గుప్తనిధుల పేరిట రూ.7లక్షల టోకరా

ABN , First Publish Date - 2022-05-23T06:14:53+05:30 IST

గుప్తనిధుల పేరిట రూ.7లక్షల టోకరా

గుప్తనిధుల పేరిట రూ.7లక్షల టోకరా
మటం చందు, ఎర్నాల సంజీవ


ఘట్‌కేసర్‌ రూరల్‌, మే 22: గుప్తనిధులు దొరికిస్తామని బురిడీ కొట్టించి ఓ వ్యక్తి నుంచి రూ.7లక్షలు కాజేసిన సంఘటన మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం ఎదులాబాద్‌లో వెలుగుచూసింది. సీఐ చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా గన్నేరువనం గ్రామానికి చెందిన మటం చందు(30), సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన ఎర్నాల సంజీవ(22) బుడగ జంగం వారిమని మంత్ర విద్యలు, జాతకాలను చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఎదులాబాద్‌కు చెందిన మాచర్ల రాజు(పద్మశాలి) అనే వ్యక్తి పంక్చర్‌ దుకాణం నిర్వహిస్తుంటాడు. రాజు వద్దకు చందు, సంజీవ వచ్చి మేము సాధనాసురులమని, పద్మశాలి కులస్థుల వద్దే తాము డబ్బు తీసుకుంటామని డబ్బు అడిగారు. దీంతో రాజు వారిద్దరినీ ఇంటికి తీసుకెళ్లి మర్యాదలు చేసి రూ.3వేలు ఫోన్‌పే ద్వారా చెల్లించాడు. ఇంట్లో పూజగది ఎందుకు మూశారని రాజును నిందితులు అడిగారు.  మా సోదరుడు ఇటీవల మృతిచెందడంతో పూజగది మూశామని రాజు చెప్పాడు. ఇదే అదనుగా చందు, సంజీవ మీ ఇంట్లో దయ్యాలు తిరుగుతున్నాయి.. పూజలు చేయించకపోతే ఇంట్లో మరొకరు చనిపోతారని భయపెట్టారు. దీంతో రాజు పూజల కోసమని వారికి రూ.35వేలు ఇచ్చాడు. వారు ఏవో పూజలు చేసి వెళ్లిపోయారు. కొన్ని రోజుల తరువాత నిందితులు మరోసారి రాజు ఇంటికి వచ్చి మీ ఇంట్లో నాలుగుకోట్ల విలువచేసే గుప్తనిధులున్నాయి, గదిలో ఉన్న దయ్యాలను తరిమికొడితేనే నిధులు వస్తాయని నమ్మ బలికారు. రాజును కరీంనగర్‌ తీసుకెళ్లి ఓ దుకాణంలో 1.8లక్షల పూజ సామాగ్రిని కొనిపించి అదే దుకాణదారు నుంచి 1.3లక్షలు తీసుకున్నారు. ఇలా విడుతల వారీగా రాజు నుంచి రూ.7.05లక్షల వరకు కాజేశారు. రోజులు గడిచినా ఫలితం లేదని రాజు గ్రహించాడు. ఈ నెల 20 చందు, సంజీవ రాజును డబ్బు డిమాండ్‌ చేశారు. మోసాన్ని గ్రహించిన రాజు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. చందు, సంజీవను అరెస్ట్‌ చేసి విచారించగా తాము చేసిన మోసాన్ని అంగీకరించారు. వారి నుంచి రూ.15వేలు, రెండు సెల్‌ఫోన్లు, అల్టోకారు, పూజ సామగ్రిని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించనున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - 2022-05-23T06:14:53+05:30 IST