హిందూత్వ ఇటాలియన్ బాంధవ్యం

Published: Sat, 04 Jun 2022 01:01:56 ISTfb-iconwhatsapp-icontwitter-icon
హిందూత్వ ఇటాలియన్ బాంధవ్యం

‘ఫాసిజం / నాజీయిజం, హిందూ మితవాద పక్షం (హిందూత్వ) మధ్య ఏమైనా పోలికలను మీరు చూస్తున్నారా? తర్కబద్ధంగా విపులీకరించండి’– ఇది, ఉత్తరప్రదేశ్‌లోని శారదా విశ్వవిద్యాలయ రాజనీతి శాస్త్రవేత్త ఒకరు గత నెలలో తన విద్యార్థులకు నిర్వహించిన పరీక్షలో ఇచ్చిన ప్రశ్న. విశ్వవిద్యాలయ అధికారులు ఈ ప్రశ్నను తీవ్రంగా పరిగణించారు. అటువంటి ప్రశ్న వేయడం మన దేశ ‘మహోన్నత జాతీయ అస్తిత్వం’ పట్ల సంపూర్ణ విముఖత చూపడమేనని, అది సమాజంలో తీవ్ర విభేదాలను రెచ్చగొట్టే విధంగా ఉందని వారు గట్టిగా అభిప్రాయపడ్డారు. ఇక, ఆ ప్రశ్నను ఇచ్చిన అధ్యాపకుడిని సస్పెండ్ చేశారని మరి చెప్పాలా?


శారదా విశ్వవిద్యాలయంలో నిషిద్ధమయిన ఆ ప్రశ్నకు సమాధానమివ్వడానికి ఈ కాలమ్ ప్రయత్నిస్తుంది. ఇటాలియన్ చరిత్రవేత్త మార్జియా కసోలారి రచనల ఆధారంగా ఆ ప్రశ్నకు సమాధానమిస్తాను. ఈ అంశంపై ఆ విదుషీమణి 2000లో ‘ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ’లో ‘హిందూత్వ ఫారిన్ టై–అప్ ఇన్ 1930స్’ అనే వ్యాసాన్ని రాశారు. ఇరవై సంవత్సరాల అనంతరం అదే అంశంపై ఆమె ‘ఇన్ ది షాడో ఆఫ్ ది స్వస్తిక : ది రిలేషన్ షిప్స్ బిట్వీన్ రాడికల్ నేషనలిజం, ఇటాలియన్ ఫాసిజం’ అనే పుస్తకాన్ని రాశారు. ఇదొక అసాధారణ పరిశోధనా గ్రంథం. ఇటలీ, భారత్, బ్రిటన్‌లలోని పలు గ్రంథాలయాలలో వివిధ భాషలలోని పాత పత్రికల నుంచి తీసుకున్న సమాచారం ఆధారంగా ఆమె ఆ పుస్తకాన్ని రాశారు.


1920ల్లోనూ, 1930ల్లోనూ మరాఠీ పత్రికలు ఇటాలియన్ ఫాసిజం గురించి విస్తృతంగా వార్తలు, వ్యాసాలు అందించాయని కసోలారి కనుగొన్నారు. ఇటలీలో వలే భారత్‌లో కూడా ఫాసిజం లాంటి భావజాలం సమాజాభివృద్ధికి విశేషంగా దోహదం చేయగలదనే విశ్వాసంతోనే మరాఠీ పాత్రికేయులు ఇటాలియన్ ఫాసిజం పట్ల విశేష శ్రద్ధాసక్తులు చూపారని ఆమె అభిప్రాయపడ్డారు. వెనుక బడిన భారతీయ వ్యవసాయక సమాజం ఒక పారిశ్రామిక శక్తిగా ఎదిగేందుకు, నానారకాల తగువులాటలతో ఛిన్నాభిన్నమవుతున్న వివాదగ్రస్త సమాజంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు ఫాసిజం లాంటి భావజాలం అవసరమని ఆనాటి మరాఠీ పాత్రికేయులు భావించారు. ముస్సోలినీ, ఆయన నేతృత్వంలోని ఫాసిస్టు ప్రభుత్వం వివిధ రంగాలలో చేస్తున్న కృషిని వివరిస్తూ వారు రాసిన పలు వ్యాసాల నుంచి కసోలారి విస్తృతంగా ఉటంకింపులు కూడా ఇచ్చారు.


