రూ.4.80 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2021-06-22T05:45:46+05:30 IST

గత ఏడాది భారత్‌లోకి 6,400 కోట్ల డాలర్ల (సుమారు రూ.4.80 లక్షల కోట్లు) విదేశీ ప్రత్యక్ష

రూ.4.80 లక్షల కోట్లు

  •  2020లో దేశంలోకి వచ్చిన  విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఇవి
  •   అత్యధిక ఎఫ్‌డీఐలు అందుకున్న  దేశాల్లో భారత్‌కు ఐదో స్థానం 
  •  ఐక్యరాజ్య సమితి  నివేదిక  వెల్లడి 


ఐక్యరాజ్యసమితి: గత ఏడాది భారత్‌లోకి 6,400 కోట్ల డాలర్ల (సుమారు రూ.4.80 లక్షల కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎ్‌ఫడీఐ) తరలి వచ్చాయని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. 2019లో వచ్చిన 5,100 కోట్ల డాలర్లతో పోలిస్తే 27 శాతం అధికమిది. ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ టెక్నాలజీ (ఐసీటీ) రంగంలో కొనుగోలు ఒప్పందాలు పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. అంతేకాదు, 2020లో అత్యధిక ఎఫ్‌డీఐలు అందుకున్న ప్రపంచ దేశాల్లో భారత్‌ ఐదో స్థానంలో నిలిచింది. కరోనా రెండో దశ ఉధృతి ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపినప్పటికీ, ఆర్థిక మూలాలు పటిష్ఠంగా ఉన్నందున మధ్యకాలికంగా భారత్‌ పరిస్థితి ఆశాజనకంగానే కన్పిస్తోందని పేర్కొంది. మరిన్ని ముఖ్యాంశాలు.. 




 కరోనా సంక్షోభ ప్రభావంతో గత ఏడాది ప్రపంచవ్యాప్త ఎఫ్‌డీఐలు 35 శాతం తగ్గి లక్ష కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. 2019లో ఈ విలువ 1.5 లక్షల కోట్ల డాలర్లుగా నమోదైంది.


 కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాజెక్టుల్లోకి పెట్టుబడులు మందగించాయి. ఆర్థిక మాంద్యం ప్రభావంతో బహుళజాతి సంస్థలు కొత్త ప్రాజెక్టులపై పునరాలోచనలో పడ్డాయి.


 కరోనా వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయంగా డిజిటల్‌ ఇన్‌ఫ్రా, సర్వీసులకు డిమాండ్‌ అనూహ్యంగా పెరిగింది. దాంతో ఐసీటీ రంగంలోకి వచ్చిన గ్రీన్‌ఫీల్డ్‌ ఎఫ్‌డీఐలు 22 శాతం పెరిగి 8,100 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. అమెజాన్‌.. భారత్‌లో ఐసీటీ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు కోసం ప్రకటించిన 280 కోట్ల డాలర్ల పెట్టుబడి ఇందులో ఒకటి. 


 గత ఏడాది భారత్‌లో ప్రకటించిన గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టుల విలువ 19 శాతం తగ్గి 2,400 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. 


 ఈ ఏడాది కరోనా రెండో దశ వ్యాప్తి దేశ ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తత్ఫలితంగా పెట్టుబడులు భారీగా క్షీణించే ప్రమాదం ఉంది. ఎందుకంటే, విదేశీ పెట్టుబడులను అధికంగా ఆకర్షించే మహారాష్ట్ర, కర్ణాటకలో కరోనా తీవ్రత అధికంగా ఉండటమే ఇందుకు కారణం. 


 గత ఏడాది దక్షిణాసియాలోకి వచ్చిన ఎఫ్‌డీఐలు 20 శాతం పెరిగి 7,100 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. భారత్‌లో నమోదైన అధిక విలువైన విలీన, కొనుగోలు (ఎం అండ్‌ ఏ) ఒప్పందాలు ఇందుకు దోహదపడ్డాయి. 


 గత సంవత్సరానికి గాను నమోదైన క్రాస్‌ బార్డర్‌ ఎం అండ్‌ ఏ ఒప్పందాల విలువ 83 శాతం పెరిగి 2,700 కోట్ల డాలర్లుగా నమోదైంది.


Updated Date - 2021-06-22T05:45:46+05:30 IST