రూ.350కే కొవిడ్‌ టెస్ట్‌ చేయాలి : జేసీ

ABN , First Publish Date - 2022-01-23T06:57:11+05:30 IST

జిల్లాలో గుర్తించిన ల్యాబ్‌లలో మాత్రమే ప్రభుత్వం నిర్దేశించిన రుసుం రూ.350కే కొవిడ్‌ (ఆర్‌టీపీసీఆర్‌) టెస్ట్‌ చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ కీర్తి చేకూరి ఆదేశించారు.

రూ.350కే కొవిడ్‌ టెస్ట్‌ చేయాలి : జేసీ
కలెక్టరేట్‌లో శనివారం జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న జేసీ కీర్తి

 ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబర్లు 1902, 104

 ఆంధ్రజ్యోతి కథనం ఎఫెక్ట్‌

కాకినాడ సిటీ/ జీజీహెచ్‌, జనవరి 22: జిల్లాలో గుర్తించిన ల్యాబ్‌లలో మాత్రమే ప్రభుత్వం నిర్దేశించిన రుసుం రూ.350కే కొవిడ్‌ (ఆర్‌టీపీసీఆర్‌) టెస్ట్‌ చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ కీర్తి చేకూరి ఆదేశించారు. జిల్లాలోని పలు ప్రైవేటు హాస్పటల్స్‌ ల్యాబ్‌లలో అనుమతులు లేకుండా కొవిడ్‌ టెస్ట్‌లు చేస్తూ రిపోర్టులను గోప్యంగా ఉంచుతూ చికిత్స అందిస్తున్న విషయమై ‘ఆంధ్రజ్యోతి’లో కఽథనాలు ప్రచురితమయ్యాయి. ఈ కఽథనాలపై అధికారులు స్పందించారు. దీనిపై జాయింట్‌ కలెక్టర్‌ కీర్తి శనివారం కలెక్టరేట్‌లో జిల్లాలోని ప్రైవేటు ల్యాబ్‌ల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన రుసుం రూ.350 కంటే ఎక్కువ మొత్తం తీసుకున్న పక్షంలో ఫిర్యాదు చేసేందుకు టోల్‌ ఫ్రీ నంబర్లు 1902, 104 కేటాయించారు. ఫిర్యాదుదారులు ఇచ్చే ఫిర్యాదులు ఆధారంగా ల్యాబ్‌లవారిపై జరిమానా, చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోనున్నారు. ఈ సందర్భంగా జేసీ కీర్తి మాట్లాడుతూ ఫలితాలు త్వరగా వస్తాయని, ఖచ్చితత్వం ఎక్కువని ల్యాబ్‌ల వారు చెప్పే మాయమాటలు నమ్మి ఎక్కువ రుసుం చెల్లించవద్దని తెలిపారు. ప్రభుత్వం గుర్తించిన ల్యాబ్‌లలో కొవిడ్‌ పరీక్ష రుసుం, కిట్‌, పీపీయు కిట్‌ కలిపి అయ్యే రుసుం కలిపి ఉంటాయని, ఈ రుసుంను ల్యాబ్‌లలో డిస్‌ప్లే చేయాలని జేసీ కీర్తి ఆదేశించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ మీనాక్షి మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం గుర్తించిన ల్యాబ్‌లు మాలిక్కులార్‌ లేబరేటరీ, జీఎస్‌ఎల్‌ మెడికల్‌ కాలేజీ, కోనసీమ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (కిమ్స్‌), సత్య స్కాన్‌ అండ్‌ డయాగ్నోస్టిక్‌, ఎక్స్‌రేట్‌ ల్యాబ్‌, క్వాలిటీ కేర్‌ ల్యాబ్‌, శ్రీనివాస మెడికల్‌ సెంటర్‌లలో ప్రభుత్వం నిర్దేశించిన రుసుం రూ.350కి కొవిడ్‌ టెస్ట్‌ చేయించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో వివిధ ల్యాబ్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-01-23T06:57:11+05:30 IST