ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజ్‌ ట్విస్ట్‌!

ABN , First Publish Date - 2021-07-20T06:36:05+05:30 IST

విమానాశ్రయ నిర్వాసితుల మాటున వసూళ్ల ప్యాకేజీకి రంగం సిద్ధం చేసిన గన్నవరం రెవెన్యూ అధికారులు సోమవారం ఊహించని ట్విస్ట్‌ ఇచ్చారు.

ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజ్‌ ట్విస్ట్‌!

లబ్ధిదారుల జాబితా నుంచి అర్ధంతరంగా 61 మంది తొలగింపు 

అనర్హుల పేరుతో తొలగింపుపై సందేహాలు

నిన్నటి వరకు అర్హులు.. నేడు అనర్హులా?

బినామీలకు చోటు కల్పించేందుకేనా?

నేడు ప్యాకేజీ ఇళ్ల ప్లాట్లకు లాటరీ 


విమానాశ్రయ నిర్వాసితుల మాటున వసూళ్ల ప్యాకేజీకి రంగం సిద్ధం చేసిన గన్నవరం రెవెన్యూ అధికారులు సోమవారం ఊహించని ట్విస్ట్‌ ఇచ్చారు. విమానాశ్రయ నిర్వాసితుల ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీకి సర్వే జరిపి ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో 60 మందికి పైగా తొలగించారు. మంగళవారం ఆర్‌ అండ్‌ ఆర్‌ లే అవుట్‌లో ఇళ్ల ప్లాట్లకు సంబంధించి లాటరీ తీసే క్రమంలో ఈ ట్విస్ట్‌ చోటు చేసుకోవటం గమనార్హం. వీరంతా నిజంగా అనర్హులేనా? అనర్హులైతే ఇన్నేళ్లుగా రికార్డుల్లో ఎందుకు అర్హులుగా ఉన్నారనేది అధికారులే చెప్పాలి. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విమానాశ్రయ నిర్వాసితుల ఇళ్ల ప్లాట్లకు లాటరీ తీసే క్రమంలో పక్షం రోజులుగా ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలోకి అనర్హులను ఎక్కించే ప్రయత్నం జరుగుతోంది. స్థానిక వీఆర్వో సుజన్‌పై ఈ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. నిర్వాసితులుగా మారిన అర్హులను కాదని అనర్హులకు అందలం వేయటాన్ని కొందరు లబ్ధిదారులు ప్రశ్నిస్తూ తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో వెలుగు చూసిన అవినీతి బాగోతంపై ‘వసూళ్ల ప్యాకేజీ’ శీర్షికన ఆంరఽధజ్యోతి శనివారం ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ వ్యవహారంపై తహసీల్దార్‌ అంతర్గతవిచారణ చేపట్టారు. అర్హులకే పరిహారం ఇస్తామని బాధితులకు తెలియచేశారు. రెండు రోజులు గడిచిన తర్వాత సీన్‌ మారిపోయింది. 


అనర్హత ఏ ప్రాతిపదికన?

లబ్ధిదారులుగా ఎంపిక చేసి, ఇళ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వ నుంచి పరిహారం ఇప్పించటానికి ఎంపిక చేసిన 423 మంది లబ్ధిదారులలో 61 మందిపై అనర్హత వేటు వేశారు. అనర్హులను తొలగించటం మంచి విషయమే అయినప్పటికీ ఏ ప్రాతిపదికన తొలగించారన్నదానిపై రెవెన్యూ నుంచి స్పష్టత లేదు. బుద్ధవరం, దావాజీగూడెం ప్రాంతాలకు చెందిన వారిలో 423 మందిని నిర్వాసితులుగా గుర్తించారు. ఇలా గుర్తించిన వారికి ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసం చినఅవుటపల్లి గ్రామంలో 48 ఎకరాలను సేకరించి లే అవుట్‌ వేశారు. ఇలా వేసిన లే అవుట్‌లో ప్లాట్లు విభజించారు. ఈ ప్లాట్లలో గత ప్రభుత్వం మోడల్‌ ఇళ్లను నిర్మిస్తామని చెప్పింది. ప్రస్తుత ప్రభుత్వం ఇళ్లు మేము కట్టించలేం.. మీరు కట్టుకుంటామంటే రూ. 9 లక్షలు ఇస్తామని, అది కూడా రెండు వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పింది. దీనికి నిర్వాసితులు కూడా అంగీకరించారు. అప్పటి నుంచి ఇళ్ల ప్లాట్లను కేటాయించలేదు. ఇళ్లు కట్టుకోవటానికి పరిహారం కూడా ఇవ్వలేదు. 


నేడు ఇళ్ల ప్లాట్ల లాటరీ 

ఎట్టకేలకు మంగళవారం ప్లాట్ల లాటరీకి రెవెన్యూ యంత్రాంగం తెరలేపింది. దావాజీగూడెం రోడ్డులోని ఎస్‌వీఆర్‌ కల్యాణమండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రులు, కలెక్టర్‌, జేసీ, ఆర్డీవో తదితరులు హాజరు కానున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమం కోసం పక్షం రోజులుగా రెవెన్యూ యంత్రాంగం సన్నద్ధం అవుతోంది. ఈ దశలో స్థానిక వీఆర్వో, ఆర్‌ఐల కనుసన్నల్లో బినామీలకు అవకాశం కల్పించటం, వీటిపై ఫిర్యాదులు రావటంతో వివాదాస్పదమైంది. తాజాగా అర్హులుగా నిర్ణయించిన వారిలోనే భారీ సంఖ్యలో తొలగింపు చేపట్టారు. వీరంతా ఇప్పుడు రెవెన్యూ యంత్రాంగంపై భగ్గుమంటున్నారు. వీలైతే లాటరీ తీసే సమయంలోనే ఆందోళన నిర్వహించాలని బాధితులు భావిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

Updated Date - 2021-07-20T06:36:05+05:30 IST