రూ.7 వేల కోట్లతో ఎయిర్‌పోర్టులకు మహర్దశ

ABN , First Publish Date - 2022-04-27T13:24:57+05:30 IST

రాష్ట్రంలోని విమానాశ్రయాలను రూ.7 వేల కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు సదరన్‌ రీజనల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ జిందాల్‌ వెల్లడించారు. తిరుచ్చి అంతర్జాతీయ

రూ.7 వేల కోట్లతో ఎయిర్‌పోర్టులకు మహర్దశ

                     - దక్షిణ ప్రాంతీయ కార్యనిర్వాహక సంచాలకుడు 


అడయార్‌(చెన్నై): రాష్ట్రంలోని విమానాశ్రయాలను రూ.7 వేల కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు సదరన్‌ రీజనల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ జిందాల్‌ వెల్లడించారు. తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో జరుగుతున్న రెండో టెర్మినల్‌ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తిరుచ్చి ఎయిర్‌పోర్టులో వున్న పాత టెర్మినల్‌ కంటే కొత్త టెర్మినల్‌ దాదాపు 5.5 రెట్లు పెద్దదని తెలిపారు. ఈ నిర్మాణ పనులు పూర్తయితే దేశంలోనే అతిపెద్ద, ఎంతో అందమైన టెర్మినల్‌గా గుర్తింపు పొందుతుందన్నారు. కరోనాతో పాటు భారీ వర్షాల కారణంగా ఈ టెర్మినల్‌ నిర్మాణ పనులను నిర్ణీత వ్యవధిలో పూర్తిచేయలేకపోయినట్టు వెల్లడించారు. 2023 నాటికి ఈ పనులను పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. అలాగే, తిరుచ్చి విమానాశ్రయ విస్తరణకు సంబంధించి అవసరమైన భూముల్లో 40 ఎకరాలను మాత్రమే సేకరించారని, మిగిలిన భూముల సేకరణ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో విస్తరణ చేపడతామన్నారు. వచ్చే మూడేళ్ళలో రాష్ట్రంలోని విమానాశ్రయాలను ఏడు వేల కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. తూత్తుకుడి, సేలం, వేలూరు విమానాశ్రయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, చెన్నై ఎయిర్‌పోర్టును మరింతగా విస్తరించేందుకు చర్యలు చేపట్టినట్టు ఆయన వివరించారు. 

Updated Date - 2022-04-27T13:24:57+05:30 IST