రొట్టెల పండుగకు రారండహో!

ABN , First Publish Date - 2022-08-09T05:55:16+05:30 IST

నెల్లూరు నగరానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన వరాల రొట్టెల పండుగకు సర్వం సిద్ధమైంది.

రొట్టెల పండుగకు రారండహో!
బారాషహీద్‌ దర్గాలో భక్తులు

నేటినుంచి వరాల పండుగ

విస్తృత ఏర్పాట్లు.. కట్టుదిట్టమైన భద్రత

విద్యుద్ధీప వెలుగుల్లో బారాషహీద్‌ దర్గా

ఇప్పటికే తరలివస్తున్న భక్తజనం


నెల్లూరు (సాంస్కృతికం), ఆగస్టు 8 : నెల్లూరు నగరానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన వరాల రొట్టెల పండుగకు సర్వం సిద్ధమైంది. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్ల తర్వాత ఈ ఏడాది జరుగుతున్న పండుగకు సుమారు 10 లక్షల మందికిపైగా భక్తులు వస్తారని జిల్లా యంత్రాంగం ఆశిస్తోంది. ఆ మేరకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. నగర పాలక సంస్థ దాదాపు రూ.2.75 కోట్లతో స్వర్ణాల చెరువు ఘాట్‌కు మరమ్మతులు, షవర్‌ బాతింగ్‌ ఏర్పాట్లు, విద్యుత్‌, మంచినీరు వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. కోరికల రొట్టెలు అందుకునేందుకు తరలి వచ్చే ప్రతి భక్తుడు క్షేమంగా తిరిగి వెళ్లే వరకు అవసరమైన వసతులు, భద్రత కల్పించేందుకు జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా దర్గా ప్రాంగణంలోనే ఉంటూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు.


2015లో రాష్ట్ర పండుగగా..

రొట్టెల పండుగకు నాలుగు శతాబ్దాలకుపైగా చరిత్ర ఉంది. ‘స్వర్ణాల తీరంలో బారాషహీద్‌ దర్గాలో అమరులైన షహీదులను నమ్మిన వారి కోరికలు తీర్చే దర్గాగా ప్రతి ఏటా గంథమహోత్సవం - రొట్టెల పండుగ ప్రసిద్ధికెక్కింది.  దేశం నలుమూలల  నుంచేగాక విదేశాల నుంచి సైతం భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకోవడంతో 2015లో దీనిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది. 


ఆచారం..

కుల, మతాలకు అతీతంగా భక్తులు తమ కోరికలు తీరాలంటే రొట్టెలు పంచాలి. కోరికలు తీరినవారు మరుసటి సంవత్సరం ఇక్కడ రొట్టెలు వదలాలి ఇదీ ఈ పండుగ ఆచారం. తొలుత ఈ రొట్టెల మార్పిడి కేవలం మహిళలకే పరిమితమైంది. తొలుత సంతానం, వివాహం, ఆరోగ్యం, సౌభాగ్యం కలగాలని రొట్టెలు పట్టుకునేవారు - వదిలేవారు. ఆ తర్వాత కాలక్రమేణా అన్ని వయస్సుల వారు,  ఏ కులం, మతం వారైనా ఆనందంగా కోర్కెల రొట్టెలు పట్టుకోవడం, వదలడం భక్తిశ్రద్ధలతో చేయడంతో రొట్టెల పండుగ విశ్వవ్యాప్తమైంది. వివాహం, సంతానం, ఆరోగ్యం, సౌభాగ్యం, ఉద్యోగం, పదోన్నతి, గృహ, రుణం, విదేశీయానం, విదేశీవిద్య, తదితర 18 రకాల రొట్టెలను వదలడం, పట్టుకోవడం జరుగుతోంది. 


మెరుగైన సౌకర్యాలు

రొట్టెల పండుగకు భక్తులు సంఖ్య లక్షలకు చేరడంతో  మౌలిక వసతుల అవసరం పెరిగింది. 2015లో ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించి రూ.125లక్షలతో మౌలిక వసతులకు శ్రీకారం చుట్టింది. 2016లో 200 మీటర్ల స్వర్ణాల చెరువుకు ఘాట్‌ నిర్మాణం, యాత్రికులకు వసతి గృహం, ముసాఫిర్‌ ఖానా, 120 శాశ్వత మరుగుదొడ్లు, సిమెంటు రోడ్లు, విద్యుత్‌ అలంకరణ, పారిశుధ్యం, నిఘా కెమెరాల ఏర్పాటు, మంచినీటి సరఫరా, వైద్యశిబిరాలు వంటి సౌకర్యాలకు రూ.8 కోట్లు వెచ్చించారు. భక్తుల కోసం వక్ఫ్‌ బోర్డు రూ.16లక్షలు ఖర్చు చేసింది. ఇప్పుడు కరోనా విరామం తర్వాత పండుగ నిర్వహణకు కార్పొరేషన్‌ రూ.2.75 కోట్లకుపైగా ఖర్చు చేస్తోంది. 


