రూ. కోట్ల ధనం.. ఏదీ ప్రయోజనం

Published: Thu, 18 Aug 2022 00:05:22 ISTfb-iconwhatsapp-icontwitter-icon
   రూ. కోట్ల ధనం..  ఏదీ ప్రయోజనంమాల్యాల ఎత్తిపోతల పథకం నుంచి హంద్రీనీవా కాలువ కృష్ణా జలాలు లిఫ్ట్‌

  1. ఆగిపోయిన హంద్రీ నీవా విస్తరణ పనులు
  2. జీవో 365 రద్దు
  3. టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదలైన పనుల నిలిపివేత  
  4. రూ.285.77 కోట్లు వృథా  
  5. 2 వేల క్యూసెక్కులకు మించి ఎత్తిపోసుకోలేని పరిస్థితి


(కర్నూలు-ఆంధ్రజ్యోతి): 

పాలకులకు రాజకీయాలే ముఖ్యం.. ప్రజా సంక్షేమం కాదు. అందుకే ప్రభుత్వం మారగానే అంతక ముందటి పనులను ఆపేస్తారు. దాని వల్ల ఎన్ని వందల కోట్ల ప్రజా ధనం దుర్వినియోగమైనా ఫర్వాలేదు. సరిగ్గా వైసీపీ ప్రభుత్వ విధానం ఇదే.  గత టీడీపీ ప్రభుత్వం 3,850 క్యూసెక్కుల ప్రవాహానికి తగినట్లు హంద్రీ నీవా విస్తరణకు రూ. 1,030 కోట్ల అంచనాతో పనులు చేపట్టింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ పనులు ఆపేసింది. ఏకంగా ఈ పనులకు సంబంధించిన జీవో 365ను కూడా రద్దు చేసింది. దీని వల్ల రూ. 285.77 కోట్లు మట్టిపాలయ్యాయి.  గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన పనులు కాబట్టి ఆపేయాల్సిందే.. అనే వైఖరిని సీఎం జగన తీసుకున్నారు.  


కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో 6.05 లక్షల ఎకరాలకు సాగునీరు, 35 లక్షల జనాభాకు తాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో  హంద్రీ నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల  పథకం ప్రారంభమైంది.  శ్రీశైలం జలాశయం ఎగువన నందికొట్కూరు మండలం మాల్యాల నుంచి 40 టీఎంసీలు కృష్ణా వరద జలాలు ఎత్తిపోసి కరువు నేలకు మళ్లించాలి. ఫేజ్‌-1 కింద మాల్యాల నుంచి అనంతపురం జిల్లా జీడిపల్లి జలాశయం వరకు 216.30 కి.మీలు ప్రధాన కాలువ, 8 పంపింగ్‌ స్టేషన్లు నిర్మించారు. 3,850 క్యూసెక్కుల ఎత్తిపోతకు  వీలుగా ప్రతి పంపింగ్‌ స్టేషనలో 12 పంపులు ఏర్పాటు చేశారు. 2012 కృష్ణా జలాలు ఎత్తిపోతలు మొదలు పెట్టినా.. రాష్ట్ర విభజన తరువాత 2016 నుంచి ఏటా కృష్ణా వరద జలాలు ఎత్తిపోస్తున్నారు. 8 పంపింగ్‌ స్టేషన్లలో ఒక టీఎంసీ లిఫ్ట్‌ చేయడానికి దాదాపు రూ.17-20 కోట్లు ఖర్చు అవుతుందని ఇంజనీర్లు అంటున్నారు. ఇప్పటికే రూ.4,500 కోట్లకు పైగా ఖర్చు చేసినా పూర్తిస్థాయిలో 3,850 క్యూసెక్కులు ఎత్తిపోసుకోలేని దుస్థితి ఉంది. 

 టీడీపీ ప్రభుత్వంలో విస్తరణకు శ్రీకారం: 

హంద్రీనీవా ప్రాజెక్టు హైడ్రాలికల్‌ పర్టిక్యులర్స్‌ ప్రకారం ప్రధాన కాలువ 9.5 మీటర్లు బెడ్‌ విడ్త్‌ (కాలువ అడుగు బాగం వెడల్పు)తో నిర్మించాలి. సీసీ లైనింగ్‌ చేస్తే 12 పంపులు (ఒక్కో పంపు ద్వారా 330 క్యూసెక్కులు) ద్వారా 3,850 క్యూసెక్కులు లిఫ్ట్‌ చేసేలా డిజైన చేశారు. ప్రస్తుతం 5-6 పంపుల ద్వారా 1,940 క్యూసెక్కులకు మించి ఎత్తిపోసుకోలేని పరిస్థితి ఉంది. దీంతో లక్ష్యం నెరవేరడం లేదు. 3,850 క్యూసెక్కులు ప్రవాహానికి వీలుగా సీసీ లైనింగ్‌ లేదా కాలువ విస్తరణ కోసం గత టీడీపీ ప్రభుత్వంలో ఇంజనీర్లు ప్రతిపాదించారు. మట్టి కాలువ ద్వారా నీటిని తీసుకెళితే రెండు జిల్లాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయని, కాలువ సమీపంలోని బోరుబావుల వల్ల రైతుకు ఎంతో ఉపయోగమని నిపుణులు సూచన. గత చంద్రబాబు ప్రభుత్వం కాలువ విస్తరణకే మొగ్గు చూపి రూ.1,030 కోట్లు మంజూరు చేస్తూ 2017 ఏప్రిల్‌ 30న జీవో ఆర్టీ నెం:189 జారీ చేసింది. ప్రధాన కాలువ 9.4 మీటర్ల నుంచి 15.90-18 మీటర్ల వరకు వైడెనింగ్‌ (విస్తరణ), ముచ్చుమర్రి-మాల్యాల లింక్‌ కాలువ విస్తరణ పనులు నాలుగు ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టారు.

