యాప్‌ పేరుతో రూ.కోటి మోసం!

ABN , First Publish Date - 2021-01-03T06:20:11+05:30 IST

ఇటీవల జిల్లాలోనూ ఆన్‌లైన్‌ యాప్‌ మోసాలు బయటపడుతున్నాయి. కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాలు సహా పలమనేరు, వి.కోట మండలాల్లోనూ ‘ఓఎంజీబర్స్‌’ అనే యాప్‌ ద్వారా ఆర్థికంగా నష్టపోయిన బాధితులున్నారు.

యాప్‌ పేరుతో రూ.కోటి మోసం!




 రామకుప్పంలో కేసు నమోదు


 అనవసరమైన యాప్‌లు, లింకుల  జోలికి వెళ్లొద్దంటున్న పోలీసులు 


 చిత్తూరు, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): ఇటీవల జిల్లాలోనూ ఆన్‌లైన్‌ యాప్‌ మోసాలు బయటపడుతున్నాయి. కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాలు సహా పలమనేరు, వి.కోట మండలాల్లోనూ ‘ఓఎంజీబర్స్‌’ అనే యాప్‌ ద్వారా ఆర్థికంగా నష్టపోయిన బాధితులున్నారు. రూ.లక్షల నుంచి ప్రారంభమైన ఈ మోసం రూ.కోటి వరకు చేరుకుందని సమాచారం. ఈ యాప్‌ మోసంపై బాధితుల ఫిర్యాదు మేరకు రామకుప్పం పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు.ఈ నేపథ్యంలో అనవసరమైన యాప్‌లు, లింక్‌ల జోలికి వెళ్లొద్దని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.


తమ యాప్‌లో పెట్టుబడి పెడితే రోజూ డబ్బులు వస్తాయంటూ లింక్‌ పంపించారు. ఈ యాప్‌లో మరికొందరిని చేర్పిస్తే ఇన్సెంటివ్‌ కింద 10శాతం ఇస్తామంటూ చైన్‌ సిస్టం ద్వారా వేలాదిమందిని చేర్చుకున్నారు. ఈ యాప్‌లో కొంత ఇన్వెస్ట్‌ చేయాలని, అందులో కొన్ని వస్తువులు ఉంటాయని, వాటి మీద రోజుకు 30 సార్లు క్లిక్‌ చేస్తే రోజుకు కొంత ఇస్తామని చెప్పారు. రూ.30 వేలు కడితే.. రోజుకు రూ.2500 చొప్పున, రూ.5 వేలు కడితే రోజుకు రూ.400 చొప్పున ఇస్తామన్నారు. ఇందులో 18శాతం జీఎస్టీ కట్‌ చేస్తామని, మిగిలింది రోజూ తీసుకోవచ్చని చెప్పారు.


ఇన్వెస్టర్లలో నమ్మకం కోసం యాప్‌లో నిర్వాహకులు చాటింగ్‌ కూడా చేసేవారు. 2022 వరకు తమ యాప్‌ ఉంటుందని అప్పటివరకు రోజూ డబ్బులు వస్తాయని నమ్మించారు. పైగా తెలిసినవారిని ఇందులో చేర్పిస్తే వారు కట్టే మొత్తంలో 10శాతం ఇన్సెంటివ్‌ కింద ఇస్తామన్నారు. వీరి మాటలు నమ్మి కుప్పం ప్రాంతంలో చాలా మంది రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకు ఇన్వెస్ట్‌ చేశారు. ప్రస్తుతానికి ఐదారుగురు నుంచి ఫిర్యాదులు రామకుప్పం స్టేషన్‌లో రాగా.. ఇవి మరిన్ని పెరిగే అవకాశం లేకపోలేదు.


రెండు వారాలుగా బంద్‌

  యాప్‌లో పెట్టుబడి పెట్టిన కొత్తలో చాలామందికి డబ్బులు వచ్చాయి. రోజూ డబ్బులు డ్రా చేసుకునే విధంగా ఆప్షన్‌ పెట్టిన నిర్వాహకులు సుమారు 45రోజులుగా బాగానే నిర్వహించారు. దీంతో ఒకరిని చూసి ఒకరు ఇందులో చేరారు.వేల సంఖ్యలో వినియోగదారులు చేరిన తర్వాత విత్‌డ్రా ఆప్షన్‌ తీసేశారు. దీంతో పెట్టుబడి పెట్టినవారు డబ్బులు వెనక్కి తీసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో కంగుతిన్న బాధితులు రెండు వారాలుగా యాప్‌లో ఇచ్చిన కస్టమర్‌ కేర్‌ నంబరుకు కాల్‌ చేస్తే సరైన సమాధానం ఇవ్వడం లేదు. దీంతో తాము మోసపోయామని అర్థమైన బాధితులు ఆందోళనకు గురవుతున్నారు.


సీసీఎస్‌ ద్వారా విచారణ: ఎస్పీ సెంథిల్‌కుమార్‌

 యాప్‌ మోసాల గురించి వచ్చిన ఫిర్యాదు మేరకు రామకుప్పం స్టేషన్‌లో కేసు నమోదు చేశాం. మోసం ఏ స్థాయిలో జరిగింది.. బాధితులు ఎంత మంది ఉన్నారనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ కేసును సీసీఎస్‌ సెల్‌కు అప్పగించాం. ప్రజలు అత్యాశకు పోయి అనవసరమైన యాప్‌లు, లింక్‌ల జోలికి వెళ్లొద్దు.


Updated Date - 2021-01-03T06:20:11+05:30 IST