ఆ వ్యాసాలను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలీరాం హెడ్గేవార్, వ్యవస్థాపకుడు ఎమ్ఎస్ గోల్వాల్కర్; హిందూ మహాసభ నాయకులు వినాయక్ దామోదర్ సావర్కార్, బి.ఎస్.మూన్జె తప్పక చదివే వుంటారు. ఈ నలుగురి మాతృభాష మరాఠీయే కావడం గమనార్హం. 1920ల్లోనే మహారాష్ట్రలో ముస్సోలినీకి పలువురు అభిమానులు ఉన్నారని డాక్టర్ కసోలారి అన్నారు. మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఇటాలియన్ సమాజం అల్లకల్లోలమయింది. ముస్సోలినీ నాయకత్వంలోని ఫాసిస్టు పార్టీ అధికారాన్ని కైవశం చేసుకుని ఆ పరిస్థితులను పూర్తిగా చక్కదిద్దడం నాటి హిందూ జాతీయ వాదులను విశేషంగా ప్రభావితం చేసింది.. తత్కారణంగానే ప్రజాసామ్య విధానాలకు బద్ధ వ్యతిరేకి అయిన ఫాసిస్టు పార్టీని బ్రిటిష్ సమాజం ఆదర్శప్రాయంగా భావించే ప్రజాస్వామ్యానికి సరైన ప్రత్నామ్నాయమని వారు భావించారు’.


హిందూ మితవాద వర్గం ప్రధాన సిద్ధాంతకర్త బిఎస్ మూన్జె గురించి కసోలారి విస్తృతంగా రాశారు. 1931లో ఆయన ఇటలీని సందర్శించారు. ఫాసిస్టు ప్రభుత్వ పాలన గురించి సామాన్య ప్రజలతో మాటామంతీతో ఒక సానుకూల అవగాహనకు వచ్చారు. ఫాసిస్టు పార్టీ ఇటాలియన్ యువజనులలో సైనికవాద స్ఫూర్తిని పెంపొందించడం మూన్జెను బాగా ఆకట్టుకుంది. బెనిటో ముస్సోలినీని స్వయంగా కలుసుకుని వివిధ అంశాల గురించి విస్తృత చర్చలు జరిపారు. తన ముందు వినమ్రంగా నుంచున్న మూన్జెను ‘ఫాసిస్టు యువజన సంస్థల గురించి మీ అభిప్రాయం ఏమిటని’ ముస్సోలినీ ప్రశ్నించాడు. ‘అవి నన్ను అమితంగా ప్రభావితం చేశాయి. అభివృద్ధి చెందుతున్న ప్రతి దేశానికీ అటువంటి యువజన సంస్థ ఒకటి ఉండి తీరాలి. ఒక సైనిక శక్తిగా భారత్ పునరుజ్జీవానికి అటువంటి సంస్థలు ఎంతైనా అవసరమని’ మూన్జె సమాధానమిచ్చారు. ముస్సోలినీతో తన సంభాషణల గురించి రాస్తూ ఆ ఇటాలియన్ నియంతను మూన్జె ఇలా ప్రశంసించారు: ‘యూరోపియన్ ప్రపంచ మహోన్నతులలో ముస్సోలినీ ఒకడు. దృఢ సంకల్పుడు, శక్తిమంతమైన వ్యక్తిత్వమున్న గొప్ప మనిషి. సామాన్య ఇటాలియన్లూ ఆయన్ని అమితంగా అభిమానించడాన్ని నేను స్వయంగా గమనించాను’.


ముస్సోలినీ వ్యక్తిత్వమే కాదు, నిరంతర యుద్ధానికి ఉవ్విళ్ళూరుతూ శాంతి సమన్వయాలను ఈసడించే ఫాసిస్టు భావజాలం కూడా మూన్జెను ముగ్ధుడ్ని చేసింది. ఇటాలియన్ నియంత ప్రకటనలను ఆయన తన వ్యాసాలలో విస్తారంగా ఉటంకించారు. వాటిలో ఒకటి: ‘శాంతి సాధ్యతలో ఫాసిజానికి నమ్మకం లేదు. శాశ్వత శాంతి ప్రయోజనాన్నీ అది విశ్వసించదు. పిరికితనం నుంచి పుట్టిన శాంతికాముకత సిద్ధాంతాన్ని ఫాసిజం నిర్ద్వంద్వంగా నిరాకరిస్తుంది’.