  పనులు ఆపేసిన వైసీపీ ప్రభుత్వం:

 ఫ ప్యాకేజీ-1 కింద మాల్యాల లిఫ్టు దగ్గర ప్రధాన కాలువ 1.150 కి.మీల నుంచి 78.67 కి.మీల వరకు బెడ్‌ విడ్త్‌ 9.5 మీటర్ల నుంచి 16.75-18 మీటర్లకు వెడల్పు చేసేందుకు రూ.358.12 కోట్లతో చేపట్టారు. రిత్విక్‌ ప్రాజెక్టు ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ కడపకు చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ కుటుంబ సభ్యులకు చెందినది. గత ప్రభుత్వంలోనే రూ.210.22 కోట్లు ఖర్చు చేశారు. 

ఫ ప్యాకేజీ-2 కింద ప్రధాన కాలువ 78.67 కి.మీల నుంచి 134.270 కి.మీల వరకు విస్తరణ పనులు రూ.234.08 కోట్లతో చేపట్టారు. ఈ పనులు హైదరాబాదుకు చెందిన హెచఈఎస్‌ ఇన్ర్ఫా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ దక్కించుకుంది. బెడ్‌ విడ్త్‌ 10 మీటర్ల నుంచి 15.9 మీటర్లు వెడల్పు చేయాలి. రూ.59.10 కోట్లు ఖర్చు చేశారు.

ఫ ప్యాకేజీ-3 కింద ప్రధాన కాలువ 134.270 కి.మీల నుంచి 216 కి.మీల వరకు కాలువ వెడల్పు పనులు అనంతపురం జిల్లాలో చేపట్టారు. రూ.359 కోట్లతో చేపట్టిన ఈ పనులు మెగా ఇంజనీరింగ్‌ ఇన్ర్ఫా ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ చేపట్టింది. 

ఫ ప్యాకేజీ-4 కింద ముచ్చుమర్రి లిఫ్టు నుంచి మాల్యాల లిఫ్టు వరకు 17.71 కి.మీలు లింక్‌ చానల్‌ కెనాల్‌ విస్తరణ పనులు రూ.29.12 కోట్లతో చేపట్టి దాదాపు రూ.16.43 కోట్లు ఖర్చు చేశారు.

ఫ గత టీడీపీ ప్రభుత్వంలో జిల్లాలో ప్యాకేజీ-1,2,4 పరిధిలో రూ.285.77 కోట్లు ఖర్చు చేశారు. 2019 మేలో ఎన్నికల తర్వాత టీడీపీ ప్రభుత్వం స్థానంలో వైసీపీ ప్రభుత్వం వచ్చింది.   చంద్రబాబు ప్రభుత్వ హయంలో జరిగిన పనుల్లో  భారీ అవినీతి చోటు చేసుకున్నదనే  ఆరోపణలతో విస్తరణ పనులు ఆపేశారు. 2020 జూలై 8న జారీ చేసిన జీవో ఆర్టీ నెంబరు: 365 మేరకు క్లోజ్‌ చేశారు. దీంతో మరో ఐదేళ్ల వరకు పనులు చేపట్టేందుకు అవకాశం లేకుండా పోయింది.   ఇప్పటికే ఖర్చు చేసిన రూ.285.77 కోట్లు ప్రజాధనం పట్టిపాలయింది.  

ఫఇది రైతులకు శాపం: 

టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన పనులను కొనసాగిస్తే ఆ పార్టీకి రైతుల్లో మంచి పేరు వస్తుందనే రాజకీయ దురుద్దేశంతోనే హంద్రీ నీవా కాలువ విస్తరణ పనులు ఆపేశారని రాయలసీమ సాగునీటి నిపుణులు అంటున్నారు. గత ప్రభుత్వంలో చేపట్టిన పనులపై నిపుణుల కమిటీ వేసి సమగ్ర విచారణ జరిపించవచ్చు.. అవినీతి జరిగిందని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవచ్చు.. అవసరమైతే కాంట్రాక్టర్ల నుంచి రికవరీ చేయవచ్చని నిపుణులు అంటున్నారు. పనులు ఆపేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. విస్తరణ పనులు కొనసాగించి ఉంటే ఈపాటికే పూర్తి అయ్యేవని, లక్ష్యం మేరకు 3,850 క్యూసెక్కులు ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉండేదని అంటున్నారు. విస్తరణ చేయకపోవడంతో 1,680 క్యూసెక్కులకు లిఫ్ట్‌ చేయలేని పరిస్థితి ఏర్పడింది.  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులకు శాపంగా మారింది. ప్రజా ధనం వృథా అయింని సాగునీటి నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక 10 వేల క్యూసెక్కులతో హంద్రీనీవా కాల్వకు సమాంతరంగా మరో కాలువ తవ్వుతామని జగన హామీ ఇచ్చారు. ఆ దిశగా చేపట్టిన చర్యలు లేవని అంటున్నారు. 

 సర్వే చేస్తున్నాం - డి. రామగోపాల్‌, ఎస్‌ఈ, హంద్రీనీవా ప్రాజెక్టు, కర్నూలు: 

హంద్రీనీవా ప్రధాన కాలువ విస్తరణ పనులపై సర్వే చేస్తున్నాం. త్వరలోనే సమగ్ర నివేదకను ప్రభుత్వానికి పంపుతాం. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయగానే టెండర్లు పిలిచి పనులు చేపడుతాం. 

 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.