పండుగ వివరాలు

బారాషహీద్‌ దర్గాలో ఒక రోజు నిర్వహించే ఈ పండుగ ఇప్పుడు ఐదురోజులకు చేరింది. మంగళవారం రాత్రి నుంచి 10గంటలపైన షాహాదత్‌ సౌందర్‌మాలి (12సమాధులను శుభ్రం చేసి గంధం పూయడం, 10వ తేదీ అర్ధరాత్రి గంథమహోత్సవం, 11వ తేదీ తెల్లవారజాము నుంచి రొట్టెల పండుగ ప్రారంభం, 12వ తేదీ ఉదయం 9గంటలకు తహలీల్‌ఫాతేహా (గంధం ప్రసాదం పంపిణీ), రాత్రి 9 గంటలకు ఖవ్వాలీ (సంప్రదాయ సంగీత కచేరి), 13వతేదీ ఉదయం 11గంటలకు పండుగ ముగింపు కార్యక్రమాలు జరుగుతాయి.


షికారుకు కొత్త బోట్లు

పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బారాషహీద్‌ దర్గా ప్రాంగణంలో బోటు క్లబ్‌ ద్వారా యాత్రికులకు బోట్‌ షికారు చేసే సౌకర్యం ఉంది. ప్రస్తుతం రెండు పెద్ద బోట్లు ఉండగా మరో కొత్త బోటు, స్పీడ్‌ బోట్లను ఏర్పాటు చేస్తున్నట్లు పర్యాటక అభివృద్ధి సంస్థ డివిజనల్‌ మేనేజర్‌ ఎ.సాంబశివారెడ్డి తెలిపారు. 

 

భక్తులకు అన్ని వసతులు కల్పించండి: మంత్రి కాకాణి 

దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర  మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో కలిసి సోమవారం సాయంత్రం ఆయన దర్గా ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం అధికారులు, దర్గా కమిటీతో సమీక్షించారు. మౌలిక సదుపాయాలతోపాటు ట్రాఫిక్‌, భద్రత, పారిశుధ్యం మెరుగు తదితర వాటిపై నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమీక్షలో కలెక్టర్‌ చక్రధర్‌బాబు, మేయర్‌ స్రవంతి, కమిషనర్‌ హరిత, నెల్లూరు ఆర్డీవో మాలోల తదితరులు పాల్గొన్నారు.  

 

2173 మందితో నిఘా

నెల్లూరు (వెంకటేశ్వరపురం) : రొట్టెల పండుగకు  2,173 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ విజయరావు తెలిపారు. నగరంలోని పోలీసు కవాతు ప్రాంగణంలో సోమవారం రొట్టెల పండుగ బందోబస్తు సిబ్బందితో ఆయన సమావేశమై మాట్లాడారు. నలుగురు అదనపు ఎస్పీలు, 12 డీఎస్పీలు, 37 మంది సీఐలు, 140 మంది ఎస్‌ఐలు వివిధ విభాగాల కానిస్టేబుళ్లు బందోబస్తు విధుల్లో ఉంటారని తెలిపారు. అలాగే ప్రత్యేక డ్రోన్‌ కెమెరాలతో ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. పర్యాటకుల కోసం 13 మేజర్‌, 12 మైనర్‌ పార్కింగ్‌ ప్రదేశాలను ఏర్పాటు చేశామన్నారు. 


4 రూట్లుగా ట్రాఫిక్‌ విభజన 

నెల్లూరురూరల్‌ : ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు 4 రూట్లుగా కేటాయించి, పార్కింగ్‌ సదుపాయం కల్పించినట్లు ఎస్పీ విజయరావు తెలిపారు. సోమవారం నెల్లూరులోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. భారీ వాహనాలన్నీ నగర శివార్లలోనే ఆపేసి అక్కడే తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. అక్కడ నుంచి సిటీలోని లోకల్‌ ఆటోల్లో దర్గాకు చేరుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. కేవలం అత్యవసర వాహనాలకే దర్గా ప్రాంగణంలోకి అనుమతులు ఇచ్చామన్నారు. ప్రజల రద్దీని డ్రోన్లతో ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నామని, 10వ తేదీన డీకే కళాశాలలో జరిగే పరీక్షలకు ఎలాంటి ఆటంకం తలెత్తనీయమని చెప్పారు.   


బారాషహీద్‌ దర్గా అభివృద్ధికి 15కోట్లు

నెల్లూరు (జడీ ్ప) : బారాషహీద్‌ దర్గా అభివృద్ధికి రూ.15 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మతసామరస్యానికి చిహ్నంగా జరిగే రొట్టెల పండుగకు లక్షలాది మంది భక్తులు విచ్చేస్తుంటారని, అయితే, దర్గాలో మౌలిక వసతుల కల్పనకు రూ.15కోట్ల మేర నిధులు అవసరం ఉందని దానికి సంబంధించిన ప్రతిపాదనలను ఇటీవల రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రభుత్వానికి పంపారు. దీంతో రూ.15కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నిధులతో దర్గాలో ప్రత్యేకంగా మసీదు రోడ్లు, ప్రహరీ, స్వర్ణాల చెరువులో  పలు సౌకర్యాలు కల్పించనున్నారు. త్వరలోనే టెండర్లు పిలిచి బారాషహీద్‌ దర్గాను అందంగా ఆహ్లాదంగా పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు ఉండేలా పనులు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి తెలిపారు.  



Updated Date - 2022-08-09T05:55:16+05:30 IST