రూ.8.15 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2022-09-28T06:25:08+05:30 IST

వచ్చే దశాబ్ద కాలంలో కొత్త ఇంధనం, డేటా సెంటర్లు సహా డిజిటల్‌ వ్యాపారాల్లో 10,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.8.15 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ తెలిపారు.

రూ.8.15 లక్షల కోట్లు

వచ్చే పదేళ్లలో శుద్ధ ఇంధనం, డిజిటల్‌ రంగాల్లో అదానీ గ్రూప్‌ పెట్టనున్న పెట్టుబడులివి..


న్యూఢిల్లీ: వచ్చే దశాబ్ద కాలంలో కొత్త ఇంధనం, డేటా సెంటర్లు సహా డిజిటల్‌ వ్యాపారాల్లో 10,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.8.15 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ తెలిపారు. అందులో 70 శాతం హరిత ఉదజని (గ్రీన్‌ హైడ్రోజన్‌) వంటి శుద్ధ ఇంధన తయారీ కోసం వెచ్చించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. భారత్‌ ఒక రోజున నికర ఇంధన ఎగుమతిదారుగా అవతరించనుందని ధీమా వ్యక్తం చేశారు. సింగపూర్‌లో మంగళవారం జరిగిన ఫోర్బ్స్‌ గ్లోబల్‌ సీఈఓ సదస్సులో అదానీ ప్రసంగించారు. ప్రస్తుతమున్న 20 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని మరో 45 గిగావాట్ల మేర పెంచనున్నట్లు ఆయన చెప్పారు. అంతేకాదు.. సోలార్‌ ప్యానెళ్లు, విండ్‌ టర్బైన్స్‌, హైడ్రోజన్‌ ఎలకో్ట్రలైజర్స్‌ తయారీ కోసం మూడు గిగా ఫ్యాక్టరీలను నిర్మించనున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇంధన పరివర్తనం ద్వారా డిజిటల్‌ విభాగంలోనూ లబ్ధి పొందాలనుకుంటున్నట్లు అదానీ తెలిపారు. భారత డేటా సెంటర్ల మార్కెట్‌ విస్ఫోటక వృద్ధి సాధిస్తోందన్నారు. ప్రపంచంలో డేటా సెంటర్ల రంగానికే అత్యధిక ఇంధనం అవసరమవుతోందన్నారు. కాబట్టి, హరిత ఇంధన ఆధారిత డేటా సెంటర్ల నిర్మాణం గేమ్‌ ఛేజింగ్‌గా పరిణమించనుందన్నారు. అంతేకాదు, డేటా సెంటర్లను భూసంబంధ, సముద్ర గర్భ కేబుల్స్‌ ద్వారా అనుసంధానించనున్నట్లు వెల్లడించారు. అదానీ గ్రూప్‌నకు చెందిన కోట్లాది కస్టమర్లకు ఉమ్మడి డిజిటల్‌ వేదికను ఏర్పాటు చేసేందుకు సూపర్‌ యాప్స్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. అదానీ గ్రూప్‌ ప్రపంచంలోనే అతిపెద్ద సస్టెయినబిలిటీ క్లౌడ్‌ను అభివృద్ధి చేసిందని, గ్రూప్‌నకు చెందిన వందలాది సోలార్‌, విండ్‌ పవర్‌ యూనిట్లను ఆ క్లౌడ్‌ ద్వా రానే నిర్వహిస్తున్నామన్నారు. 


ఏకాకి చైనా! 

ప్రపంచీకరణలో ఒకప్పుడు అగ్రగామిగా ఉన్న చైనా.. రానురాను ఒంటరి దేశంగా మారుతోందని గౌతమ్‌ అదానీ అభిప్రాయపడ్డారు. మితిమీరుతున్న జాతీయవా దం, సరఫరా వ్యవస్థలో మార్పులు, సాంకేతిక పరమైన ఆంక్షలు ఆ దేశంపై ప్రభావం చూపుతున్నాయన్నారు. చాలా దేశాలు వ్యతిరేకించడంతో చైనాకు బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టు సవాలుగా మారిందన్నారు. చైనా రియల్టీ మార్కెట్లో ప్రస్తుత సంక్షోభాన్ని 90వ దశకంలో జపాన్‌ ఎదుర్కొన్న సంక్షోభంతో పోల్చారు. అయితే, ఆర్థిక వ్యవస్థలు ఈ సవాళ్లు, సంక్షోభాల నుంచి గట్టెక్కి, తిరిగి పుంజుకోవడం ఈసారి మరింత క్లిష్టతరం కానుందన్నారు. 


