చుట్టేస్తున్న కరోనా

ABN , First Publish Date - 2022-01-26T06:27:38+05:30 IST

కరోనా మహమ్మారి రాజన్న సిరిసిల్ల జిల్లాలో అందరినీ చుట్టేస్తోంది. మరోవైపు జిల్లాలో పాజిటివ్‌ లక్షణాలు ఉన్నా జనం బయట తిరుగుతన్నారు. కరోనా వ్యాప్తికి మరింత దోహదపడుతున్నారు.

చుట్టేస్తున్న కరోనా

   - వేగంగా విస్తరిస్తున్న థర్డ్‌వేవ్‌ 

- జనంలో నిర్లక్ష్యం 

- బయట తిరుగుతున్న పాజిటివ్‌ వ్యక్తులు 

-  జిల్లాలో 8.21 శాతం పాజిటివ్‌ రేటు

-  ప్రస్తుతం 1430 కొవిడ్‌ బాధితులు 

- లెక్కలోకి రాని ప్రైవేటు కొవిడ్‌ పరీక్షలు 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

కరోనా మహమ్మారి రాజన్న సిరిసిల్ల జిల్లాలో అందరినీ చుట్టేస్తోంది. మరోవైపు జిల్లాలో పాజిటివ్‌ లక్షణాలు ఉన్నా జనం బయట తిరుగుతన్నారు. కరోనా వ్యాప్తికి మరింత దోహదపడుతున్నారు. ఇంటింటి ఫీవర్‌ సర్వేలో లక్షణాలను గుర్తించి కిట్‌లు అందించినా ఇళ్లలో ఉండడం లేదు. ఏడు రోజులకే  హోం ఐసోలేషన్‌ను నుంచి బయటకు రావచ్చని చెబుతుండడంతో పూర్తిగా తగ్గకున్నా తిరిగేస్తున్నారు.   సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మొదటి, రెండో వేవ్‌ కంటే  థర్డ్‌వేవ్‌ వేగంగా విస్తరిస్తోంది. జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌ కేసులు భారీగా  నమోదవుతున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లోనే  రోజుకు వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ప్రైవేటులోనూ కొవిడ్‌ కిట్‌లు అందుబాటులో ఉంటుండడంతో ఇళ్లు, ప్రైవేటు ఆస్పత్రుల్లో నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్న వారి సంఖ్య లెక్కలోకి రావడం లేదు. ప్రస్తుతం జిల్లాలో  కరోనా రేటు 8.21 శాతం పెరిగింది. మరోవైపు ఒమైక్రాన్‌ కేసులు కూడా పెరుగుతుండడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జనవరిలో ఇప్పటి వరకు 2 వేలకు పైగా కేసులు వచ్చాయి. ప్రైవేటులో మరో 2 వేల వరకు ఉంటాయని భావిస్తున్నారు. జిల్లాలో ఫస్ట్‌వేవ్‌లో 13,380 మంది కొవిడ్‌ బారిన పడగా 165 మంది మృతిచెందారు. సెకండ్‌ వేవ్‌లో 19,040 మంది వైరస్‌ బారిన పడగా 404 మంది మరణించారు. జిల్లాలో ఇప్పటివరకు 2020 సంవత్సరం ఏప్రిల్‌లో 2.91 శాతం, మే 27.91 శాతం, జూన్‌ 2.61 శాతం, జూలై 15.33 శాతం, ఆగస్టు 27.10 శాతం, సెప్టెంబరు 20.48 శాతం అక్టోబరు 7.88 శాతం, నవంబరు 4.13 శాతం, డిసెంబరు 1.63 శాతం కొవిడ్‌ రేటు ఉంది. 2021 సంవత్సరం జనవరిలో 1.35 శాతం, ఫిబ్రవరి 0.96 శాతం, మార్చి 1.95 శాతం, ఏప్రిల్‌ 20.04 శాతం, మే 30.9 శాతం, జూన్‌ 1.91 శాతం, జూలై 1.22 శాతం, ఆగస్టు 0.73 శాతం, సెప్టెంబరు 0.32 శాతం, అక్టోబరు 0.60 శాతం, నవంబరు 0.10 శాతం, డిసెంబరు 0.05 శాతం ఉండగా ప్రస్తుత ఏడాది జనవరిలో 8.21 శాతం కొవిడ్‌ రేటుగా కొనసాగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు 34,234 మంది కొవిడ్‌ బారిన పడగా 32,234 మంది కోలుకున్నారు. 1430 మంది చికిత్స పొందుతున్నారు. థర్డ్‌వేవ్‌లో నలుగురు మృతిచెందారు. ఇందులో ఒకరు హోం ఐసోలేషన్‌లో మృతి చెందగా మరో ఇద్దరు ఇతర వ్యాధులతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరి కొవిడ్‌ బారిన పడ్డవారు ఉన్నారు. మరొకరు కొవిడ్‌ పాజిటివ్‌ అని తెలియడంతోనే గుండెపోటుతో మరణించారు. జిల్లాలో ఎటు చూసినా కరోనా లక్షణాలతో బాధపడుతున్నావారు ఉన్నారు. 


