదో ముళ్ల కిరీటం! 2009 సెప్టెంబరు 2... అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు. ఆయన తర్వాత సీఎంగా ఎవరిని నియమించాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం మల్లగుల్లాలు పడింది. వైఎస్‌ తనయుడు జగన్మోహన్‌రెడ్డికే ఈ బాధ్యతలు అప్పగించాలని నాటి 156 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో మెజారిటీ సభ్యులు సంతకాలు పెట్టి పంపారు. అధిష్ఠానం నిరాకరించింది.


ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ బలోపేతం.. ఇదే సమయంలో తెలంగాణ ఉద్యమం తీవ్రతరం కాకుండా అడ్డుకోవాలన్న కోణంలో పలువురు సీనియర్‌ నేతల పేర్లను పరిశీలించింది. ఆ పరిస్థితుల్లో నాటి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ.. రోశయ్య పేరును ప్రతిపాదించారు.  సెప్టెంబరు 3న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే కేబినెట్‌ సహచరులు ఆయనకు పెద్దగా సహకరించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అటు జగన్‌ రాజకీయంగా పట్టు సాధించేందుకు ఓదార్పు యాత్రకు సిద్ధమయ్యారు. ఇందుకు అధిష్ఠానం అనుమతివ్వకపోవడంతో ఆయన గుర్రుగా ఉన్నారు. సొంత పార్టీ పెట్టే యోచనలో ఉన్నారని కూడా ప్రచారం జరుగుతోంది.


ఇదే సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆమరణ దీక్ష చేపట్టారు. ఉద్యమం ఉధృతమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో రోశయ్యను తప్పించి మరొకరిని సీఎంగా నియమించాలని అధిష్ఠానం భావించింది. మరి ఎవరిని ఆ పదవిలో కూర్చోపెట్టాలా అని మళ్లీ తర్జనభర్జన పడింది. అనూహ్యంగా నాటి అసెంబ్లీ స్పీకర్‌ నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆయన పేరును కూడా ప్రణబ్‌ ముఖర్జీయే సూచించడం గమనార్హం. కిరణ్‌ను సీఎం చేస్తున్నామని.. రాష్ట్ర విభజనపై అధిష్ఠానం తగు సమయంలో నిర్ణయం తీసుకుంటుందని ప్రణబ్‌ ప్రకటించారు. హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రిలో ఆమరణ దీక్షలో ఉన్న కేసీఆర్‌కు రోశయ్య నిమ్మరసం తాగించి దీక్షను విరమింపజేస్తారని ప్రచారం జరిగింది. ఆయన కూడా హుటాహుటిన ఢిల్లీ నుంచి బేగంపేట చేరుకున్నారు.


అయితే సమైక్యవాదిగా ముద్రపడిన రోశయ్యతో కాకుండా.. ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగతో కేసీఆర్‌కు నిమ్మరసం తాగించడం గమనార్హం. ఇలాంటి అవమానకర ఘటనలను రోశయ్య దిగుమింగుకున్నారే తప్ప.. ఎక్కడా బయటపడలేదు. అధిష్ఠానాన్నీ పల్లెత్తు మాటనలేదు. కాంగ్రెస్‌ పెద్దల సూచన మేరకు 2010 నవంబరు 24వ తేదీన తన పదవికి రాజీనామా చేసేశారు.

Updated Date - 2021-12-05T09:08:49+05:30 IST