ఏసీ డల్‌.. నాన్‌ ఏసీ ఫుల్‌!

ABN , First Publish Date - 2020-11-23T06:24:49+05:30 IST

ప్రయాణికుల మైండ్‌సెట్‌ను కరోనా మార్చేసింది.

ఏసీ డల్‌.. నాన్‌ ఏసీ ఫుల్‌!

కొవిడ్‌తో ప్రయాణికుల ఆలోచనలో మార్పు

ఏసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ 50 శాతంలోపే

నాన్‌ ఏసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ 90 శాతానికిపైనే 

హైదరాబాద్‌కు ఏసీ బస్సులు తగ్గింపు 


ప్రయాణికుల మైండ్‌సెట్‌ను కరోనా మార్చేసింది. దూర ప్రయాణాలకు ఏసీ బస్సులను ఎంచుకునే ప్రయాణికులు ఇప్పుడు నాన్‌ ఏసీ బస్సులవైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఏసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ 50 శాతం కంటే తక్కువకు పడిపోగా నాన్‌ ఏసీ బస్సుల్లో మాత్రం 90 శాతానికి పైగా నమోదవుతుంది. దీంతో ఆర్టీసీ అధికారులు ఏసీ బస్సులను తగ్గించి, నాన్‌ ఏసీ బస్సులను పెంచుతున్నారు. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

కరోనా భయంతో ప్రయాణికులు ఏసీ బస్సులకు దూరంగా ఉంటున్నారు. విజయవాడ నుంచి దూరప్రాంతాలకు ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారి శాతం కరోనా తరువాత గణనీయంగా తగ్గిపోయింది. కొవిడ్‌కు ముందు ఏసీ బస్సులంటే క్రేజ్‌ ఉండేది. ఆ క్రేజే ఆర్టీసీకి భారీ మార్జిన్‌ మిగిల్చి పెట్టేది. అప్పట్లో ఏసీ బస్సులకు  అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ అసాధారణంగా ఉండేది. వారాంతాలు, పండుగల సమయంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉండేది. కొవిడ్‌ తర్వాత ప్రయాణికుల ఆలోచనలో వచ్చిన మార్పు కారణంగా బెజవాడ నుంచి దూర ప్రాంతాలకు నడిచే ఏసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ సగానికి సగం పడిపోయింది. దీంతో రోడ్డు రవాణా సంస్థ ఏసీ బస్సులను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కొవిడ్‌కు ముందు విజయవాడ నుంచి 40 ఏసీ బస్సులు వివిధ దూర ప్రాంతాలకు నడిచేవి. వీటిలో తొంబై శాతం హైదరాబాద్‌ రూట్‌లోనే నడిచేవి. ప్రస్తుతం హైదరాబాద్‌కు కొవిడ్‌ నేపథ్యంలో ఐదు ఏసీ బస్సులను ఆర్టీసీ అధికారులు ప్రవేశపెట్టారు. ప్రస్తుతం వీటి సంఖ్య మూడుకు పడిపోయింది. ఏసీ బస్సులు నిండకపోవటమే ఇందుకు కారణం.. ఒక్క హైదరాబాద్‌ మాత్రమే కాదు, బెంగళూరు రూట్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 


విముఖత ఎందుకు? 

 ఏసీ బస్సుల్లో కరోనా వైరస్‌ జీవించి ఉండే అవకాశం ఉండడమే ఇందుకు కారణం. దీనికి తోడు వెంటిలేషన్‌ ఉండదు. వైరస్‌ దరి చేరకుండా ఉండాలంటే ఎక్కువ వెంటిలేషన్‌ ఉండాలన్నది వైద్యులు, నిపుణులు చెప్పేమాట. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు నాన్‌ ఏసీ బస్సులకు ప్రాధాన్యత ఇస్తున్నారు.


నాన్‌ ఏసీ బస్సులు ఫుల్‌..  

ప్రస్తుతం హై ఎండ్‌ శ్రేణిలోని నాన్‌ ఏసీ బస్సులు మాత్రమే ఫుల్‌ అవుతున్నాయి. ఏసీ బస్సులను ఆశ్రయించే ప్రయాణిలు కూడా నాన్‌ ఏసీ బస్సుల పట్ల మొగ్గు చూపిస్తుండటంతో.. సగటు ఆక్యుపెన్సీ గణనీయంగా పెరిగింది. సూపర్‌ లగ్జరీ, ఆల్ర్టా డీలక్స్‌ బస్సుల్లో ఆక్యుపెన్సీ 90 శాతానికి పైగానే ఉంటోంది. ప్రస్తుతం హైదరాబాద్‌ రూట్‌లో 60 బస్సులు ఫుల్‌గా నడుస్తున్నాయి. 

-----------------------------------------------


ప్రయాణికుల అభిప్రాయాలను కాదనలేం.. 

కొవిడ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు నాన్‌ ఏసీ బస్సులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. నాన్‌ ఏసీ హైఎండ్‌ బస్సుల్లో 90 శాతం కంటే ఎక్కువగానే ఓఆర్‌ నమోదవుతోంది. ఏసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ అంతగా ఉండటం లేదు. కొవిడ్‌ భయమే కారణం. కానీ ఏసీ బస్సులు కూడా సురక్షితంగానే ఉంటాయి. ఈ బస్సుల్లో కొవిడ్‌ నివారణా చర్యలు అన్నింటినీ చేపడుతున్నాం. ఎప్పటికప్పుడు క్యూమిగేషన్‌ చేపడుతున్నాం. రోగ లక్షణాలున్న వారిని అనుమతించటం లేదు. శానిటేషన్‌ నిరంతరం కొనసాగుతోంది. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం.     - మూర్తి, డీసీటీఎం, పీఎన్‌బీఎస్‌ 

Updated Date - 2020-11-23T06:24:49+05:30 IST