India vs South Africa: భారత బౌలర్లను రఫ్పాడించిన రూసో.. భారత్ ఎదుట కొండంత లక్ష్యం

ABN , First Publish Date - 2022-10-05T02:34:19+05:30 IST

భారత్‌తో ఇక్కడ జరుగుతున్న చివరి టీ20లో దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి

India vs South Africa: భారత బౌలర్లను రఫ్పాడించిన రూసో.. భారత్ ఎదుట కొండంత లక్ష్యం

ఇండోర్: భారత్‌తో ఇక్కడ జరుగుతున్న చివరి టీ20లో దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు సాధించి ప్రత్యర్థికి కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది. మ్యాచ్‌ను గెలవాలన్న కసితో ఆడిన సఫారీలు భారత బౌలర్లను ఆటాడుకున్నారు. ముఖ్యంగా రిలీ రూసో (Rossouw) రఫ్పాడించాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ బౌలర్లను బెంబేలెత్తించాడు. చివర్లో డేవిడ్ మిల్లర్ వీర విజృంభణతో జట్టు స్కోరు 220 పరుగులు దాటేసింది. 


ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ధాటిగా ప్రారంభించింది. 30 పరుగుల వద్ద మూడు పరుగులు మాత్రమే చేసి అవుటైన కెప్టెన్ తెంబా బవుమా అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన రిలీ రూసో(Rossouw) ఆటను పూర్తిగా మార్చేశాడు. క్రీజులో కుదురుకున్నా భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. మరోవైపు క్వింటన్ డికాక్ కూడా చిచ్చర పిడుగల్లే చెలరేగాడు. దీంతో స్కోరు బోర్డుపై పరుగుల ప్రవాహం మొదలైంది. ఇద్దరూ కలిసి భారత బౌలర్లను ఆటాడుకున్నారు. ఈ క్రమంలో 43 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేసిన డికాక్ రనౌట్ అయ్యాడు. 


అనంతరం క్రీజులోకి వచ్చిన ట్రిస్టాన్ స్టబ్స్‌తో కలిసి రూసో విజృంభణ కొనసాగింది. ఈ క్రమంలో 48 బంతుల్లో 7 ఫోర్లు 8 సిక్సర్లతో రూసో(Rossouw) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక 23 పరుగులు చేసిన స్టబ్స్ అవుటయ్యాక వచ్చిన మిల్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. చాహర్ వేసిన చివరి ఓవర్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. 5 బంతులు మాత్రమే ఆడిన మిల్లర్ 3 సిక్సర్లతో 19 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో చాహర్, ఉమేశ్‌కు చెరో వికెట్ దక్కింది.

Updated Date - 2022-10-05T02:34:19+05:30 IST