బస్సు చార్జీలు పెంచబోం

ABN , First Publish Date - 2022-05-17T13:30:18+05:30 IST

తాము బస్సు ఛార్జీలు పెంచుతున్నట్లు సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని, ప్రజలు వాటిని నమ్మరాదని రవాణా శాఖ మంత్రి శివశంకర్‌ విజ్ఞప్తి చేశారు.

బస్సు చార్జీలు పెంచబోం

                                - రవాణా మంత్రి శివశంకర్‌


పెరంబూర్‌(చెన్నై): తాము బస్సు ఛార్జీలు పెంచుతున్నట్లు సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని, ప్రజలు వాటిని నమ్మరాదని రవాణా శాఖ మంత్రి శివశంకర్‌ విజ్ఞప్తి చేశారు. పెరంబలూరు జిల్లా తూంగాపురం, వయల్పాడి, వెప్పూర్‌ తదితర గ్రామాల విద్యార్థులు, ప్రజల సౌకర్యార్ధం అదనపు బస్సు సర్వీసులను సోమవారం ప్రారంభించిన మంత్రి.. బస్సులో కొద్దిదూరం ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రాలో బస్సుచార్జీలు పెంచారని, ఆ రాష్ట్రాలకు వెళ్లే బస్సుల్లో చార్జీ మాత్రం పెంచేందుకు నిర్ణయించామన్నారు. ఆయా రాష్ట్రాల్లో పెరిగిన రవాణా చార్జీలకు అనుగుణంగా పట్టిక సిద్ధం చేశామని మంత్రి తెలిపారు. అలాగే, కేంద్రప్రభుత్వం ప్రతిరోజు డీజిల్‌ రేట్లు పెంచుతోందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర రవాణా సంస్థ రూ.48,500 కోట్ల నష్టాల్లో ఉందని తెలిపారు. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయంలో రవాణా శాఖను అస్తవ్యస్తం చేశారని, దానిపై శాఖాపరమైన విచారణ చేపట్టామన్నారు. బస్సుల్లో మహిళలు, చిన్నారుల భద్రత కోసం పలు చర్యలు చేపట్టామని అన్నారు. రవాణా శాఖకు కొత్తగా 2 వేల బస్సులు, 500 ఎలక్ట్రిక్‌ బస్సులను జర్మనీ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. అయితే కొద్దిసేపటి తరువాత పొరుగు రాష్ట్రాలకు వెళ్లే చార్జీలను కూడా పెంచడం లేదని మంత్రి వివరించారు. 

Updated Date - 2022-05-17T13:30:18+05:30 IST