రౌడీషీటర్లపై కొరవడిన నిఘా!?

Published: Fri, 19 Aug 2022 01:04:10 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రౌడీషీటర్లపై కొరవడిన నిఘా!?

పోలీసుల పర్యవేక్షణ లేకపోవడంతో రెచ్చిపోతున్న వైనం

యథేచ్ఛగా దందాలు

ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే దాడులు

నగర బహిష్కరణ విధించినా కదలని వైనం

రికార్డుల్లో మాత్రం నగరం వెలుపల ఉన్నట్టు చూపిస్తున్న పోలీసులు

ఇతర ప్రాంతాల్లో రౌడీషీట్‌ కలిగి, నగరంలో నివాసం ఉంటున్న వారి సమాచారం కూడా కరువు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో రౌడీషీటర్లపై పోలీసుల నిఘా కొరవడింది. ప్రతి ఆదివారం మొక్కుబడిగా కౌన్సెలింగ్‌ నిర్వహించి చేతులు దులిపేసుకుంటున్నారు. నగర బహిష్కరణ విధించిన రౌడీలు  ఎక్కడ ఉన్నారు?, ఏం చేస్తున్నారు?, ఒకవేళ తిరిగి వచ్చేశారా?...అనే విషయం పట్టించుకోవడం లేదు. అలాగే ఇతర ప్రాంతాల్లో రౌడీషీట్‌ వున్నవారు నగరానికి వచ్చి ఉంటున్నా వారిని గుర్తించే ప్రయత్నం చేయడం లేదు. దీంతో రౌడీషీటర్లకు భయం లేకుండా పోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నగరంలో సుమారు 650 మంది రౌడీషీటర్లు వున్నట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇందులో కొందరు దౌర్జన్యాలు, సెటిల్‌మెంట్లు చేయడంతోపాటు తమకు ఎదురుతిరిగితే బెదిరించడం, దాడులు, హత్యలకు పాల్పడడం చేస్తున్నారు. అలాంటి వారిలో కొందరిని గుర్తించి పోలీసులు ముందుజాగ్రత్తగా నగర బహిష్కణ శిక్ష విధించారు. అయితే అటువంటి వారు ఎక్కడ వుంటున్నారో అడిగి తెలుసుకుని అక్కడి పోలీసులకు సమాచారం అందించాలి. అలాగే నగర బహిష్కరణకు గురైనవారు ఏదైనా పనిమీద రావాలన్నా, ఒకటి, రెండు రోజులు ఉండాలన్నా సరే రౌడీషీట్‌ వున్న స్టేషన్‌ పోలీసులకు సమాచారం అందించాల్సి ఉంటుంది. అయితే నగర పోలీసులు మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా పట్టించుకోవడం లేదు. బహిష్కరణకు గురైనవారు నగరంలో లేరనే భావనలోనే ఉంటున్నారు. ఒకవేళ నగరంలో వున్నట్టు తెలిసినా పట్టించుకోవడం లేదు. దీంతో నగర బహిష్కరణకు గురైనవారు కొద్దికాలం బయట ఉండి...తిరిగి వచ్చేస్తున్నారు. ఇక రౌడీషీటర్లను అదుపులో వుంచేందుకు పోలీసులు ప్రతి ఆదివారం స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్‌ ఇస్తుంటారు. అయితే కొంతమంది కౌన్సెలింగ్‌కు హాజరుకావడం లేదు. అయినప్పటికీ వారిపై చర్యలు తీసుకోవడం లేదు. దీంతో నగరంలో రౌడీషీటర్లకు భయం లేకుండా పోయింది. 

గతంలో రౌడీషీటర్‌ల కదలికలపై నిఘా కోసం ప్రత్యేకంగా  కానిస్టేబుళ్లను నియమించేవారు. రౌడీషీటర్‌ ఎక్కడకు వెళుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, అతడి ఇంటికి ఎవరెవరు వచ్చి వెళుతున్నారనే దానిపై పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం అందేది. ఎవరితోనైనా తరచూ మాట్లాడుతున్నా, కదలికలు అనుమానాస్పదంగా ఉన్నా వెంటనే కానిస్టేబుల్‌ తమ పై అధికారులకు సమాచారం అందించేవారు. దీంతో రౌడీషీటర్‌ను స్టేషన్‌కు పిలిచి పూర్తిస్థాయిలో ఇంటరాగేషన్‌ చేసి పంపించేవారు. దీనివల్ల పోలీసులు తమపై నిఘా వుంచారనే భయంతో నేరాలకు పాల్పడేందుకు రౌడీషీటర్లు భయపడేవారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకపోవడంతో రౌడీషీటర్లు తరచూ దందాలు, దాడులు, హత్యలకు పాల్పడుతున్నారు. 