హిందూ మహాసభ నాయకుడు అయిన మూన్జె రాష్ట్్రీయ స్వయం సేవక్ సంఘ్ సంస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలీరాం హెగ్డేవార్‌కు గురువు. నాగపూర్‌లో విద్యార్థిగా ఉన్నప్పుడు హెగ్డేవార్ మూన్జె గృహంలోనే ఉండేవాడు. మెడిసిన్ చదవడానికి హెగ్డేవార్‌ను కలకత్తా పంపించింది కూడా మూన్జెనే. ఇటలీలో పర్యటన అనంతరం సంఘ్, హిందూ మహాసభల మధ్య సంబంధాలను మరింతగా పటిష్ఠం చేసేందుకు మూన్జె, హెగ్డేవార్ కలసికట్టుగా కృషి చేశారు. 1934లో ఫాసిజం, ముస్సోలినీపై జరిగిన ఒక సదస్సుకు హెగ్డేవార్ అధ్యక్షత వహించారని, మూన్జె ప్రధానోపన్యాసం చేశారని కసోలారి తెలిపారు. అదే ఏడాది మార్చిలో మూన్జె, హెగ్డేవార్, వారి సహచరులు సమావేశమయ్యారు. ఆ సందర్భంగా మూన్జె ఇలా అన్నారు: ‘దేశవ్యాప్తంగా హిందూ మతాన్ని ప్రమాణీకరణం చేసేందుకు హిందూ ధర్మ శాస్త్రాల ప్రాతిపదికన ఒక పథకాన్ని రూపొందించడం గురించి ఆలోచిస్తున్నాను... అయితే అలనాటి శివాజీ లాంటి నాయకుడుకానీ లేదా నేటి ముస్సోలినీ, అడాల్ఫ్ హిట్లర్ లాంటి నాయకులు కాని లేనిపక్షంలో ఆ ఆదర్శ ప్రణాళికను ఆచరణలోకి తీసుకురాలేము. అయితే మనం చేతులు కట్టుకుని కూర్చోవడానికి వీలులేదు. మన దేశంలో మనం ఆశిస్తున్న నాయకుడు తప్పక ప్రభవిస్తాడు. అప్పటివరకు, స్పష్ట, నిర్దిష్ట లక్ష్యంతో ఒక ప్రణాళికను రూపొందించి, దానికి విశేష ప్రాచుర్యం కల్పించాలి’. ఇటాలియన్ ఫాసిజం, ఆరెస్సెస్ భావజాలం మధ్య సమానాంతరాలు ఉన్నాయని కూడా మూన్జె అభిప్రాయపడ్డాడు. ఈ విషయాన్ని విపులీకరిస్తూ ఆయన ఇలా రాశాడు: ‘ఫాసిజం ప్రజల మధ్య ఐక్యతను కోరుతుంది. అందుకు కృషి చేస్తుంది. భారత్, ముఖ్యంగా హిందూ భారతదేశం సైనికంగా పునరుజ్జీవమయ్యేందుకు ఒక సంస్థ అవసరం. డాక్టర్ హెగ్డేవార్ సంస్థాపించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అటువంటి సంస్థ అని నేను భావిస్తున్నాను’.


