వావ్‌.. ఐటీ! రూ.17 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2022-02-16T06:01:41+05:30 IST

భారత ఐటీ సేవల రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని నాస్కామ్‌

వావ్‌.. ఐటీ!      రూ.17 లక్షల కోట్లు

  •  2020-21తో పోలిస్తే 15.5% వార్షిక వృద్ధి 
  •  దశాబ్దంలో ఇదే అత్యధిక ఆదాయ వృద్ధి  
  •  తొలిసారిగా రూ.15 లక్షల కోట్ల ఎగువకు.. 
  •  51 లక్షలకు చేరిన ఐటీ ఇండస్ట్రీ ఉద్యోగులు
  •  2021-22లో 4.5 లక్షల కొత్త నియామకాలు 
  •  వార్షిక నివేదిక విడుదల చేసిన నాస్కామ్‌
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఐటీ రంగ ఆదాయ అంచనా ఇది.. 


ముంబై: భారత ఐటీ సేవల రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని నాస్కామ్‌ తాజా నివేదిక పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో దేశీయ ఐటీ పరిశ్రమ మొత్తం ఆదాయం 15.5 శాతం వృద్ధి చెంది 22,700 కోట్ల డాలర్లకు (సుమారు రూ.17 లక్షల కోట్లు) చేరుకోవచ్చని అంచనా వేసింది. అంటే, గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో నమోదైన 19,400 కోట్ల డాలర్లతో పోలిస్తే, ఈసారి ఆదాయం 3,300 కోట్ల డాలర్ల మేర పెరగనుంది. దశాబ్ద కాలంలో ఐటీ రంగానికిదే అత్యధిక ఆదాయ వృద్ధి. అంతేకాదు, ఇండస్ట్రీ వార్షికాదాయం 20,000 కోట్ల డాలర్లు (రూ.15 లక్షల కోట్లు) దాటనుండటం కూడా ఇదే తొలిసారి.


కరోనా సంక్షోభ కాలంలో ప్రపంచవ్యాప్తంగా డిజిటలీకరణకు డిమాండ్‌ భారీగా పెరగడంతో భారత ఐటీ రంగానికి కాసుల పంట పండింది. కరోనా సంక్షోభనామ ఆర్థిక సంవత్సరం (2020-21)లో నమోదైన 2.3 శాతంతో పోలిస్తే, ఈసారి ఆదాయ వృద్ధి చాలా రెట్లు అధికమని, 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోల్చినా రెట్టింపు వృద్ధి నమోదు కానుందని నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ దేవయానీ ఘోష్‌ తెలిపారు. ఐటీ, ఐటీఈఎస్‌,బీపీఎం ఇండస్ట్రీల ప్రాతినిథ్య మండలి నాస్కామ్‌ తాజా నివేదికలో వెల్లడించిన మరిన్ని విషయాలు.. 



 2026 నాటికి దేశీయ ఐటీ రంగ ఆదాయం 11-14 శాతం చొప్పున వృద్ధి చెందుతూ 35,000 కోట్ల డాలర్ల (రూ.26.25 లక్షల కోట్లు)కు చేరుకోవచ్చని అంచనా. ఇండస్ట్రీ ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం నుంచి విధానపరమైన మద్దతు  అవసరం. 


 భారత ఐటీ రంగ వార్షికాదాయం 10,000 కోట్ల డాలర్ల స్థాయికి చేరుకునేందుకు 30 ఏళ్లు పట్టగా.. తదుపరి పది వేల కోట్ల డాలర్ల ఆదాయ వృద్ధి కేవలం పదేళ్లలో సాధ్యమైంది. 


 దేశీయ ఐటీ పరిశ్రమలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగులు 51 లక్షలకు పెరిగారు. ఇందులో 18 లక్షల మంది మహిళలే. దేశంలో అత్యధిక మంది మహిళలు పనిచేస్తున్న ప్రైవేట్‌ రంగం ఇదే. 


 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగ కంపెనీలు 4.5 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించాయి. అందులో మహిళల వాటా 44 శాతం (సుమారు 2 లక్షలు)గా ఉంది. 


 ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీ సేవల ఎగుమతుల ద్వారా ఆదాయం 17.2 శాతం వృద్ధి చెంది 17,800 కోట్ల డాలర్లకు చేరవచ్చు. అన్ని రకాల సేవల ఎగుమతుల్లో ఐటీ రంగ వాటా 51 శాతానికి చేరుకోనుంది. ఇక దేశీయ మార్కెట్‌ నుంచి ఐటీ రంగానికి సమకూరే ఆదాయం 10 శాతం వృద్ధితో 4,900 కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని అంచనా. 


 2020-21లో 5,700 కోట్ల డాలర్లుగా నమోదైన ఈ-కామర్స్‌ రంగ ఆదాయం 2021-22లో 7,900 కోట్ల డాలర్లకు పెరగనుంది. 


