Advertisement

రూ.13 లక్షల కోట్లు

Mar 6 2021 @ 01:00AM

కరోనాతో భారత కుటుంబాలు కోల్పోయిన ఆదాయమిది: యూబీఎస్‌ 


ముంబై: కరోనా సంక్షోభ కాలంలో ఉపాధి కోల్పోవడంతో భారత కుటుంబాలు రూ.13 లక్షల కోట్ల మేర ఆదాయాన్ని నష్టపోయి ఉంటాయని యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది.  మార్కెట్లో వినియోగ గిరాకీ మళ్లీ మందగించనుందని, దాంతో ఈ ఏడాది జూన్‌ నాటికి ఆర్థిక వ్యవస్థ జోరు తగ్గవచ్చని తాజా నివేదికలో హెచ్చరించింది. మరిన్ని ముఖ్యాంశాలు.. 

  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) రెండు, మూడు త్రైమాసికాల్లో నమోదైన వృద్ధి పునరుద్ధరణ ఆశ్చర్యకరం. కరోనా కట్టడికి విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా 2020 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికాని (క్యూ1)కి జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 23.9 శాతానికి పతనమైంది. జూలై-సెప్టెంబరు త్రైమాసికం(క్యూ2) లో వృద్ధి క్షీణత -7.5 శాతానికి పరిమితం కాగా.. డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం(క్యూ3)లో 0.40 శాతం వృద్ధి నమోదైంది.
  • క్యూ2, క్యూ3లో నమోదైన వృద్ధి రికవరీ నిలకడగా కొనసాగడంతో పాటు భవిష్యత్‌ వృద్ధి పూర్తిగా కొత్త పెట్టుబడుల పునరుద్ధరణ, ఆర్థిక సేవల రంగాలపై ఒత్తిడి తగ్గుదలపై ఆధారపడి ఉంది. 
  • లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత మార్కెట్లో వినియోగం, పెట్టుబడులు అనూహ్యంగా పెరగడం వృద్ధి పునరుద్ధరణకు దోహపడింది. అందులో చాలా వరకు పెట్టుబడులు లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయినవే.
  • చౌక వడ్డీ రేటుకే లభిస్తోన్న గృహ రుణాలు, ప్రోత్సాహకాలు, లాక్‌డౌన్‌ తర్వాత ఒక్కసారిగా  డిమాండ్‌ ఒక్కసారిగా పెరగడం స్థిరాస్తి రంగ పునరుద్ధరణకు ప్రధాన చోదకాలు. గత ఏడాది గృహ విక్రయాలు 2019తో పోలిస్తే 31 శాతం క్షీణించాయి. 
  • కరోనా సంక్షోభానికి ముందు 72 శాతంగా ఉన్న దేశ రుణ-జీడీపీ నిష్పత్తి.. 2021-22లో 90 శాతానికి పెరగనుంది. ఏదేని దేశ రుణ సహనీయత దాని వృద్ధి సామర్థ్యాన్ని నిలుపుకోవడంతో పాటు మరింత మెరుగుపర్చుకోవడంపైనే ఆధారపడి ఉంటుందన్నది ఆర్థిక నిపుణుల అభిప్రాయం. 


మార్కెట్లో ఆర్థిక కార్యకలాపాలు ప్రీ-కొవిడ్‌ స్థాయికి పుంజుకున్నప్పటికీ, ఈ జోరు మున్ముందు నెలల్లోనూ కొనసాగుతుందా అనేదే కీలక ప్రశ్న. ఎందుకంటే, క్యూ2, క్యూ3లో వేగంగా కోలుకున్న కీలక స్థూల ఆర్ధికాంశాల సంయుక్త సూచీ జనవరిలో మళ్లీ పడకేసింది. దీన్నిబట్టి చూస్తే, ఈ జనవరి-మార్చి త్రైమాసికం (క్యూ4)లో వృద్ధి మళ్లీ నెమ్మదించవచ్చని అన్పిస్తోంది. అయితే, ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం మూలధన వ్యయాన్ని జీడీపీలో 2.5 శాతానికి పెంచింది. 2007-08 ఆర్థిక సంవత్సరం తర్వాత ఇదే అత్యధికం. ప్రాథమిక దశలో ఉన్న వృద్ధి పునరుద్ధరణకు ఇది ఊతమివ్వనుంది. 


ప్రజల నుంచి పైసా తీసుకోవట్లేదు: ఆర్థిక మంత్రి 

ప్రభుత్వ ఆదాయం, రుణాల సేకరణ ద్వారానే ఉద్దీపన పథకాలకు నిధులు అందిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ప్రజల నుంచి రూపాయి కూడా వసూలు చేయట్లేదని ఆమె పేర్కొన్నారు. ఇండియన్‌ వుమెన్స్‌ ప్రెస్‌ కార్ప్స్‌లో విలేకరులతో ముచ్చటించిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా సంక్షోభం నుంచి ఊరట కల్పించేందుకు ఆత్మ నిర్భర్‌ ప్యాకేజీ కింద ప్రభుత్వం రూ.27.1 లక్షల కోట్ల ఉద్దీపనలు ప్రకటించింది. 


కరోనా కేసుల పెరుగుదలతో వృద్ధికి ముప్పే: ఆర్థిక శాఖ 

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం వృద్ధికి ముప్పుగా పరిణమించవచ్చని నెలవారీ సమీక్ష నివేదికలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఎనిమిది రాష్ట్రాల్లో కేసులు క్రమంగా పెరుగుతుండటం ప్రజలు భౌతిక దూరం పాటించాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తోందని పేర్కొంది. కాగా, ఈ సారి జీడీపీ వృద్ధి క్షీణత -8 శాతం అంచనా కంటే మెరుగ్గానే నమోదుకావచ్చని ఆర్థిక శాఖ భావిస్తోంది. ఆర్థిక కార్యకలాపాలు జోరందుకోవడంతో పాటు కరోనా టీకాల పంపిణీ కార్యక్రమం వేగంగా జరుగుతుండటం ఇందుకు దోహదపడనుందని నివేదికలో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధం (2020 అక్టోబరు- 2021 మార్చి)లో సానుకూల వృద్ధి నమోదుకావచ్చని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. 

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.