రూ.319.36కోట్లు

ABN , First Publish Date - 2022-06-27T05:13:45+05:30 IST

రూ.319.36కోట్లు

రూ.319.36కోట్లు

  • రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బు
  • 2,39,926 మంది రైతులకు పంపిణీ
  • కొత్త రైతులకూ పెట్టుబడి సాయం
  • తొలిరోజు ఎకరా వరకున్న వారికి చెల్లింపు
  • ఆరోహణ క్రమంలో విస్తీర్ణం ఆధారంగా నగదు బదిలీ


అడపాదడప జల్లులు కురియడంతో రైతులు సాగు పనులను ప్రారంభించారు. విత్తనాలు, ఎరువులు తెచ్చుకొని ట్రాక్టర్లు, ఎడ్ల నాగళ్లతో దుక్కులు చేసుకుంటున్నారు. ప్రతీ పంట సీజన్‌ మొదట్లో రైతుబంధు పథకం కింద ప్రభుత్వం అందజేస్తున్న ఎకరానికి రూ.5వేలను మంగళవారం నుంచి రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో జమచేయనున్నారు. జూన్‌ రెండో, మూడో వారంలో వచ్చే రైతుబంధు.. ఈ సారి కాస్త ఆలస్యంగా వస్తోంది. రైతుబంధు కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. నగదు సాయం అందితే పెట్టుబడి ఖర్చుకు వెసులుబాటు కలగనుంది. 

వికారాబాద్‌, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రైతులకు రైతుబంధు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పంట పెట్టుబడికి నిర్దేశించిన రైతుబంధు నగదు సాయం ఈ నెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించడంతో ఆ దిశగా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. రైతులకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం రైతుబంధు కింద ఏడాదిలో రెండుసార్లు ఎకరానికి రూ.5వేల వంతున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసింది. ఈ వానాకాలంలో జిల్లాలో రైతుబంధుకు అర్హులైన రైతుల సంఖ్య 2,70,232గా గుర్తించారు. వారికి పెట్టుబడి సాయం కింద రూ.319,36,64,616 నిధులు కేటాయించింది. రైతుబంధు కింద కొత్తగా ఈ సారి నుంచి 13,052 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. 2,31,964 మంది రైతుల ఖాతాలను ఏఈవోలు అప్డేట్‌ చేయగా, వాటిలో 2,31,754మంది ఖాతాలను మండల వ్యవసాయాధికారులు పరిశీలించి అప్రూవ్‌ చేశారు. గత వానాకాలం సీజన్‌లో 2,25,438 మంది రైతులకు రూ.300.61కోట్ల రైతుబంధు ఇచ్చారు. 18,005మంది రైతులు వివిధ కారణాలతో రైతుబంధు పొందలేదు. వారిలో కొందరు రైతుబంధును స్వచ్ఛదంగా వదులుకోగా, కొందరి బ్యాంకు ఖాతా వివరాలు అందజేయకపోవడం, అప్డేట్‌ చేసుకోని కారణంగా నగదు సాయం తీసుకోలేదు. గత వానాకాలం సీజన్‌లో జిల్లాకు కేటాయించిన రైతుబంధు నిధుల్లో రైతులకు చెల్లించని రూ.15.12కోట్లను తిరిగి ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. రైతుబంధు అర్హుల జాబితాను సీఎల్‌ఏ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు అందజేసింది. పట్టాదారు పాసు పుస్తకం పొంది సీసీఎల్‌ఏ ద్వారా ధరణి పోర్టల్‌లో చేర్చిన రైతులకు మాత్రమే రైతుబంధు వస్తోంది. గతేడాది వానాకాలంతో పోలిస్తే ఈ ఏడాది 26,789 మంది రైతులకు కొత్తగా రైతుబంధును వర్తింపజేయనున్నారు. వీరిలో గతేడాది రైతుబంధు రాని వారు 18,005 మంది ఉండగా, కొత్తగా 13,052 మంది రైతులు కలిశారు. గత వానాకాలంలో రూ.300.61కోట్ల పెట్టుబడి సాయం అందించగా, ఈ సారి ఈ మొత్తానికి అదనంగా రూ.18.75కోట్లు కేటాయించారు. యాసంగి సీజన్‌ తరువాత జరిగిన క్రయవిక్రయాల్లో పట్టా పాసుపుస్తకాలు జారీ అయిన రైతులందరికీ రైతుబంధు వేస్తారు. ఈ మేరకు సీసీఎల్‌ఏ నుంచి రైతుల వివరాలను జిల్లా వ్యవసాయ శాఖకు పంపించారు.

  • మొదట చిన్న రైతులకు నగదు బదిలీ

రైతుల ఖాతాల్లో నగదు జమచేసే ప్రక్రియకు మంగళవారం(రేపటి నుంచి) శ్రీకారం చుట్టనున్నారు. భూ విస్తీర్ణం ఆధారంగా ఆరోహణ క్రమంలో(తక్కువ నుంచి ఎక్కువ) రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. మొదటి రోజు ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు డబ్బు జమవుతుంది. రెండో రోజు రెండు ఎకరాల వరకు ఉన్న రైతులకు, మూడో రోజు మూడెకరాల వరకు, నాలుగో రోజు నాలుగు ఎకరాల వరకు, ఐదో రోజు ఐదెకరాల వరకు.. ఇలా తక్కువ విస్తీర్ణం నుంచి ఎక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రైతుబంధును జమచేస్తారు.

Updated Date - 2022-06-27T05:13:45+05:30 IST