 భారత ఐటీ ఇండస్ట్రీకి డిజిటల్‌ సేవల ద్వారా ఆదాయం 25 శాతం వృద్ధి చెందనుంది. మొత్తం 22,700 కోట్ల డాలర్ల ఆదాయంలో మూడింట ఒకవంతు వాటా డిజిటల్‌ సేవల ద్వారానే సమకూరనుంది. ప్రస్తుతం ఐటీ కంపెనీలకు లభిస్తున్న కాంట్రాక్టుల్లో 66 శాతం డిజిటల్‌ సేవలకు సంబంధించినవే. 


 ఐటీ రంగంలో పనిచేస్తున్న 50 లక్షలకు పైగా ఉద్యోగుల్లో మూడింట ఒక వంతు (16 లక్షలు) మంది డిజిటల్‌ నైపుణ్యాలు కలిగి ఉన్నారు. 


 బహుళ జాతి కంపెనీలు (ఎంఎన్‌సీ) ఇప్పటివరకు భారత్‌లో 1,430 గ్లోబల్‌ సెంటర్లు ఏర్పాటు చేశాయి. వీటిల్లో 13 లక్షల మంది వరకు పనిచేస్తున్నారు. 


 దేశీయ ఐటీ రంగంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 290కి పైగా విలీన, కొనుగోలు (ఎం అండ్‌ ఏ) ఒప్పందాలు కుదిరాయి. అందులో మెజారిటీ ఒప్పందాలు డిజిటల్‌ సేవల విభాగానికి చెందినవే. 


 ప్రస్తుతం దేశంలో ఐటీ నిపుణుల డిమాండ్‌-సరఫరా మధ్య వ్యత్యాసం 21.1 శాతంగా ఉంది. 




చిన్న నగరాలకు విస్తరించేందుకు.. 


 ఐటీ రంగం చిన్న నగరాలకు విస్తరించేందుకు వీలుగా ప్రభుత్వం నిరంతరాయ బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీ, విద్యుత్‌ సరఫరా సేవలు అందించాలని నాస్కామ్‌ కోరింది. ఐటీ సేవలను చిన్న నగరాలకు విస్తరించగలిగితే ఉపాధి కోసం మెట్రో నగరాలకు వలసలను తగ్గించగలుగుతామని అసోసియేషన్‌ అభిప్రాయపడింది. ఇది ఐటీ రంగంతో పాటు దేశానికీ ప్రయోజనకరమని పేర్కొంది. 


తగ్గనున్న ఉద్యోగుల వలసలు..    


దేశీయ ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగుల వలసలు (అట్రిషన్‌) ఇప్పటికే పతాక స్థాయికి చేరి ఉండవచ్చని నాస్కామ్‌ వైస్‌ చైర్మన్‌ కృష్ణన్‌ రామానుజమ్‌ అన్నారు. 2021 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి దేశంలోని టాప్‌-10 ఐటీ కంపెనీల గణాంకాలను పరిశీలిస్తే, ఉద్యోగుల వలసల రేటు తగ్గకపోయినప్పటికీ దాదాపు యథాతథ స్థాయిలో కొనసాగిందన్నారు. దీన్నిబట్టి చూస్తే, అట్రిషన్‌ ఇప్పటికే పతాక స్థాయిని చేరిందన్పిస్తుందని, మున్ముం దు వలసలు తగ్గుముఖం పట్టవచ్చని ఇండస్ట్రీ ఆశిస్తోందన్నారు. గడిచిన కొన్ని త్రైమాసికాల్లో చాలా ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల వలసల రేటు 20 శాతానికి మించిపోయింది. కరోనా సంక్షోభం మొదలయ్యాక డిజిటైజేషన్‌కు డిమాండ్‌ అనూహ్యంగా పెరగడంతో ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు ఐటీ కంపెనీలు నిపుణులను భారీగా నియమించుకోవడం వలసలు పెరగడానికి కారణమైంది. 


  


భేష్‌ .. అశ్వినీ  వైష్ణవ్‌


ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం 4.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడాన్ని కేంద్ర ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్వాగతించారు. అంతేకాదు, నాగ్‌పూర్‌ వంటి చిన్న నగరాల్లోనూ కార్యాలయాల ఏర్పాటుపై ఐటీ కంపెనీలు దృష్టి సారించడాన్నీ స్వాగతించారు. ఈ ఏడాది 15.5 శాతం ఆదాయ వృద్ధి సంక్షోభ సమయంలో ఐటీ రంగ స్థితిస్థాపకతకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. టెక్నాలజీ రంగంలో మరిన్ని సంస్కరణలు చేపట్టే విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్న వైష్ణవ్‌.. 5జీ టెలికాం సేవలు ఐటీ రంగానికి భారీ అవకాశాలు పంచనున్నాయన్నారు. అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్‌ రంగ పెట్టుబడులను అనుమతించడంతో పాటు క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, డిజిటల్‌ రూపీ వంటి భవిష్యత్‌ అవకాశాలను ఐటీ రంగం తప్పక అందిపుచ్చుకోవాలన్నారు. 


Updated Date - 2022-02-16T06:01:41+05:30 IST