వందేళ్ల సంఘ్ ముందున్న లక్ష్యాలు

ABN , First Publish Date - 2022-05-19T05:40:37+05:30 IST

ఈ సంవత్సరం విజయదశమి నాటికి సంఘ్ ప్రారంభమై 97 సంవత్సరాలు పూర్తవుతాయి. 1925లో నాగపూర్‌లో సంఘ్ స్థాపన జరిగింది.

వందేళ్ల సంఘ్ ముందున్న లక్ష్యాలు

ఈ సంవత్సరం విజయదశమి నాటికి సంఘ్ ప్రారంభమై 97 సంవత్సరాలు పూర్తవుతాయి. 1925లో నాగపూర్‌లో సంఘ్ స్థాపన జరిగింది. సంఘ్ కార్యం ఏ ఒక్కరి కృపతోనూ జరగలేదు. కార్యకర్తల కృషి, త్యాగం, బలిదానం మూలంగా, నానాటికి పెరుగుతున్న సమాజపు మద్దతు, శ్రీ పరమేశ్వరుని ఆశీర్వాదంవల్ల సంఘ్ విస్తృతి పెరుగుతున్నది. అనేక వ్యతిరేకతలు, అవరోధాలు, సమస్యలను అధిగమించి విస్తరిస్తున్నది. సంఘ్ తన శతాబ్ది వేడుకలను ఎలా జరుపుకుంటుందనే ఆసక్తి సైతం ప్రజల్లో నెలకొంది.


సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ దృష్టి చాలా స్పష్టమైనది. సంఘ్ సమాజంలో ఒక సంస్థ మాత్రమే కాదు. యావత్ సమాజాన్ని సంఘటితం చేసేది. భావనాత్మకంగా సంఘ్ మధ్య, హిందూ సమాజం మధ్య సమన్వయం ఉంటే, మనోవైజ్ఞానిక దృష్టి కోణంలో రెండూ ఒకటేనని సంఘ్ జ్యేష్ఠ కార్యకర్త శ్రీ దత్తేపంత్ ఠేంగ్డీ అన్నారు. ఈ కారణంగానే సంఘ్ శతాబ్ది వేడుకలు నిర్వహించాలనే ఆలోచనకు తావులేదు. సంఘ్ ఒక సంపూర్ణ సమాజం. సంఘ్ సాధనను సమాజమంతటా విస్తరింపజేయడమే లక్ష్యంగా ఉండాలి, సంఘ్ రజతోత్సవం సైతం జరుపుకోరాదని డాక్టర్ హెడ్గేవార్ చెబుతుండేవారు.  


సంఘ్ కార్య విస్తరణ యాత్రలో నాలుగు దశలు ఉన్నాయి. సంఘ్ స్థాపన నుంచి స్వాతంత్ర్యం వచ్చే వరకు మొదటి దశ. ఈ దశలో ఏకచిత్తంతో, ఏకాగ్రతతో కేవలం సంఘటనపైన మాత్రమే దృష్టి ఉంది. హిందూ సమాజం సంఘటితమవుతుంది, అడుగులో అడుగువేసి ఒకే దిశలో ఏకతాటిగా నడవగలదు, ఒకే మనస్సుతో ఒకే స్వరంతో భారత్ గురించి, హిందుత్వ గురించి మాట్లాడగలం అనే ఒక విశ్వాసాన్ని పాదుగొల్పడం అప్పుడు ముఖ్యం. అందుకనే ఆ లక్ష్యం కోసమే యావత్ కార్యమూ సాగింది.