ఫీవర్‌ సర్వేతో ముందస్తు గుర్తింపు 

జిల్లాలో థర్డ్‌వేవ్‌ కట్టడికి ఫీవర్‌ సర్వే దోహదపడుతోందని చెప్పుకోవచ్చు.  జిల్లాలో 496 బృందాలు  1.51 లక్షల ఇళ్లలో సర్వే చేపట్టేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగారు. ఇప్పటికే 11 విడతల్లో  ఫీవర్‌ సర్వే పూర్తి చేశారు. కొవిడ్‌ థర్డ్‌వేవ్‌లో చేపట్టిన ఫీవర్‌ సర్వేలో ఇప్పటి వరకు 1,13,934 ఇళ్లలో సర్వే చేశారు. ఇందులో 2404 మంది జ్వరపీడితులను గుర్తించి కిట్లను అందించారు. బయట తిరగవద్దని చెబుతున్నా జ్వరపీడితులు ఎక్కడికిపడితే అక్కడికి వెళ్తున్నారు. మరొకరికి కరోనా లక్షణాలను అంటిస్తున్నారు. 

 ఉద్యోగుల్లో కొవిడ్‌ భయం

థర్డ్‌వేవ్‌లో కొవిడ్‌ ఎవరినీ వదలడం లేదు. ఇప్పటికే అనేకమంది ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు కొవిడ్‌ బారిన పడ్డారు. జిల్లా కేంద్రంలోని నర్సింగ్‌ కళాశాల విద్యార్థులు ఎక్కువ సంఖ్యలోనే మహమ్మారితో ఇబ్బందులు పడ్డారు. కళాశాలలు, పాఠశాలలు మూసి వేయడంతో కొంతమేరకు విద్యార్థులకు కొవిడ్‌కు దూరమైనట్లుగా భావించవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోజురోజుకు కరోనా విజృంభిస్తుండడంతో విధులు నిర్వర్తించేందుకు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.   బ్యాంక్‌ ఉద్యోగులు కొవిడ్‌ బారిన పడుతున్నారు. జిల్లా అంతా వేగంగా విస్తరిస్తున్న క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని గుబులు చెందుతున్నారు.

ఆగని సమావేశాలు.. కార్యక్రమాలు 

కరోనా థర్డ్‌వేవ్‌ భయాందోళనలకు గురి చేస్తున్నా జిల్లాలో సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ ఆగడం లేదు.  వివిధ పార్టీలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.  ఫిబ్రవరిలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఉండడంతో తొలి మొక్కు వేములవాడ రాజరాజేశ్వర స్వామికి చెల్లించుకోవడానికి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. దీంతో వేములవాడలో కరోనా వ్యాప్తికి కారణం అవుతోంది. దేవస్థానం ఉద్యోగులు కూడా వైరస్‌ బారిన పడ్డారు.  కొవిడ్‌ నిబంధనలు పాటిస్తున్నామని చెబుతున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం పాటిస్తున్నా దాఖలాలు లేవు. కనీసం మాస్క్‌లు ధరించని పరిస్థితి. భౌతిక దూరం కూడా మరిచిపోతున్నారు.  దీంతో జిల్లాలో కరోనా మరింత తిష్టవేస్తుందని భావిస్తున్నారు. 


Updated Date - 2022-01-26T06:27:38+05:30 IST