రూ.60,000 కోట్లు అదానీ భూరి విరాళం

ABN , First Publish Date - 2022-06-24T06:44:15+05:30 IST

భారత కుబేరుడు గౌతమ్‌ అదానీ శుక్రవారం 60వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయనో భారీ నిర్ణయం తీసుకున్నారు.

రూ.60,000 కోట్లు  అదానీ భూరి విరాళం

60వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రకటించిన ఆసియా కుబేరుడు

అదానీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు 

ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్య శిక్షణ కోసం విరాళ నిధులు వెచ్చించనున్న ఫౌండేషన్‌ 


న్యూఢిల్లీ: భారత కుబేరుడు గౌతమ్‌ అదానీ శుక్రవారం 60వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయనో భారీ నిర్ణయం తీసుకున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల కోసం అదానీ, ఆయన కుటుంబం రూ.60,000 కోట్ల భూరీ విరాళాన్ని ప్రకటించింది. అదానీ ఫౌండేషన్‌ ఈ విరాళాన్ని  నిర్వహించనుందని, ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ, విద్య, వృత్తి నైపుణ్య శిక్షణ కోసం ఈ నిధులను వెచ్చించనుందని గురువారం గౌతమ్‌ అదానీ వెల్లడించారు. భారత కార్పొరేట్‌ రంగ చరిత్రలో సామాజిక సేవా కార్యక్రమాల కోసం ప్రకటించిన అతిపెద్ద విరాళాల్లో ఇదొకటి. ఈ విరాళ మొత్తం అదానీ సంపదలో 8 శాతం కంటే అధికం. ఈ విరాళం ప్రకటన ద్వారా అదానీ కూడా బిల్‌గేట్స్‌, మార్క్‌ జుకెర్‌బర్గ్‌, వారెన్‌ బఫెట్‌, అజీమ్‌ ప్రేమ్‌జీ, అనిల్‌ అగర్వాల్‌ వంటి కుబేర దాతల జాబితాలోకి చేరారు. బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం.. ఈ నెల 23 నాటికి అదానీ కుటుంబం సంపద 9,170 కోట్ల డాలర్లుగా ఉంది. ప్రస్తుత మారకం రేటు ప్రకారం మన కరెన్సీలో రూ.7.15 లక్షల కోట్ల పైమాటే. అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు భారీగా ర్యాలీ తీయడంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఆయన కుటుంబం ఆస్తి 1,520 కోట్ల డాలర్లకు పైగా పెరిగింది. ఈ ఏడాదిలో అత్యధిక సంపద వృద్ధిని నమోదు చేసుకున్న ప్రపంచ కుబేరుల్లో అదానీదే అగ్రస్థానం. ప్రపంచ సంపన్నుల్లో ప్రస్తుతం 8వ స్థానంలో ఉన్న అదానీ.. భారత్‌తోపాటు ఆసియా మొత్తానికీ నం.1 ధనవంతుడిగా కొనసాగుతున్నారు. 

Updated Date - 2022-06-24T06:44:15+05:30 IST