ఆర్టీసీ బాదుడు!

ABN , First Publish Date - 2022-07-01T07:43:46+05:30 IST

ఆర్టీసీ బాదుడు!

ఆర్టీసీ బాదుడు!

డీజిల్‌ సెస్‌ భారీగా పెంపు

రెండున్నర నెలల్లోనే రెండోసారి

ఈసారి ప్రతి స్టేజీకి పెరిగే బాదుడు

రూ.5 నుంచి రూ.140 వరకు భారం

పెంపుపై దాగుడు మూతలు

పాత కథే మళ్లీ చెప్పిన పెద్దలు

రిటైల్‌లో కొంటూ బల్క్‌ ధర లెక్క

సెస్‌ వేస్తూనే భారం పెంచలేదని వాదన

నేటి నుంచే కొత్త చార్జీలు 



భారం ఇలా... 

ప్రయాణికులపై పడే అదనపు భారం


విజయవాడ నుంచి హైదరాబాద్‌కు 

సూపర్‌ లగ్జరీ - రూ.60

ఏసీ సర్వీసులు - రూ.70


విజయవాడ నుంచి విశాఖపట్నం...

సూపర్‌ లగ్జరీ - రూ.80

ఏసీ సర్వీసు - రూ.90


విజయవాడ నుంచి చెన్నై లేదా బెంగళూరుకు..

సూపర్‌ లగ్జరీ - రూ.140

ఏసీ సర్వీసు - రూ.140


అమరావతి, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): ‘జగనన్న బాదుడే బాదుడు’ కొనసాగుతోంది. డీజిల్‌ సెస్‌ పేరుతో ఆర్టీసీ చార్జీలను భారీగా పెంచేశారు. రెండున్నర నెలలు తిరక్కుండానే రెండోసారి చార్జీల షాక్‌ ఇచ్చారు. గ్రామీణ ప్రజలు ప్రయాణించే ‘పల్లె వెలుగు’ బస్సులు మొదలుకొని ఏసీ సర్వీసుల వరకు... అన్నింటిపైనా అదనంగా వడ్డించారు. పల్లె వెలుగుపై ప్రతి కిలోమీటరుకు 21 పైసలు, అలా్ట్ర డీలక్స్‌పై 25 పైసలు, సూపర్‌ లగ్జరీ బస్సుల్లో 26 పైసలు, ఏసీ బస్సులకు 30 పైసల చొప్పున పెంచారు. పెంచిన చార్జీలు శుక్రవారం డిపో నుంచి బయలుదేరే తొలి సర్వీసు నుంచే అమలవుతాయి. డీజిల్‌ సెస్‌ బాదుతూనే... ప్రయాణికులపై భారం వేయడంలేదని ప్రభుత్వం వింత ప్రకటన చేయడం గమనార్హం. ‘‘డీజిల్‌పై సెస్‌ మాత్రమే పెంచుతున్నాం. ప్రయాణికులపై ఎలాంటి భారం వేయలేదు’’ అని ఆర్టీసీ చైర్మన్‌ మల్లికార్జున రెడ్డి, ఎండీ ద్వారకా తిరుమలరావు గురువారం విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ‘‘ఆర్టీసీకి రెండేళ్లుగా ఆర్థిక కష్టాలు పెరిగాయి. డీజిల్‌ భారం భరించే స్థితిలో సంస్థ లేదు. తప్పనిసరి పరిస్థితుల్లోనే డీజిల్‌పై సెస్‌ వేయాల్సి వస్తోంది’’ అని రెండున్నర నెలల కిందట చెప్పిన కథనే మళ్లీ చెప్పారు.  జూన్‌ 29నాటికి బల్క్‌లో డీజిల్‌ ధర లీటరు రూ.131కి చేరిందని... ప్రతి రోజూ రెండున్నర కోట్లు అదనపు భారం పడుతోందని తెలిపారు. అందుకే మరోసారి డీజిల్‌పై కొంత  సెస్‌ విధిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ భారం ప్రయాణికులపై వేసేది కాదని వింత భాష్యం చెప్పారు. జూలై 1 నుంచి ప్రయాణ చార్జీలతోపాటు విద్యార్థుల బస్‌ పాస్‌ల ధరలు కూడా పెరుగుతాయని ఛైర్మన్‌, ఎండీ వివరించారు. 


రిటైల్‌లో కొంటున్నామంటూనే...

