ములుగు జిల్లాకు వనదేవతల పేరు పెట్టాలి

ABN , First Publish Date - 2022-06-23T05:43:12+05:30 IST

ములుగు జిల్లాకు వనదేవతల పేరు పెట్టాలి

ములుగు జిల్లాకు వనదేవతల పేరు పెట్టాలి

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌ కుమార్‌ 

వెంకటాపూర్‌ (రామప్ప), జూన్‌ 22: ములుగు జిల్లాకు సమ్మక్క-సారలమ్మగా నామకరణం చేయాలని బహుజన సమాజ్‌పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు  ఆర్‌.ఎ్‌స.ప్రవీణ్‌ కుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 300 రోజుల బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా మండలంలోని బరిగలోనిపల్లి, వెంకటాపూర్‌, ఎల్లారెడ్డిపల్లి, లక్ష్మీదేవిపేట గ్రామాల్లో ఆయన బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల పునర్విభజన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేవుళ్ల పేర్లతో జిల్లాలు ఏర్పాటు చేశారన్నారు. ఎంతో చరిత్ర కలిగిన మేడారం సమ్మక్క, సారలమ్మ పేరును మాత్రం ములుగు జిల్లాకు పెట్టకపోవడం దారుణమని విమర్శించారు. ములుగు జిల్లా కేంద్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పిన  ప్రభుత్వం ఇప్పటి వరకు పనులు చేపట్టడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. పేదల చదువంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇష్టంలేదని, అందుకే ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు పుస్తకాలు కూడా అందించలేదని వ్యాఖ్యానించారు.  ములుగు జిల్లాకేంద్రంగా ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు బస్సు డిపో లేకపోవడం దారుణమన్నారు. వెంకటాపూర్‌ మండలంలోని గ్రామాల్లో ప్రజలకు ఇప్పటి వరకు నీళ్లు దొరకడంలేదని అన్నారు. రూ.36 వేల కోట్లతో చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం ఎవరి జేబులు నింపడానికని ప్రశ్నించారు. ఓట్లు వేయించుకుని ప్రజలను మరచిపోయే నాయకులకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని, వచ్చే ఎన్నికల్లో బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు దూడపాక నరేష్‌, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-23T05:43:12+05:30 IST