Rottela Panduga: నెల్లూరులో ముగిసిన రొట్టెల పండుగ

ABN , First Publish Date - 2022-08-14T01:48:48+05:30 IST

నెల్లూరు స్వర్ణాల చెరువు వేదికగా 5 రోజుల పాటు ఘనంగా జరిగిన రొట్టెల పండుగ (Rottela Panduga) ముగిసింది.

Rottela Panduga: నెల్లూరులో ముగిసిన రొట్టెల పండుగ

నెల్లూరు: నెల్లూరు స్వర్ణాల చెరువు వేదికగా 5 రోజుల పాటు ఘనంగా జరిగిన రొట్టెల పండుగ (Rottela Panduga) ముగిసింది. రాష్ట్రం నుంచే కాక తమిళనాడు, కర్నాటక (TamilNadu Karnataka), తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పండుగకు తరలివచ్చారు. దాదాపు 6లక్షల మంది రొట్టెల పండుగకు విచ్చేసి ఉంటారని అధికారులు అంచనా. చివరి రోజు శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి జీవితాంతం సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొనసాగాలని కోరుకుంటూ రొట్టెను పట్టుకున్నారు. కరోనా కారణంగా రెండేళ్ళ తరువాత నిర్వహించిన రొట్టెల పండుగలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం పటిష్ఠమైన ఏర్పాట్లు చేసింది. అయితే రాష్ట్ర పండుగగా నిర్వహించే రొట్టెల పండుగ ఈ ఏడాది నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ రొట్టెల పండుగగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు (Chandrababu)తోపాటు ప్రతిపక్ష నాయకుల హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లు రొట్టెల పండుగకు విచ్చేశారు. అనేక మంది మంత్రులు కూడా  అప్పట్లో పాల్గొన్నారు. ఈ ఏడాది జిల్లాకు చెందిన మంత్రి కాకాణి తప్ప ప్రభుత్వం తరపున మరెవరూ పాల్గొనలేదు. ఆఖరకు జిల్లాలోని ఎమ్మెల్యేలు కూడా ఇటువైపు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. 

Updated Date - 2022-08-14T01:48:48+05:30 IST