36 నెలల్లో ప్రపంచం మారిపోయింది.. 

‘‘డిజిటల్‌ విప్లవంతో దేశాల మధ్య సరిహద్దులు తొలిగిపోతాయని భావించాం. మార్కెట్‌ సడలింపులు, ఆర్థిక ఏకీకరణతో గురుత్వ బంధనాన్ని తెంచుకున్న ఆర్థిక పురోగతి ప్రారంభమైందని అంగీకరించాం. అది సరిహద్దులు లేని అపరిమిత వృద్ధికి తార్కిక సారాంశంగా అనిపించింద’’ని గౌతమ్‌ అదానీ పేర్కొన్నారు. కానీ, ప్రపంచ మార్కెట్లు కొత్త సిద్ధాంతాలను అనుసరించాల్సి వచ్చింది. స్వీయసమృద్ధి, అవాంతరాలు లేని సరఫరా వ్యవస్థ, బలమైన జాతీయవాదం ఆవశ్యకంగా మారా యి. కొంతమంది దీన్ని ప్రపంచీకరణకు తిరోగమనంగా భావించారన్నారు. గత 36 నెలల్లో ప్రపంచంలో సమూల మార్పులొస్తాయని ఎవరు ఊహించారు..? అని ఆయన ప్రశ్నించారు. మార్కెట్లో గిరాకీ అనూహ్యంగా పెరిగి సరఫరా కొరత కారణంగా మార్కెట్లో ధరలు 40 ఏళ్ల గరిష్ఠానికి ఎగబాకడం అసాధారణ సంక్లిష్టతలను సృష్టించిందన్నారు. ధరల కట్టడికి చాలా దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లు భారీగా వడ్డీ రేట్లను పెంచుతుండటం ఆ దేశాలు మాంద్యంలోకి జారుకునే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఇదే ప్రస్తుత వాస్తమన్నారు. వీటికి తోడు, రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం వాటి సరిహద్దులు దాటి ప్రపంచమంతా ప్రభావం చూపుతోందని, పర్యావరణ మార్పుల సవాళ్లను పెంచుతోందని, భవిష్యత్‌ మహమ్మారులపై అనిశ్చితి పెంచిందన్నారు. 


2030 నాటికి భారత్‌ @ నం.3

ప్రపంచ ప్రతికూలతలు భారత్‌కు అవకాశాలు పెంచాయని అదానీ అన్నారు. రాజకీయ, భౌగోళిక వ్యూహాలు, మార్కెట్‌ పరంగా చూస్తే, ఆకాశంలో మెరుస్తున్న అతికొద్ది తారల్లో భారత్‌ ఒకటన్నారు. 2030 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించనుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే 25 ఏళ్లలో ఇండియా 100 శాతం అక్షరాస్యత సాధించనుందని, పేదరికం తొలిగిపోనుందని, జనాభా సగటు వయసు 38 ఏళ్లుగా ఉండనుందన్నారు. అలాగే, భారత ఆర్థిక వ్యవస్థ 3 లక్షల కోట్ల డాలర్ల నుంచి 30 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోనుందన్నారు. 


ప్రపంచ కుబేరుల లిస్ట్‌లో 3 స్థానానికి జారుకున్న అదానీ 

బ్లూంబర్గ్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్‌ అదానీ 2 నుంచి 3వ స్థానానికి జారుకున్నారు. సోమవారం భారీ నష్టాలను చవిచూసిన భారత స్టాక్‌ మార్కెట్లో అదానీ గ్రూప్‌ కంపెనీ షేర్లూ క్షీణించాయి. దాంతో ఆయన వ్యక్తిగత ఆస్తి 700 కోట్ల డాలర్ల మేర తగ్గి 13,500 కోట్ల డాలర్లకు పడిపోయింది. అదే సమయంలో అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌ నెట్‌వర్త్‌ 136 కోట్ల డాలర్లు పెరిగి 13,800 కోట్ల డాలర్లకు చేరుకుంది. దాంతో ఆయన మళ్లీ రెండో స్థానానికి ఎగబాకారు.  

Updated Date - 2022-09-28T06:25:08+05:30 IST