వెయ్యి సంవత్సరాల నిరంతర సంఘర్షణ తర్వాత ‘స్వ’ ప్రేరణగా కొనసాగిన స్వరాజ్య ఉద్యమం ఆధారంగా విద్య, విద్యార్థి, రాజకీయ, కార్మిక, ఆదివాసీ, వ్యవసాయ... తదితర రంగాల్లో భారతదేశపు శాశ్వతమైన జాతీయ దృక్పథానికి ప్రేరణ చెంది వివిధ సంస్థలు ఆవిర్భవించాయి. అదే సమయంలో సంఘటన కార్యం రెండవ దశగా  కొనసాగింది. నేడు సంఘ్ కార్యకలాపాలు శాఖ రూపంలో 90శాతం బ్లాకులకు చేరుకున్నాయి. 35కు పైగా సంస్థలు సమాజ జీవనానికి చెందిన వివిధ క్షేత్రాల్లో చురుకుగాను, సమర్థమంతంగానూ పనిచేస్తున్నాయి.


సంఘ్ కార్యకలాపాల అభివృద్ధి యాత్రలో మూడవ దశ డాక్టర్ హెడ్గేవార్ జయంతి శతాబ్దిని పురస్కరించుకొని 1990లో ఆరంభమైంది. యావత్ సమాజం ఆత్మీయత, ప్రేమ ప్రాతిపదికన సంఘటితం కావాలి. అందుకు సమాజంలో వంచితులు, దుర్బలులు, వెనుకబడిన వర్గాలు, కనీస సౌకర్యాలకు నోచుకోకుండా జీవించేవారిని చేరుకొని వారికి సహాయం, సేవ చేయడాన్ని ఒక బాధ్యతగా భావించి, వారి సమగ్రాభివృద్ధి ధ్యేయంగా 1990లో ‘సేవా విభాగ్’ ఆరంభమయ్యింది.


‘దేశపు సర్వతోముఖాభివృద్ధి కోసం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో స్వయంసేవకుడిని అయ్యాను’ అనే ప్రతిజ్ఞను స్వయం సేవకులు చేస్తారు. ఈ సర్వతోముఖాభివృద్ధి కార్యాన్ని కేవలం స్వయంసేవకులు మాత్రమే చేయడం లేదు. సమాజంలోని అనేకమంది ప్రభావశీలురు, సమాజానికి ఏదో ఒకటి చేయాలని ఆకాంక్షించేవారు స్వచ్ఛందంగా ఎంతో చేస్తున్నారు. సమాజంలో అలాంటి ప్రభావశీలుర లక్షణాలు, వారి క్రియాశీలత, వారు సాధించిన విజయాలు, సమాజం నుంచి వారికి సహకారం... తదితర సమాచారాన్ని సేకరించటానికి, సంఘ్ భావజాలం, కార్యకలాపాల గురించిన సమాచారాన్ని వారికి చేరవేయటానికి 1994లో ‘సంపర్క్ విభాగ్’ కార్యకలాపాలు ఆరంభమయ్యాయి. సంపర్క్ విభాగ్ ద్వారా కొత్తగా పరిచయమైన వ్యక్తులు సంఘ్ లో చేరకపోవచ్చు. కానీ సంఘ్ స్వయం సేవకులుగా మేము వారిని కలుస్తాం.


అదే విధంగా వివిధ ప్రసార మాధ్యమాలను వినియోగించడం ద్వారా సంఘ్ జాతీయ భావజాలాన్ని సమాజంలో విస్తరింపజేయడం కోసం 1994లో ‘ప్రచార్ విభాగ్’ మొదలయ్యింది. ప్రజలకు సంబంధించిన అన్ని మాధ్యమాలను ఉపయోగించుకోవడానికి తోడు స్వయంగా వాటిని ప్రయోగించడం ద్వారా సంఘ్ ప్రచార్ విభాగ్ చురుకుగా పనిచేస్తున్నది. ఇదే సమయంలో కొన్ని సమస్యలపైన తక్షణం ప్రత్యేకమైన దృష్టి పెట్టడం ద్వారా సమాజంలో పరివర్తన తీసుకువచ్చే కార్యక్రమం కూడా ప్రారంభమైంది. ఇదే ‘ధర్మ జాగరణ్ విభాగ్’. దీని ద్వారా హిందూ సమాజాన్ని మార్పిడి గావించే దిశగా ప్రణాళికాబద్ధంగా జరిగే ప్రయత్నాలను అడ్డుకోవడంతో పాటుగా, మత మార్పిడికి గురైన ప్రజలకు తిరిగి వారిదైన సంస్కృతిలోకి చేరడానికి సులభమైన మార్గాన్ని చూపే కార్యక్రమం మొదలైంది. ప్రభుత్వంపై ఆధాపడకుండా ప్రజలందరూ కలిసికట్టుగా వారి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం, ప్రభుత్వ పథకాలను సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా గ్రామ సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ‘గ్రామ్–వికాస్’ కార్యక్రమం ఆరంభమైంది. 


