Rottela Panduga: వరాల రొట్టెను పట్టుకుందాం రండి!

ABN , First Publish Date - 2022-08-09T01:56:45+05:30 IST

మత సామరస్యానికి ప్రతీకగా నెల్లూరులోని బారాషహీద్‌ దర్గా వద్ద జరిగే రొట్టెల పండుగ (Rottela Panduga) మంగళవారం ప్రారంభం కానుంది.

Rottela Panduga: వరాల రొట్టెను పట్టుకుందాం రండి!

నెల్లూరు: మత సామరస్యానికి ప్రతీకగా నెల్లూరులోని బారాషహీద్‌ దర్గా వద్ద జరిగే రొట్టెల పండుగ (Rottela Panduga) మంగళవారం ప్రారంభం కానుంది. 13వ తేదీ వరకు జరిగే ఈ పండుగ కోసం నెల్లూరు జిల్లా (Nellore District) యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. వరాల కోర్కెలు తీర్చే పండుగను 2015లో రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది. కులాలు, మతాలకు అతీతంగా భాష, ప్రాంతీయ భేదం లేకుండా  దేశం నలుమూలలు నుంచి భక్తులు ఈ పండుగ కోసం తరలివస్తారు. లక్షలాది మంది తరలి వస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగంతోపాటు నగర పాలక సంస్థ దాదాపు రూ.2.75 కోట్లతో విస్తృత ఏర్పాట్లు చేసింది. స్వర్ణాల చెరువు వద్ద దాదాపు 75 షవర్‌బాత్‌లు, శాశ్వత మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. 24 గంటలూ మూడు షిఫ్టుల్లో సిబ్బంది పనిచేసేలా పారిశుధ్యం, తాగునీరు వంటి వసతులతోపాటు పోలీసు భద్రత, పార్కింగ్‌ సౌకర్యాలు కల్పించారు. అలాగే వర్షంలో భక్తులు తడవకుండా వాటర్‌ ప్రూఫ్‌ షామియానాలు, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. 


32మందితో ఉత్సవ కమిటీని, 24మంది సభ్యులతో బారాషహీద్‌ దర్గా పరిరక్షణ కమిటీతోపాటు  భక్తులకు సేవలు అందించేందుకు వలంటీర్లను కూడా నియమించారు.  బారాషహీద్‌ దర్గాతోపాటు వెంకటాచలం మండలంలోని కసుమూరు, ఏఎస్‌పేట దర్గా, వేనాడు  దర్గాల వద్ద కూడా (తిరుపతి జిల్లా) ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాగా, రొట్టెల పండుగలో మంగళవారం, బారాషహీద్‌లకు చందనం పూయడం (శుద్ధి చేసి) 10వ తేదీ రాత్రి గంథం ఎత్తడం, 11వ తేదీ రొట్టెల పండుగ, 12వ తేదీ తహలీఫాతే హా గంధం పంపిణీ, 13వ తేదీ ముగింపు వేడుకలు జరుగుతాయి. కాగా, పండుగ రెండో రోజుల ముందు నుంచే నెల్లూరుకు భక్తులు తరలివస్తున్నారు. దర్గా ఆవరణలోని స్వర్ణాల చెరువులో పుణ్యస్నానాలు అనంతరం కోరికల రొట్టెలు పట్టుకుంటున్నారు. అలాగే కోరికలు నెరవేరిన వారు రొట్టెలను వదులుతున్నారు.

Updated Date - 2022-08-09T01:56:45+05:30 IST