అమరావతిలో తక్షణ పనులకు రూ.3వేల కోట్లు అవసరం

ABN , First Publish Date - 2022-05-26T10:02:26+05:30 IST

రాజధానిలో తక్షణం చేపట్టాల్సిన ఎల్‌పీఎస్‌ ఇన్‌ఫ్రా, ట్రంక్‌ ఇన్‌ఫ్రా పనులకు ఆర్థిక సమస్యలు వెన్నాడుతున్నాయని, ఇందుకోసం బ్యాంకుల నుంచి రూ. 3000 కోట్ల మేర రుణాలకు యత్నిస్తున్నామని ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ తెలిపారు.

అమరావతిలో తక్షణ పనులకు రూ.3వేల కోట్లు అవసరం

  • రుణమివ్వడానికి బ్యాంకులు సానుకూలం
  • రూ.1500 కోట్ల చొప్పున రెండు డీఆర్పీల రూపకల్పన
  • ప్లాట్ల వేలం ద్వారా రూ.300 కోట్లు లక్ష్యం
  • హైకోర్టు ఆదేశాలతో పనులు వేగవంతం
  • 150 కోట్లతో డబుల్‌ లేన్‌గా కరకట్ట రోడ్డు
  • మీడియాతో సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ 


విజయవాడ, మే 25(ఆంధ్రజ్యోతి): రాజధానిలో తక్షణం చేపట్టాల్సిన ఎల్‌పీఎస్‌ ఇన్‌ఫ్రా, ట్రంక్‌ ఇన్‌ఫ్రా పనులకు ఆర్థిక సమస్యలు వెన్నాడుతున్నాయని, ఇందుకోసం బ్యాంకుల నుంచి రూ. 3000 కోట్ల మేర రుణాలకు యత్నిస్తున్నామని ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ తెలిపారు. రుణాల్విడానికి బ్యాంకులు సానుకూలంగా ఉన్నాయని, వాటి సూచన మేరకు రూ.1500కోట్ల చొప్పున రెండు డీపీఆర్‌లకు రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. ‘అమరావతి టౌన్‌షిప్‌ ప్లాట్ల ఈ వేలం’ కార్యక్రమాన్ని పురస్కరించుకుని బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. హైకోర్టు ఆదేశాల మేరకు రాజధానిలో చేపట్టవలసిన పనులపై సత్వర చర్యలు చేపట్టామన్నారు. ల్యాండ్‌పూలింగ్‌కు సంబంధించి ప్లాట్లు పొందిన  మొత్తం 17 వేల మంది రైతులకు రిజిస్ర్టేషన్‌ చేసుకోవాల్సిందిగా నోటీసులు ఇవ్వగా, ఇప్పటి వరకు 900 మంది చేసుకున్నారని తెలిపారు. ఇదే సందర్భంలో సీఆర్‌డీఏ సొంతంగా ఆర్థిక వనరులను పెంపొందించుకునేందుకు ఎంఐజీ లే అవుట్ల తరహాలోనే అమరావతి టౌన్‌షిప్‌ మిగులు ప్లాట్లను విక్రయించటం ద్వారా తొలి దశలో రూ. 300 కోట్లు ఆర్జించాలన్నది లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. 


అమరావతి టౌన్‌షి్‌పలోని మిగులు ప్లాట్లను మధ్య తరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఈ వేలం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికీ 331 ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని, తొలి దశలో ప్యాకేజీ -1 గా 200 చదరపు గజాల ప్లాట్లు 23, వెయ్యి చదరపు గజాల ప్లాట్లు - 6 ఈ వేలం నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు.  ప్లాట్‌ అప్‌సెట్‌ విలువ రూ.17,800 ధరగా నిర్ణయించామన్నారు. దరఖాస్తు చేసుకోవటానికి ఈ నెల 27 చివరి తేదీ అని తెలిపారు. ఆదాయ వనరులను పెంపొందించుకోవటానికి గన్నవరం వెంకటనరసింహాపురం, ఇబ్రహీంపట్నం, త్రిలోచనాపురం, రాయనపాడులలో ఎంఐజీ లే అవుట్లకు సిద్ధమతున్నామని చెప్పారు. బ్యాంకులు రుణం ఇవ్వటానికి అమరావతి ఏకైక రాజధాని ఉంటుందన్న హామీ ఇవ్వమని బ్యాంక ర్లు కోరిన అంశంపై స్పష్టత ఇవ్వవలసిందిగా కమిషనర్‌ను ‘ఆంధ్రజ్యోతి’  ప్రశ్నించగా.. దానికి ఆయన సమాధానం దాటవేశారు. ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ ప్రకారం బ్యాంకులు రుణాలు ఇస్తాయని చెప్పారు. రాజధానిలో నిర్మాణ పనులను కూడా ప్రారంభించామని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్‌ భవనాలు పురోగతిలో ఉన్నాయని, నవంబరు నాటికి అందుబాటులోకి వస్తాయని చెప్పారు.  90 శాతం పూర్తయిన సీడ్‌ యాక్సిస్‌ రోడ్డులో నాలుగు చోట్ల గ్యాప్‌లు ఉన్నాయని, త్వరలోనే వాటిని పూర్తి చేస్తామని చెప్పారు.


 కరకట్ట రోడ్డును డబుల్‌ లేన్‌గా విస్తరణ చేపట్టడానికి రూ.150 కోట్ల మేర అమరావతి స్మార్ట్‌ టౌన్‌ కార్పొరేషన్‌ నుంచి నిధులు బదలాయించి పనులు ప్రారంభించామన్నారు. హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టు  పూర్తిగా సెల్ఫ్‌ ఫైనాన్షియల్‌ ప్రాజెక్టు అని,  సీఆర్‌డీఏ ఫెసిలిటేటర్‌గా మాత్రమే వ్యవహరిస్తోందని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఈ ప్రాజెక్టుకు మూడు సార్లు రివర్స్‌ టెండర్లు పిలవగా.. ఒక్కరు కూడా ముందుకు రాలేదన్నారు.  దీనిపై కొంతమంది రెరా దృష్టికి తీసుకు వెళ్లారని, రెరా కూడా తమకు ఒక డైరెక్షన్‌ ఇచ్చిందని, ఆ డైరెక్షన్‌ మేరకు ముందుకు వెళతామన్నారు. రాజధాని రైతులకు కౌలు చెల్లింపులకు రూ.208 కోట్లు విడుదల చేశామని తెలిపారు. పర్మినెంట్‌ సెక్రటేరియట్‌కు సంబంధించిన పనులపై ‘ఆంధ్రజ్యోతి’ స్పష్టత కోరగా.. నిధుల సమస్య వేధిస్తోందని, అందుకే సెల్ఫ్‌ సస్టెయిన్‌ కావాలని భావిస్తున్నామని తెలిపారు.

Updated Date - 2022-05-26T10:02:26+05:30 IST