తంబళ్లపల్లెలో రౌడీషీటర్‌ దారుణ హత్య

ABN , First Publish Date - 2021-09-16T07:28:51+05:30 IST

పాత కక్షలు, ఆధిపత్య పోరు నేపథ్యంలో ఓ రౌడీషీటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు.

తంబళ్లపల్లెలో రౌడీషీటర్‌ దారుణ హత్య
ధనేశ్వర్‌రెడ్డి

తంబళ్లపల్లె(చిత్తూరు): పాత కక్షలు, ఆధిపత్య పోరు నేపథ్యంలో ఓ రౌడీషీటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. ములకలచెరువు సీఐ సురే్‌షకుమార్‌ కథనం మేరకు... తంబళ్లపల్లె మండలం ఎర్రసానిపల్లె పంచాయతీ ఎర్రమద్దువారిపల్లెకు చెందిన ధనేశ్వర్‌రెడ్డి(35) ఇంటి మిద్దెపై నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా నరికి చంపారు. మదనపల్లె మండలం నీరుగట్టువారిపల్లెలో 15 సంవత్సరాల క్రితం రెండు గ్రూపుల మధ్య తగాదాలు జరిగేవి. హత్యలు కూడా చోటు చేసుకున్నాయి. 2014వ సంవత్సరంలో మదనపల్లెలో జరిగిన పూల చలపతి హత్య కేసులో ధనేశ్వర్‌రెడ్డి ప్రథమ నిందితుడు. 2018లో ధనేశ్వర్‌రెడ్డిపైన మారణాయుధాలు కలిగి ఉండడంతో మదనపల్లె టూ టౌన్‌ పోలీస్టేషన్‌లో పీడీ యాక్టు కేసు నమోదు చేసి కడప సెంట్రల్‌ జైలుకు పంపారు.


ధనేశ్వర్‌రెడ్డి తమ్ముడు జగదీశ్వర్‌రెడ్డి హత్య కేసులో ప్రథమ ముద్దాయిగా వున్న శివశంకర్‌రెడ్డిపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసి కడప సెంట్రల్‌ జైలుకు పంపారు. ఒకే జైలులో వుంటే గొడవలు జరుగుతాయన్న అనుమానంతో ధనేశ్వర్‌రెడ్డిని కడప నుంచి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు. వీరిద్దరు గత ఏడాది మార్చిలో బెయిల్‌పై విడుదలయ్యారు. శివశంకర్‌రెడ్డి బెంగళూరులో వుండ గా ధనేశ్వర్‌రెడ్డి స్వగ్రామమైన ఎర్రమద్దువారిపల్లెలో వుంటున్నాడు. ఈ క్రమంలో ధనేశ్వర్‌రెడ్డికి జైల్లో పరిచయమైన ఒక వ్యక్తి అప్పుడప్పుడూ కలసి వెళ్లేవాడు. మంగళవారం సాయంత్రం వచ్చిన ఆ వ్యక్తితో కలసి మిద్దెపైన నిద్రిస్తుండగా బుధవారం తెల్లవారుజామున 3గంటల ప్రాం తంలో మారణాయుధాలతో వచ్చిన కొంతమంది ధనేశ్వరరెడ్డిని నరికి చంపారు.


ఆ శబ్దాలకు ఇంట్లో నిద్రిస్తున్న ఆయన తల్లి సరోజమ్మ లేచి కేకలు పెడుతూ మిద్దె పైకి వెళ్లింది. హత్య చేయడానికి వచ్చిన నిందితులు ఆమెను పక్కకు తోసి పరారయ్యారు. ఆమె పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐ సురే్‌సకుమార్‌, ఎస్‌ఐ సహదేవి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె జిల్లా వైద్యశాలకు తరలించారు. పాత కక్షలతోనే శివశంకర్‌రెడ్డి, అతని అనుచరులు తన కొడుకును చంపారని  సరోజమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సురే్‌షకుమార్‌ తెలిపారు. తెల్లవారుజామున 3.30 నుంచి 4 గంటల మధ్య హత్య జరిగింది. పోలీసులు ఉదయం ఏడుగంటల కల్లా మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించి మార్చురీలో ఉంచారు.ఈ విషయం తెలుసుకున్న ధన అనుచరులు, బంధువులు పెద్దసంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. దీంతో తంబళ్లపల్లె పోలీసులు మార్చురీ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.


మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన జనాలను మార్చురీ గదిలోకి అనుమతించకపోవడంతో ధనేశ్వర రెడ్డి అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆస్పత్రి వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అనంతరం అక్కడి నుంచి అందరినీ దూరంగా పంపేశారు. అయినా సాయంత్రం వరకు మార్చురీ వద్దే ఉన్నారు. మృతదేహం ఫొటోలను తీసేందుకు మీడియాను కూడా గదిలోకి అనుమతించలేదు. సాయంత్రం 4 గంటలకు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించినట్లు పోలీసులు చెప్పారు.


Updated Date - 2021-09-16T07:28:51+05:30 IST