మన హిందూ సమాజం వివిధ కులాలతో ఐక్యంగా కొనసాగింది. అయితే కొన్ని అంతర్గత శక్తులు సమాజాన్ని కుల విభేదాలతో చీల్చే పని చేస్తున్నాయి. సామాజిక సద్భావన సమావేశాల ద్వారా, ప్రతి ఒక్కరూ ఒకచోట కూర్చొని కొన్ని సాధారణ సమస్యల గురించి, సవాళ్ల గురించి ఆలోచించేలా చేయాలని, వాటిని అధిగమించడానికి సమిష్టిగా కృషి చేయాలనే ఉద్దేశ్యంతో ‘సామాజిక్ సద్భావ్’ పేరిట వరుస సమావేశాలు ప్రారంభమయ్యాయి.


మన సమాజంలో దురదృష్టవశాత్తూ అంటరానితనం పేరిట కొన్ని వర్గాలకు విద్య, సౌకర్యాలు, గౌరవ మర్యాదలు తిరస్కరించబడ్డాయి. ఇది చాలా అన్యాయం. ఈ అన్యాయాన్ని నివారించి, మన సమష్టి వారసత్వాన్ని గుర్తు చేసుకుంటూ అందరినీ కలిసికట్టుగా ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నంలో భాగంగా ‘సామాజిక్ సమరసత’ పని మొదలైంది.


భారతీయ దేశీ గోవుల నుంచి మనం పొందే ఉత్పత్తుల్లో ఔషధీయ విలువల పట్ల ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం, భారతీయ దేశీ గోవుల సంరక్షణ, సంవర్ధన, అభివృద్ధితో పాటుగా ఆవు పేడ ఆధారిత సేంద్రీయ వ్యవసాయం చేపట్టే దిశగా రైతులకు శిక్షణ ఇచ్చి, వారిని పర్యవేక్షిస్తూ ప్రోత్సహించడం కోసం ‘గోసేవ–గోసంవర్థన్’ కార్యక్రమం కూడా విజయవంతంగా సాగుతున్నది.


భారతీయ సంస్కృతి, పరంపరలో కుటుంబం పాత్ర అత్యంత విశిష్టమైనది. ప్రస్తుతం పట్టణీకరణ వల్ల, జీవనంలోని హడావుడి కారణంగా కుటుంబాలు చిన్నబోయాయి. అందరూ కలిసి కూర్చుని తమ వారసత్వం, సంప్రదాయాలు, సంబంధాలు, పండుగలు మొదలైన వాటి గురించి చర్చించుకోవడానికి కూడా సమయం దొరకడం లేదు. కనుక కనీసం వారానికి ఒకసారైనా కుటుంబ సభ్యులందరూ ఒకచోట కూర్చోవాలి. తమ జాతీయ వారసత్వం, సంప్రదాయం, సాంస్కృతిక, వర్తమాన సామాజిక పరిస్థితులను జాతీయ దృక్కోణంలో విశ్లేషించాలి. అలా విశ్లేషించగా వచ్చిన వికాసంలో తమ కర్తవ్యాన్ని చర్చించుకోవాలనే ఉద్దేశ్యంతో ‘కుటుంబ్ ప్రబోధన్’ కార్యక్రమం ప్రారంభమైంది.