సభ్యులను సమీకరించుకునేందుకు సంఘ్ అనుసరించే పద్ధతి ఇటలీలోని యువజన సంస్థ ‘బలీల్ల’ పాటించే పద్ధతినే పోలి ఉన్నదని కసోలారి పేర్కొన్నారు. ఉదాహరణకు శాఖ సభ్యులను వారి వయస్సుల వారీగా వర్గీకరిస్తారు (6–7 నుంచి, 10 నుంచి 14, 14 నుంచి 28, 28 నుంచి పెద్ద వయస్సు వాళ్లు). ఫాసిస్టు యువ జనసంస్థలు కూడా సభ్యులను ఇలానే వయస్సులవారీ శ్రేణులుగా వర్గీకరిస్తాయి’. ఆరెస్సెస్ గురించి 1833లో ఒక పోలీసధికారి ఫైల్ నోట్‌ను కూడా కసోలారి ఉటంకించారు: ‘ఇటలీలో ఫాసిస్టులు, జర్మనీలో నాజీల మాదిరిగా భవిష్యత్తులో భారతదేశంలో తామూ అలానే వెలుగొందాలని సంఘ్ ఆశిస్తుందనడంలో అతిశయోక్తి లేదు’. ఆ పోలీసధికారి ఇంకా ఇలా వ్యాఖ్యానించాడు: ‘సంఘ్ ముఖ్యంగా ముస్లిం వ్యతిరేక సంస్థ. భారతదేశంలో హిందువుల సంపూర్ణ ఆధిత్యాన్ని నెలకొల్పడమే దాని లక్ష్యం.


    వినాయక్ దామోదర్ సావర్కార్ ప్రపంచ దృక్పథం గురించి కూడా కసోలారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అలాగే మరో హిందూత్వవాది శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ గురించి కూడా కసోలారి తన పుస్తకంలో ప్రస్తావించారు. రెండు ప్రపంచ యుద్ధాల నడిమి కాలంలో ఫాసిజం పట్ల సానుభూతి చూపుతున్న భారతీయ మేధావులు, రాజకీయ వేత్తలతో సన్నిహిత సంబంధాలు నెరపేందుకు ఇటాలియన్ ప్రభుత్వం ప్రయత్నించింది. నాడు ప్రాచ్య దేశాల, ముఖ్యంగా భారతీయ సంస్కృతి అధ్యయనపరులైన ఇటాలియన్ విద్వజ్ఞులలో అగ్రగణ్యుడైన గ్యుసెప్పె టుక్కీ (1894– 1984) వారిని ప్రోత్సహించడంతో పాటు సహాయ సహకారాల నందించాడు. 1930లలో బిఎస్ మూన్జెతో ఆయన ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తుండేవారు. కలకత్తా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్‌గా ఉన్న శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ (బీజేపీ పూర్వావతారమైన భారతీయ జనసంఘ్ సంస్థాపకుడు)తో కూడా టుక్కీకి మంచి సంబంధాలు ఉండేవి. ‘కలకత్తాలో ఈయన మనకు చాలా ముఖ్యమైన సహకారి’ అని ఫాసిస్టు తాత్వికుడు గియోవన్ని జెంటైల్‌కు రాసిన ఒక లేఖలో ముఖర్జీ గురించి టుక్కీ పేర్కొన్నాడు. హిందూత్వ, ఫాసిజం మధ్య సమానాంతరాలను అన్వేషించిన ప్రాజ్ఞులలో మార్జియా కసోలారి తొలి విదుషీమణి కాదు. అయితే మరెవ్వరి కంటే కూడా ఆమె మరింత నిర్దుష్టంగా, సమగ్రంగా వాటిని గుర్తించి, విశ్లేషించి, వివరించారు. శారదా విశ్వవిద్యాలయ అధ్యాపకుడు తన విద్యార్థులకు ఇచ్చిన ప్రశ్న సహేతుకమైనదేనని కసోలారి పరిశోధనలు రుజువు చేశాయి. ఆ ప్రధాన ప్రశ్నకు సమాధానమివ్వడానికి విద్యార్థులను అనుమతించకపోవడంతో పాటు ప్రశ్నించిన అధ్యాపకుడిని సస్పెండ్ చేయడం ద్వారా ఆ విశ్వవిద్యాలయ అధికారులు తమ సత్యభీతిని ప్రదర్శించారు. బహుశా, అంతకంటే ఎక్కువగా తమ రాజకీయ యజమానుల భయాన్నే వారు నిరూపించారు. నేడు అధికారంలో ఉన్న హిందూత్వవాదులు తమ భావజాల వ్యవస్థాపకులు యూరోపియన్ ఫాసిస్టు సిద్ధాంతాలతో ప్రభావితులయారన్న వాస్తవాన్ని మనం మరచిపోవాలని కోరుకుంటున్నారు మరి.


హిందూత్వ ఇటాలియన్ బాంధవ్యం

రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.