బల్క్‌లో రిటైల్‌లోనే డీజిల్‌ ధర తక్కువగా ఉందని... అందువల్ల రిటైల్‌లోనే కొనుగోలు చేస్తున్నామని ఏప్రిల్‌ 13న ఆర్టీసీ చైర్మన్‌, ఎండీ ఇద్దరూ వెల్లడించారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో మాత్రం... బల్క్‌లో డీజిల్‌ ధర రూ.131 ఉందంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. బయటి బంకుల్లో డీజిల్‌ ధర రూ.99.45 మాత్రమే. ఈ విషయం ప్రస్తావించకుండా ‘బల్క్‌’ లెక్కలే చెప్పడం గమనార్హం. ఆర్టీసీ ప్రతి రోజూ 8లక్షల లీటర్ల డీజిల్‌ వినియోగిస్తోందని... అదనంగా రూ.3.20 కోట్ల భారం పడుతోందని ఏప్రిల్‌ 13న చెప్పారు. అప్పుడు సెస్‌ విధింపుతో రోజుకు రెండు కోట్ల రూపాయల వరకూ ఆదాయం వస్తుందన్నారు. తాజా పెంపుతో ఏడాదికి రూ.400కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నప్పటికీ... ప్రయాణికులపై రూ.500కోట్లకు పైగానే భారం మోపినట్లు నిపుణులు చెబుతున్నారు.


ఏ బస్సులో చార్జీలు ఎలా..?

పల్లె వెలుగు బస్సుల్లో ప్రస్తుత కనీస చార్జీ పది రూపాయలు. తొలి 30 కిలోమీటర్లకు ఎలాంటి పెంపు ఉండదు. ఆ తర్వాత ప్రయాణ దూరాన్ని బట్టి రూ.5 నుంచి గరిష్ఠంగా రూ.20వరకు పెంచారు. అలా్ట్ర పల్లె వెలుగు బస్సుల్లో చార్జీ రూ.25వరకూ వడ్డించారు. ఎక్స్‌ప్రెస్‌ సర్సీసులకు మొదటి 35 కిలోమీటర్లకు చార్జీ పెంపు ఉండదు. ఆ తర్వాత... రూ.5 పెంపుతో బాదుడు మొదలవుతుంది. ప్రయాణ దూరాన్ని బట్టి రూ.5, 25, 35, 55, 75 చొప్పున పెంచుతూ పోయారు. గరిష్ఠంగా 500 కిలోమీటర్ల ప్రయాణంపై రూ.90 అదనపు బాదుడు పడుతుంది. అలా్ట్ర డీలక్స్‌ బస్సుల్లో తొలి 21 కిలోమీటర్లకు ఎలాంటి పెంపు ఉండదు. ఆ తర్వాత... రూ.5తో బాదుడు మొదలై గరిష్ఠంగా రూ.120 వరకు ఉంటుంది.  సూపర్‌ లగ్జరీ బస్సుల్లో ప్రస్తుతం టికెట్‌పై రూ.10 అదనంగా డీజిల్‌ సెస్‌ వసూలు చేస్తున్నారు. అయితే 55 కిలోమీటర్ల తర్వాత ప్రతి స్టేజీకి పది రూపాయల చొప్పున భారం మోపుతూ 500 కిలోమీటర్లకు రూ.120 బాదేశారు. ఏసీ సర్వీసు ‘ఇంద్ర’ బస్సుల్లో 36 కిలోమీటర్ల తర్వాత రూ.10తో బాదుడు మొదలవుతుంది. 210కిలో మీటర్ల ప్రయాణానికి రూ.50, 356 కిలోమీటర్లకు రూ.100, 500 కిలోమీటర్లకు రూ.140 అదనపు భారం మోపారు. గరుడ, అమరావతి, నైట్‌ రైడర్‌, వెన్నెల బస్సులకూ ఇదే పెంపు వర్తిస్తుంది. 


ప్రతి స్టేజీకి పెరిగే బాదుడు...

విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు గతంలో డీజిల్‌ సెస్‌ రూ.20 మాత్రమే ఉండేది. ఇప్పుడు అలా కాదు! ఒక్కో ఊరు (స్టేజీ) దాటేకొద్దీ బాదుడు పెరుగుతుంది. ఏలూరు వరకు రూ.10, రాజమహేంద్రవరం నుంచి మరో పది ఇలా... మధ్యలో వచ్చే అన్నవరం, తుని, అనకాపల్లి, గాజువాక, విశాఖపట్నం వరకు మొత్తం రూ.70 అదనపు భారం పడుతుంది. అదే.. ఏసీ బస్సు అయితే రూ.80 పెరుగుతుంది. హైదరాబాద్‌, తిరుపతి, చెన్నై, బెంగళూరు ఇలా ఏ ప్రాంతానికైనా స్టేజీల ఆధారంగా బాదుడే బాదుడు!


భారం ఇలా... 

బస్సు సర్వీసు రూపాయల్లో

పల్లెవెలుగు/అల్ట్రా      10

ఎక్స్‌ప్రెస్‌              20

డీలక్స్‌/అలా్ట్ర       25

సూపర్‌ లగ్జరీ          40

అన్ని ఏసీ సర్వీసులు 50


Updated Date - 2022-07-01T07:43:46+05:30 IST