పశ్చిమ దేశాల అభివృద్ధి ప్రమాణాల ఆధారంగా కొనసాగుతున్న అభివృద్ధి కేవలం 500ఏళ్లలోనే ప్రకృతి సమతౌల్యాన్ని దెబ్బతీసింది. ప్రజల భాగస్వామ్యాన్ని వృద్ధి చేయడం ద్వారా దెబ్బతిన్న సమతౌల్యాన్ని పునరుద్ధరించడానికి, పర్యావరణం పట్ల ప్రజల్లో అవగాహన, క్రియాశీలతను తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ‘పర్యావరణ్ సంరక్షణ్’ కార్యక్రమం ప్రారంభమైనది. స్వయంసేవకులు ఈ పనులన్నింటినీ ‘గతివిధి’ పేరుతో సమాజం ముందుంచి ఆరంభించారు. సంఘ్ కార్యకలాపాల అభివృద్ధి యాత్ర మూడవ దశలో ఇది ఒక భాగం.


ప్రస్తుతం సంఘ్ కార్యకలాపాల అభివృద్ధి యాత్ర నాల్గవ దశ సాగుతున్నది. దేశం సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రతి స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తగా పనిచేస్తాడు. అందువల్ల ప్రతి ఉద్యోగి స్వయంసేవకుడు సామాజిక మార్పు కోసం తన ఆసక్తి, సామర్థ్యానికి అనుగుణంగా ఏదైనా రంగంలో సామాజిక మార్పు కోసం చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నాం. సంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ హెడ్గేవర్ జీ 1940లో జరిగిన శిక్షా వర్గ్‌లో ప్రసంగిస్తూ సంఘ్ కార్యకలాపాలను శాఖకు మాత్రమే పరిమితం చేయకుండా ఆ కార్యకలాపాలను సమాజంలోనికీ విస్తరింపచేయాలని అన్నారు. మీ కుటుంబానికి అవసరమైన ధనార్జన చేసుకుంటూ, కుటుంబం పట్ల శ్రద్ధ వహిస్తూ, క్రమం తప్పకుండా శాఖకు వెళ్ళినంత మాత్రాన సరిపోదు. సమాజ పరివర్తన, జాగృతికి ఉపకరించే ఏ పనిలోనైనా మీ సమయాన్ని వెచ్చించి చురుకుగా పాల్గొనడమే సంఘ్ కార్యం అవుతుంది. అఖిల భారతీయ దృక్పథాన్ని సాధించి ఆసేతు హిమాచలపర్యంతం సమాజం అంతా ఒక్కటే అనే భావనను అనుభవంలోకి తెచ్చుకోవాలి. సమాజాన్ని వెంట తీసుకువెళుతూ స్వార్థాన్ని వదిలివేస్తూ సమాజానికి నేతృత్వం వహించే అంశాలను నేర్చుకుంటూ, వాటిని క్రమం తప్పకుండా సాధన చేస్తూ, శాఖకు సక్రమంగా వెళుతూ, శాఖ నుంచి నేర్చుకున్న ఈ అన్ని గుణాలను ప్రయోగిస్తూ, సమాజంలో పరివర్తన తీసుకురావడానికి ఏదో ఒక రంగంలో చురుకుగా పాల్గొనడం అత్యంత అవసరం. ప్రస్తుతం ప్రతి స్వయంసేవకుడు సమాజ పరివర్తనలో పాల్గొనేందుకు సంసిద్ధంగా ఉండాలి. సంఘ్ కార్యాన్ని సంపూర్ణత్వం వైపుకు తీసుకువెళ్ళడమే శతాబ్ది ఉత్సవాలను జరుపుకోవడానికి ఉపకరించే ఉత్తమ మార్గం అవుతుంది.


డా. మన్మోహన్ వైద్య

సహ–సర్‍కార్యవాహ, ఆరెస్సెస్

Updated Date - 2022-05-19T05:40:37+05:30 IST