ముసిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు

ABN , First Publish Date - 2022-10-08T03:43:14+05:30 IST

మండలంలోని అనకర్లపూడి-మద్దులూరు గ్రామాల మధ్య ముసి వాగు చప్టాపై ఒంగోలు నుంచి కొండపికి వస్తున్న ఆర్టీసీ బస్సు అర్ధంతరంగా ఆగిపోయింది.

ముసిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
ముసిలో బస్సు ఆగిపోవడంతో దిగి ఒడ్డుకు వస్తున్న ప్రయాణికులు

ఉధృతి తక్కువగా ఉండటంతో తప్పిన పెనుప్రమాదం

50 మంది ప్రయాణికులు క్షేమం 

కొండపి, అక్టోబరు 7 : మండలంలోని అనకర్లపూడి-మద్దులూరు గ్రామాల మధ్య ముసి వాగు చప్టాపై ఒంగోలు నుంచి కొండపికి వస్తున్న ఆర్టీసీ బస్సు అర్ధంతరంగా ఆగిపోయింది. వాగు ఉధృతి తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాల కారణంగా ముసిలో నీరు చప్టాపై నుంచి ప్రవహిస్తోంది. చప్టా దెబ్బతిన్న భాగంలో బస్సు టైరు దిగి ఇరుక్కుపోయింది. అందులో దాదాపు 50 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. అయితే ముసి ఇక్కడ వెడల్పుగా ఉండటం, చప్టాపై రెండు అడుగుల మేర మాత్రమే నీరు ప్రవహిస్తుండటంతో ప్రయాణికులు బస్సు దిగి నడుచుకుంటూ అనకర్లపూడి గ్రామం వైపు ఒడ్డుకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న అనకర్లపూడి గ్రామస్థులు బస్సును నెడుతూ ఒడ్డుకు చేర్చారు. అనంతరం డ్రైవర్‌ బస్సును స్టార్ట్‌ చేసుకుని కొండపికి ప్రయాణికులతో సహా తీసుకువచ్చారు. ముసిలో నీటి ప్రవాహం కారణంగా సాయంత్రం వరకూ వాహన రాకపోకలు నిలిచిపోయాయి. 


ముసిలో యువకుడు గల్లంతు 

 మండలంలోని అనకర్లపూడి- మద్దులూరు గ్రామాల మధ్యన ముసిలో శుక్రవారం సాయంత్రం ఓ యువకుడు గల్లంతయ్యాడు. అతను మద్దులూరు గ్రామానికి చెందిన వ్యక్తి అని అనుమానిస్తున్నారు. ముసి ఉధృతంగా చప్టాపై నుంచి ప్రవహిస్తుండగా ఆ యువకుడు మోటార్‌ సైకిల్‌పై కొండపి వైపు వచ్చేందుకు ప్రయత్నించాడు. నీటి ఉధృతికి మోటార్‌ సైకిల్‌తో సహా కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న కొండపి సీఐ ఎం.శ్రీనివాసరావు, కొండపి ఫైర్‌ స్టేషన్‌ సిబ్బంది, 108 వాహన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. చీకటిపడటంతో వారు ఎలాంటి గాలింపు చర్యలు చేపట్టలేకపోయారు. ముసిలో గల్లంతయిన వ్యక్తి కొంతసేపు చిల్లచెట్టు పట్టుకుని అరిచినట్లు ఆ సమయంలో అక్కడ ఉన్న వారు చెప్తున్నారు.  

Updated Date - 2022-10-08T03:43:14+05:30 IST