అంగన్వాడీలకు కుళ్లిన గుడ్లు..!

ABN , First Publish Date - 2022-05-11T04:20:55+05:30 IST

అంగన్వాడీ కేంద్రాల విద్యార్థులకు కుళ్లిన కోడిగుడ్లు సరఫరా అవుతున్నాయి. వాటిని తిన్న చిన్నారులు అస్వస్థతకు గురైన సంఘటన ఇటీవల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.

అంగన్వాడీలకు కుళ్లిన గుడ్లు..!

- అస్వస్థతకు గురవుతున్న విద్యార్థులు

- విద్యార్థులకు శాపంగా మారిన పర్యవేక్షణ లోపం

- గతంలో పాలు, గుడ్లు పక్కదారి పట్టిన ఘటనలు

మంచిర్యాల, మే 10 (ఆంధ్రజ్యోతి): అంగన్వాడీ కేంద్రాల విద్యార్థులకు కుళ్లిన కోడిగుడ్లు సరఫరా అవుతున్నాయి. వాటిని తిన్న చిన్నారులు అస్వస్థతకు గురైన సంఘటన ఇటీవల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. అయితే విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు సంబంధిత అధికారులు ప్రయత్నించినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో జరిగిన తప్పును దిద్దుబాటు చేసే ప్రయత్నాల్లో అధికారులు నిమగ్నమయ్యారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న వివిధ రకాల సామగ్రి కూడా చిన్నారులకు సక్రమంగా అందడం లేదు. విద్యార్థులకు సరఫరా అవుతున్న కోడిగుడ్ల సైజు చిన్నగా ఉంటున్నాయి.  చిన్నారులకు పంపిణీ చేయాల్సిన పాలు, గుడ్లు పక్కదారి పట్టిన సంఘటనలు ఉన్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలపై సరియైన పర్యవేక్షణ లోపం కారణంగానే చిన్నారులకు చెందాల్సిన వివిధ రకాల సరుకులు పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు ’మామూలు’గా తీసుకోవడం ఇక్కడ పరిపాటిగా మారింది. 

విద్యార్థులకు అస్వస్థత...

కుళ్లిన కోడిగుడ్లు తిన్న చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పట్టణంలోని తిలక్‌నగర్‌ అంగన్‌వాడీ కేంద్రం ద్వారా కుళ్లిన కోడిగుడ్లు సరఫరా అయినట్లు తేలింది. వేసవి కావడంతో అంగన్‌వాడీ కేంద్రాలకు ఈ నెల 1వ తేదీ నుంచి సెలవులు ప్రకటించారు. దీంతో చిన్నారులు, గర్భిణులకు ప్రతీ నెల ఇచ్చే పౌష్టికాహారాన్ని అంగన్‌వాడీ టీచర్లు ఇంటి వద్దకే పంపిస్తున్నారు. తిలక్‌నగర్‌ అంగన్‌వాడీ కేంద్రం నుంచి అక్కడి చిన్నారులకు సరఫరా అయిన కోడిగుడ్లను ఈనెల 6న ఇద్దరు చిన్నారులు తినడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించ డంతో కోడిగుడ్లు కుళ్లిపోవడంతోనే చిన్నారులు అస్వస్థతకు గురైనట్లు వెల్లడైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు సంబంధిత కాంట్రాక్టర్‌ ఏయే ప్రాంతాల్లో కోడిగుడ్లు సరఫరా చేశారో తెలుసుకుని, వాటి స్థానంలో మళ్లీ కోడిగుడ్లను అందజేశారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు అధికారులు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ వారి శ్రమ ఫలించలేదు. 

బయటకు తరలిస్తున్నా పట్టని అధికారులు...

ఇదిలా ఉండగా అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే కోడిగుడ్లు విద్యార్థులకు ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తున్నారు. గతంలో పెద్ద మొత్తంలో కోడిగుడ్లు, పాల ప్యాకెట్లు ట్రాలీలో వేసుకొని ప్రైవేటుగా విక్రయించేందుకు వెళ్తుండగా నస్పూర్‌ వద్ద పోలీసులు పట్టుకున్నారు. విచారణలో సరుకంతా అంగన్‌వాడీ కేంద్రాలకు చెందినదిగా వెల్లడి కావడంతో సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లకుండా జాగ్రత్తపడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. విషయం బయటకు పొక్కడంతో సంఘటనకు బాధ్యులైన ముగ్గురు అంగన్‌వాడీ సూపర్‌వైజర్లపై సస్పెన్షన్‌ వేటువేశారు. అయితే సరుకు పక్కదారి పట్టడానికి కారణమైన అసలు దోషులను వదిలి సూపర్‌ వైజర్లపై చర్యలు తీసుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కేసు తమపైకి రాకుండా ఉండేందుకు బాధ్యులు రాజకీయ పలుకుబడిని ఉపయోగించారు. అలాగే శాఖాపరమైన చర్యలు లేకుండా చూసుకోవడంలోనూ బాఽధ్యులైన టీచర్లు సఫలమయ్యారు. 

మారని సిబ్బంది పనితీరు...

అంగన్‌వాడీ కేంద్రాల్లో జరుగుతున్న అవినీతిపై ఎన్నిమార్లు ఫిర్యాదులు వెళ్లినా సిబ్బంది పనితీరు మారడం లేదు. వారి పనితీరుపై ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా పట్టించుకోవడం లేదు. సంబంధిత శాఖకు చెందిన కొందరు అధికారుల మద్దతునే అంగన్‌వాడీ కేంద్రాల్లో అవకతవకలు జరుగుతున్నట్లు బహిరంగంగా ప్రచారం జరుగుతోంది. కొందరు కిందిస్థాయి అధికారులతో టీచర్లు, సూపర్‌వైజర్లు, సీడీపీవోలకు ఉన్న సత్సంబంధాల కారణంగానే అవినీతి రాజ్యమేలుతు న్నట్లు తెలుస్తోంది. అక్రమార్కుల నుంచి సంబంధిత అధికారులకు నెలనెల మామూళ్లు అందుతుండటంతోనే అవినీతి దందా యథేచ్ఛగా సాగుతున్నట్లు సమాచారం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాఽధికారులు ఈ విషయంలో కలుగజేసుకొని చిన్నారులు అస్వస్థతకు గురికావడానికి బాధ్యులను గుర్తించి, తక్షణ చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కాగా జరిగిన ఘటనపై వివరణ తీసుకునేందుకు జిల్లా సంక్షేమశాఖ ఇన్‌చార్జి ఉమాదేవిని ప్రయత్నించగా ఆమె ఫోన్‌లో అందుబాటులో లేరు.

Read more