ఇతర ప్రాంతాల్లో రౌడీషీట్‌ కలిగి నగరంలో నివాసం వుంటున్న వారి గురించి పోలీసుల వద్ద సమాచారం లేదు. నగరానికి చెందిన కొంతమంది ఇతర ప్రాంతాలకు ఉపాధి  కోసం వెళ్లి అక్కడ నేరాలకు పాల్పడడంతో పోలీసులు రౌడీషీట్‌ తెరుస్తుంటారు. అలాంటివారు కొన్నాళ్ల తర్వాత తిరిగి నగరానికి వచ్చేస్తుంటారు. ఇటువంటివారు తమ ప్రాంతాల్లో గ్యాంగ్‌లను తయారుచేయడం, బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడడం, చిన్నపాటి సివిల్‌ తగాదాలను సెటిల్‌మెంట్లు చేయడం చేస్తున్నారు. ఎవరైనా తమకు ఎదురుతిరిగితే వారిని అంతమొందించేందుకు కూడా వెనుకాడడం లేదు. ఎంవీపీ కాలనీ ఆదర్శనగర్‌లోని అనుపమ బార్‌ వద్ద బుధవారం హత్యకు గురైన రౌడీషీటర్‌ అనిల్‌కుమార్‌ ఉదంతం దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. అనిల్‌కుమార్‌పై కాకినాడ టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో రౌడీషీట్‌ వున్నప్పటికీ నగర పోలీసులకు ఆ విషయం తెలియదు. పోలీసుల నిఘా లేకపోవడంతో ఆ ప్రాంతంలో ఆధిపత్యం కోసం తరచూ వివాదాలు, ఘర్షణలకు పాల్పడేవాడని హత్య తర్వాత విచారణలో పోలీసులు గుర్తించారు. అదే అనిల్‌కుమార్‌పై రౌడీషీట్‌ వున్నట్టు ముందే తెలుసున్నట్టయితే ప్రతి వారం కౌన్సెలింగ్‌కు పిలిచినా కొంత భయం వుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు నగరంలో రౌడీషీటర్ల కదలికలపై గట్టి నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. నగర బహిష్కరణకు గురైన రౌడీషీటర్లు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో క్రాస్‌చెక్‌ చేసుకోవడంతోపాటు ఇతర ప్రాంతాల్లో రౌడీషీట్‌ కలిగి ఇక్కడ నివాసం వుంటున్న వారిని గుర్తించాల్సిన అవసరం వుందని కొంతమంది పోలీస్‌ అధికారులు సూచిస్తున్నారు. 


ఆధిపత్యం చలాయిస్తున్నాడని...చంపేశారు 

రౌడీషీటర్‌ అనిల్‌కుమార్‌ హత్య కేసును ఛేదించిన పోలీసులు

ప్రధాన నింతిదుడు శ్యామ్‌ప్రకాశ్‌ సహా మరో ఇద్దరు అరెస్టు


మహారాణిపేట, ఆగస్టు 18: తనపై ఆధిపత్యం చలాయిస్తుండడంతో పాటు నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడనే రౌడీషీటర్‌ బోడ్డు అనిల్‌కుమార్‌ను శ్యామ్‌ప్రకాష్‌ హత్య చేశాడని క్రైం డీసీపీ నాగన్న వివరించారు. ఈనెల 17న ఎంవీపీ కాలనీ ఉషోదయ జంక్షన్‌లో అనుపమ బార్‌ వద్ద నడిరోడ్డుపై రౌడీషీటర్‌ అనిల్‌కుమార్‌ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం పోలీస్‌ కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీపీ వెల్లడించారు. కేసులో ప్రధాన నిందితుడు వాసుపల్లి శ్యామ్‌ప్రకాశ్‌, అతడికి సహకరించిన పొట్టి ఎర్రయ్య, సమీర్‌లను గురువారం అరెస్టు చేశామన్నారు. హతుడు, నిందితులకు పదేళ్లుగా పనిచయం ఉందని, చాలాకాలంగా విభేదాలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో శ్యామ్‌పై అనిల్‌ ఆధిపత్యం ప్రదర్శిస్తూ, నిత్యం వేధింపులకు గురిచేస్తుండేవాడన్నాడు. దీంతో అతడిపై శ్యామ్‌ప్రకాశ్‌ కక్ష పెంచుకున్నాడన్నారు. 17న వీరిద్దరూ బార్‌లో కలిసి మద్యం సేవించారని, ఆ సమయంలోనే గొడవ మొదలయిందన్నారు. దీంతో బార్‌ నుంచి బయటకు వచ్చే సమయంలో శ్యామ్‌ప్రకాశ్‌ తనతో పాటు తీసుకువచ్చిన కత్తితో అనిల్‌పై విచక్షణ రహితంగా దాడి చేసి,  పొడిచి చంపాడన్నారు. గతంలో వీరిద్దరిపైనా రౌడీషీట్లు ఉన్నాయని, అనిల్‌పై ఓ హత్య కేసు కూడా నమోదైందన్నారు. నిందితులను మరింత లోతుగా విచారించి, ఇతర వివరాలు రాబడతామని ఆయన తెలిపారు. 

రౌడీషీటర్లపై కొరవడిన నిఘా!? హత్యకు ఉపయోగించిన కత్తిని చూపిస్తున్న డీసీపీ నాగన్న


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.