కుళ్లిపోయింది!

ABN , First Publish Date - 2021-11-24T05:00:21+05:30 IST

వర్షాలకు వరి పంట నేల వాలి మొలకెత్తిందని, కుళ్లిపోయిందని రుద్రవరం మండలంలోని డి.కొట్టాల గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

కుళ్లిపోయింది!
డి.కొట్టాలలో నేలవాలి మొలకెత్తిన వరి పంట

  1.  పొలాల్లోనే మొలకెత్తిన వరి, దెబ్బతిన్న శనగ   
  2. తీవ్రంగా నష్టపోయిన రైతులు  


రుద్రవరం, నవంబరు 23: వర్షాలకు వరి పంట నేల వాలి మొలకెత్తిందని, కుళ్లిపోయిందని రుద్రవరం మండలంలోని డి.కొట్టాల గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్‌ సీజనలో 700 ఎకరాల్లో సాగు చేసిన వరి  పంట తీవ్రంగా నష్టపోయామని అంటున్నారు.  ఎకరాకు 40 బస్తాలు చొప్పున దిగుబడి రావాల్సి ఉండగా పంట మొత్తం వాలిపోయిన మొలకెత్తింది.  సుమారు 28 వేల బస్తాలకు రూ.1,200 చొప్పున మొత్తం రూ.3.36 కోట్లు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 


కుళ్లిన పంటలు

చాగలమర్రి, నవంబరు 23: వాయుగుండం ప్రభావం తగ్గినా జిల్లాలోని పలు ప్రాంతాల్లో  వర్షం ఆగిపోలేదు. దీంతో చేతికొచ్చిన పంట ఉత్పత్తులు కుళ్లిపోతున్నాయి. మంగళవారం 6 మి.మీ వర్షపాతం నమోదైంది. రాజోలి, ఎం.తండా, కేపీ తండా, ముత్యాలపాడు తదితర గ్రామాల్లో వరి పంట నేలవాలింది. గొట్లూరు, మల్లేవేముల, నేలంపాడు, పెద్దబోధనం, రాజోలి గ్రామాల్లో సాగు చేసిన 1000 ఎకరాల్లో నీరు నిలిచి కుళ్లిపోతున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 600 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. పంట కోసి ఆరబెట్టిన పంట వర్షానికి తడిసి ముద్దయింది. తడిసిన  మొక్కజొన్నను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.   నష్టపరిహారం ఇవ్వా లని రైతులు కోరుతున్నారు. 


భారీగా దెబ్బతిన్న శనగ పంట

 సంజామల, నవంబరు 23: అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న  భారీ వర్షాలకు మండల వ్యాప్తంగా శనగ పంట   దెబ్బతింది.  పంట పొలాల్లో నీరు నిలిచి పోయి  మొలకదశలోనే శనగ పంట కుళ్లిపోతోందని   రైతులు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరలతో ఎరువులు, విత్తనాలు కొని సాగు చేసిన పంటకు రెండు విడతలుగా క్రిమిసంహారక మందులు పిచికారి చేశారు. అనుకోకుండా వర్షాలు కురవడంతో పంట చేతికి దక్కేలా లేదని రైతులు అంటున్నారు. మండల వ్యాప్తంగా దాదాపు 20వేల ఎకరాల్లో రైతులు శనగ పంటను సాగు చేశారు.  పొలాలకు వెళ్లడానికి కూడా సాధ్యం కానంతగా వానలు కురవడంతో పంటను కాపాడుకోడానికి ఏం చేయాలో పాలుపోవలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   వ్యవసాయాధికారులు పంటనష్టం అంచనా వేసి  పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.  

గాలి,వాన బీభత్సం

ఓర్వకల్లు, నవంబరు 23: మండలంలోని గ్రామాల్లో మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సవానికి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలోని హుశేనాపురం, కాల్వ, సోమ యా జులపల్లె, కాల్వబుగ్గ గ్రామాల్లో వేసిన అరటి, పంటలు నేలపాలు కావడంతో రైతులకు లక్షల్లో తీవ్ర నష్టం జరిగింది.   








Updated Date - 2021-11-24T05:00:21+05:30 IST