రూ. 500 కోట్లతో సమీకృత మార్కెట్లు

ABN , First Publish Date - 2021-06-15T06:17:41+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా రూ.500కోట్ల వ్యయంతో గజ్వేల్‌ తరహాలో సమీకృతమార్కెట్లను నిర్మించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు.

రూ. 500 కోట్లతో సమీకృత మార్కెట్లు
ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ మ్యాప్‌ను పరిశీలిస్తున్న సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

 దేశంలోనే పెద్ద ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల నిర్మాణం అద్భుతం

 రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌


గజ్వేల్‌/వర్గల్‌, జూన్‌ 14: రాష్ట్రవ్యాప్తంగా రూ.500కోట్ల వ్యయంతో గజ్వేల్‌ తరహాలో సమీకృతమార్కెట్లను నిర్మించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సొంత నియోజకవర్గమైన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌తో కలసి సోమవారం ఆయన పర్యటించారు. ములుగు మండలం తునికిబొల్లారంలోని కొండపోచమ్మసాగర్‌ పునరావాసకాలనీ, అటవీ కళాశాలను సందర్శించారు. వర్గల్‌ మండల కేంద్రంలో ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు భూములను పరిశీలించారు. వర్గల్‌ శివారులోని బొడిగెబండ, నవోదయ విద్యాలయం సమీపంలో ఉన్న ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల వివరాలను రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గజ్వేల్‌ సమీపంలో నిర్మించిన మల్లన్నసాగర్‌ పునరావాస కాలనీని, పట్టణంలో నిర్మించిన సమీకృత మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. గజ్వేల్‌ సమీకృత మార్కెట్‌ అన్నివసతులతో అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. పుష్కలంగా గాలివెలుతురు వచ్చేలా ఏర్పాటు చేశారని, విక్రయదారులకు, కొనుగోలుదారులకు సౌకర్యంగా ఉందని పేర్కొన్నారు. త్వరలో జరిగే కలెక్టర్ల సమావేశంలో గజ్వేల్‌ మార్కెట్‌ ప్రత్యేకతలను వివరిస్తానని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు ఈ మార్కెట్‌ను సందర్శిస్తారని, ఎన్‌ఐఆర్డీలో శిక్షణలో ఈ మార్కెట్‌ ప్రత్యేకతల గురించి చెప్తామని సీఎస్‌ తెలిపారు. గజ్వేల్‌ మార్కెట్‌ నమూనాలోనే రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్లనిర్మాణం చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఇందుకోసం ప్రభుత్వం నిధులను కూడా కేటాయించిందని చెప్పారు.తునికిబొల్లారం, గజ్వేల్‌లో దేశంలోనే అతిపెద్ద ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల నిర్మాణం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. విశాలమైన రోడ్లు, మౌలికసదుపాయాలతో పునరావాస కాలనీలను అద్భుతంగా తీర్చిదిద్దారని మెచ్చుకున్నారు. 6వేల ఇళ్లతో మల్లన్నసాగర్‌ పునరావాసకాలనీ, 2,200ఇళ్లతో కొండపోచమ్మసాగర్‌ పునరావాస కాలనీలు దేశంలో అతిపెద్ద పునరావాస కాలనీలుగా నిలుస్తాయని వివరించారు. పునరావాస కాలనీల్లో నిర్వాసితులతో మాట్లాడానని, వారు అన్నివిధాలా సంతృప్తిగా ఉన్నారని స్పష్టం చేశారు. పునరావాస కాలనీలను, సమీకృత మార్కెట్‌ను అద్భుతంగా తీర్చిదిద్దిన సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి, అధికారుల బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. వారివెంట అడిషనల్‌ కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు. 


హరితసంపదను పెంచాలి

ములుగు: రాష్ట్రంలోని హరిత సంపద పెంచడం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్నారు. సోమవారం గజ్వేల్‌ నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా మధ్యాహ్నం ములుగు అటవీ కళాశాల మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హరిత సంపద సృష్టించేందుకు మీవంతు కృషి తప్పనిసరి సూచించారు. మొక్కలు పెంచడమే కాదు దాని సంపదను సృష్టించడం మన బాధ్యతగా భావించి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన వెంటకలెక్టర్‌ వెంకట్రామారెడ్డి అటవీకళాశాల చీఫ్‌ సెక్రటరీ  ప్రియాంకతో పాటు సిబ్బంది ఉన్నారు.


దేశానికే ఆదర్శం తునికి బొల్లారం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ 

ములుగు: కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం నిర్మించి ఇచ్చిన తునికి బొల్లారం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌ అభిప్రాయపడ్డారు. సోమవారం సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికి బొల్లారం ఆర్‌అండ్‌ఆర్‌కాలనీ పరిశీలించడానికి వచ్చిన సోమేశ్‌కుమార్‌కు కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం కాలనీ లేఅవుట్‌ను చూపించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌ మాట్లాడుతూ.. నిర్వాసితుల కోసం ఏర్పాటుచేసిన ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ నమూనా దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. నిర్వాసితులైన భూపాల్‌రెడ్డి, సత్తయ్యచారిని కాలనీలో ఎలాంటి వసతులు కల్పించారని అని అడగ్గా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీర్‌ ఇచ్చిన హామీ ప్రకారం నిర్మాణం చేశారని చెప్పారు. తాము ఇప్పుడు సంతోషంగా ఉన్నామని పేర్కొన్నారు. ఆయన వెంట ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌ రంజాన్‌, కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ ఆర్డీవో విజయేందర్‌రెడ్డితో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, నిర్వాసితులు ఉన్నారు

Updated Date - 2021-06-15T06:17:41+05:30 IST