Vijayadashami celebrations : సమాజ అభివృద్ధికి మహిళలు ముఖ్యం : ఆరెస్సెస్ చీఫ్

ABN , First Publish Date - 2022-10-05T17:41:13+05:30 IST

మహిళల భాగస్వామ్యం లేకపోతే సమాజం అభివృద్ధి చెందదని

Vijayadashami celebrations : సమాజ అభివృద్ధికి మహిళలు ముఖ్యం : ఆరెస్సెస్ చీఫ్

నాగ్‌పూర్ : మహిళల భాగస్వామ్యం లేకపోతే సమాజం అభివృద్ధి చెందదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ చెప్పారు. మనకు జనాభా విధానం ఉండాలని తెలిపారు. హిందూ అనే పదాన్ని ఉపయోగించడాన్ని కొనసాగిస్తామని చెప్పారు. భారత దేశ ఐకమత్యాన్ని వ్యతిరేకించే శక్తులు సనాతన ధర్మానికి అడ్డంకులు సృష్టిస్తున్నాయని చెప్పారు. ఇదిలావుండగా, దాదాపు వందేళ్ళ ఆరెస్సెస్ చరిత్రలో తొలిసారి ఓ మహిళను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. 


విజయ దశమి ఉత్సవాల సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పర్వతారోహకురాలు సంతోష్ యాదవ్‌ హాజరయ్యారు. ఆమె 1992 మే నెలలోనూ, 1993 మే నెలలోనూ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. 


మోహన్ భాగవత్ మాట్లాడుతూ, మహిళల భాగస్వామ్యం లేనిదే సమాజం అభివృద్ధి చెందదని చెప్పారు. మహిళలను సాధికారులను చేయాలన్నారు. పెరుగుతున్న జనాభా గురించి ప్రస్తావిస్తూ, జనాభాకు వనరులు ఉండాలన్నారు. వనరుల నిర్మాణం జరగకుండా జనాభా పెరిగితే, అది భారంగా మారుతుందని చెప్పారు. అయితే జనాభాను సంపదగా చూసే వైఖరి కూడా ఉందని చెప్పారు. ఇటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని జనాభా విధానాన్ని రూపొందించవలసిన అవసరం ఉందని తెలిపారు. 


హిందూ రాష్ట్రం గురించి మాట్లాడుతూ, ఇటీవలి కాలంలో దీని గురించి చర్చ జరుగుతోందన్నారు. ఈ భావనను చాలా మంది అంగీకరిస్తున్నారని తెలిపారు. అయితే హిందూ అనే పదం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఇతర పదాలను వాడటానికి ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. దీనిపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, తాము హిందూ అనే పదాన్ని వాడటం కొనసాగిస్తామని చెప్పారు. 


భారత దేశ ఐకమత్యానికి, ప్రగతికి హాని కలిగించే శక్తులు సనాతన ధర్మానికి ఆటంకాలు సృష్టిస్తున్నాయని చెప్పారు. వారు తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారని, అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నారని, నేరపూరిత చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, సమాజంలో అశాంతిని ప్రేరేపిస్తున్నారన్నారు. 





ప్రపంచంలో భారత దేశ విశ్వసనీయత, ఘనత పెరిగాయన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత దేశ వైఖరి, శ్రీలంకకు భారత్ అందించిన సహాయం చేసిన విధానాలను పరిశీలించినపుడు మన మాటను ఇతరులు వింటున్నారని అర్థమవుతోందని చెప్పారు. ఇటీవల పలు పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులను అభినందించారు. 


కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

Updated Date - 2022-10-05T17:41:13+05:30 IST