ఆర్డీవో వసంతరాయుడుకు వినతిపత్రం అందజేస్తున్న బీజేపీ నాయకులు
- బెనిఫిట్ షోల పేరుతో టిక్కెట్ ధర రూ.1500 నుంచి రూ.2 వేలు
- మిగిలిన షోలకు రూ.500 నుంచి రూ.750 చొప్పున అమ్మకం
అమలాపురం, (ఆంధ్రజ్యోతి)/ భానుగుడి (కాకినాడ), మార్చి 24: నిన్నమొన్నటి వరకు సినిమా టిక్కెట్లు ఎక్కువకు అమ్మితే థియేటర్ సీజ్ చేసిన పరిస్థితి. కానీ ఇప్పుడు వేలల్లో టిక్కెట్ల రేట్లు అమ్ముతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. శుక్రవారం విడుదలవుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా టిక్కెట్ల ధరలు ఆకాశాన్నంటాయి. అభిమాన సంఘాల ముసుగులో కొందరు వ్యక్తులు టిక్కెట్లను బ్లాక్‌చేసి బహిరంగ విపణిలో రూ.1500 నుంచి రూ.2 వేల వరకు విక్రయిస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. భీమ్లానాయక్ విడుదల సందర్భంగా రెవెన్యూ సిబ్బంది టిక్కెట్ల రేట్లు పెంచకుండా థియేటర్ల వద్దే డ్యూటీలు నిర్వహించారు. అయితే ఇప్పుడు అధికారులు పట్టించుకోని తీరుపై వివిధ రాజకీయ పార్టీలు, అభిమాన సంఘాల నాయకులు ఫి ర్యాదులు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతి ఇవ్వడంతో టిక్కెట్టు ధరలు రూ.100 నుంచి రూ.300 వరకు విక్రయించుకునే అవకా శం ఉంది. అమలాపురం పట్టణంలోని రెండు థియేటర్లలో నాలుగు స్ర్కీన్లతోపాటు మొత్తం ఐదు బెన్ఫిట్ షోలు వేసేందుకు నిర్ణయించారు. ఈ టిక్కెట్‌ను రూ.1500 నుంచి రూ.2వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకోవడంలో థియేటర్ యాజమాన్యా లు, అభిమాన సంఘాలు ఒక్కటైపోయాయి. దీనిపై బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు, ఉపాధ్యక్షుడు కాశిన ఫణీంద్రల ఆధ్వర్యంలో బ్లాక్ టిక్కెట్ల విక్రయాలపై ఆర్డీవో వసంతరాయుడుకు గురువారం ఫిర్యాదు చేశారు. ఇప్పటికే కొత్త పేట, రావులపాలెంలలో కూడా అభిమాన సంఘాల ఆధ్వర్యంలో తహశీల్దార్లకు విన తిపత్రాలు ఇచ్చారు. రావులపాలెంలో ఒక థియేటర్లోని రెండు స్ర్కీన్లకు సంబంధించి టిక్కెట్లను యాజమాన్యమే అభిమాన సంఘాల నాయకులతో కలసి రూ.1500 నుంచి రూ.2 వేల వరకు విక్రయించింది. కొన్నిచోట్ల వైసీపీకి చెందిన నాయకులు ఈ బ్లాక్ టిక్కెట్ల దందాలో కీలకపాత్ర వహిస్తూ లక్షల రూపాయలను ఆర్జిస్తున్నారు. కాకినాడ నగరంలో కూడా బెనిఫిట్‌షోలకు రూ.1500 నుంచి రూ.2 వేలు, ఇతర షోలకు రూ. 150 నుంచి రూ.250 మధ్య అమ్మాల్సిన టిక్కెట్లను యాజమాన్యాలే రూ.500 నుంచి రూ.750 వరకు తమ సిబ్బందితో బ్లాక్‌లో అమ్మకాలు సాగిస్తున్నా పోలీసులుగాని, రెవెన్యూ అధికారులుగాని కనీసం స్పందించకపోవడం గమనార్హం.