కిలో రూ.100

ABN , First Publish Date - 2021-11-25T05:17:03+05:30 IST

కూరగాయలు ముట్టుకుంటే షాక్‌ కొడుతున్నాయి.

కిలో రూ.100
చాగలమర్రి సంత

  1. దాదాపు ప్రతి కూరగాయదీ అంతే ధర
  2. పది రోజులుగా తగ్గేదేలా అంటున్న టమాటా
  3. బెంబేలెత్తిపోతున్న సామాన్యులు

చాగలమర్రి, నవంబరు 24: కూరగాయలు ముట్టుకుంటే షాక్‌ కొడుతున్నాయి. కేజీ రూ.100 పలుకు తున్నాయి. సాధారణంగా జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు కూరగాయల ధరలు తగ్గుతుంటాయి. ఈ ఏడాది మార్చి మొదలుకొని నవంబరు వరకు ధరలు భారీగా పెరిగాయి. ఏ కూరగాయ అడిగినా రూ.100 చెబుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కూరగాయల ధరలు మరింత ఘాటెక్కాయి. నెల రోజుల క్రితం వరకు కిలో టమోటా రూ.20 ఉండగా ఇప్పుడు రూ.100 కు పెరిగింది. క్యారెట్‌ కిలో రూ.30 నుంచి రూ.40 ఉండగా ప్రస్తుతం రూ.80 నుంచి రూ.100 వరకు పలుకుతోంది. మిర్చి కిలో రూ.100, కాకర, దొండ, బెండ, రూ.80 వరకు ఉన్నాయి. బీర కాయలు, వంకాయలు రూ.80 వరకు చేరింది. ఈ ధరల పెరుగుదల చూసి హోటళ్లు, కర్రిస్‌పాయింట్‌ యజమానులు వంటలు తయారు చేయాలంటే బెంబేలెత్తిపోతున్నారు. ధరల పెరు గుదలతో పేదవారే కాకుండా చిన్న చిన్న హోటళ్లతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న చిరు వ్యాపారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. సామాన్య ప్రజలు ఒక్కపూట కూడా కూరలు వండుకునే పరిస్థితి లేదని వాపోతు్నారు. రాష్ట్రంలో కూరగాయలు ఎక్కువగా పండించే రాయలసీమ ప్రాంతంలో వర్షాలకు దిగుబడులు తగ్గడంతో కర్నాటక, మహారాష్ట్ర నుంచి టమోటాలు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కూరగాయల ధరలు అమాంతంగా పెరిగిపోయాయని వ్యాపారులు అంటున్నారు. మదనపల్లె, అనంతపురం మార్కెట్‌లలో 25 కేజీల టమోటా బాక్సు రూ.3 వేలు పలుకుతోంది. దీంతో వ్యాపారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి కూరగాయల ధరలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకో వాలని పేద, మధ్యతరగతి ప్రజలు కోరుతున్నారు. 


ధరలు అమాంతంగా పెరిగాయి

టమోటాలు, బీరకాయలు, వంకాయలు రూ.100 దాటేశాయి. దీంతో కొనలేక తినలేక ఉన్నాం. వచ్చిన కూలి డబ్బులు కూరగాయలకే సరిపోయే పరిస్థితి. దీంతో పచ్చడి మెతుకులు తినాల్సి వస్తోంది. ధరలు తగ్గే అవకాశం కనిపించడం లేదు. 

- రమాదేవి, చెంచు మహిళ 


కొనలేకున్నాం.. తినలేకున్నాం 

కూరగాయల ధరలు అమాంతంగా పెరగడం తో కొనలేక తినలేకపోతున్నాం. రూ.300 తీసుకెళ్లిన మూడు రకాల కూరగాయలు రావడం లేదు. కూరగాయలు తినేందుకు ఇబ్బంది పడుతున్నాం. ధరలు తగ్గే అవకాశం ఇప్పట్లో కనిపించడం లేదు. ప్రభుత్వం ధరలు తగ్గించాలి 

-ఇళ్లు అంజమ్మ 


వ్యాపారం చేయలేం 

పెరిగిన కూరగాయల ధరలతో వ్యాపారం చేయలేకపోతున్నాం. ప్రస్తుతం ఏమి కొనాలన్నా కేజీ రూ.100 పలుకు తుండటంతో విని యోగదారులు కొనకుండానే వెనుదిరుగుతున్నారు. టమోటా మదనపల్లి, అనంతపురం నుంచి దిగుమతి అవుతుంటాయి. ఇటీవల కురిసిన వర్షాలతో అక్కడ తోటలు దెబ్బతిన్నాయి. 25 కేజీల టమోటా బాక్సు రూ.3 వేలు ఉంది. అక్కడ కూడా సరుకులేదు. దీంతో మహారాష్ట్ర నుంచి సరుకు తెస్తుండటంతో ధరలు పెరుగుతున్నాయి.         

- బురాన్‌దిన్‌, వ్యాపారి

Updated Date - 2021-11-25T05:17:03+05:30 IST