ఆర్టీసీ బస్సులు పునరుద్ధరించక అవస్థలు

ABN , First Publish Date - 2021-11-26T05:09:27+05:30 IST

మండల కేంద్రం ముండ్లమూరులోని ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఆర్టీసీ బస్సుల కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది.

ఆర్టీసీ బస్సులు పునరుద్ధరించక అవస్థలు
బస్సుల కోసం ఎదురు చూస్తున్న ఆదర్శ పాఠశాల విద్యార్థులు

ముండ్లమూరు, నవంబరు 25 : మండల కేంద్రం ముండ్లమూరులోని ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఆర్టీసీ బస్సుల కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రతి రోజు పాఠశాల విడిచి పెట్టిన తరువాత సాయంత్రం పూట రెండు గంటల వరకు ఆర్టీసీ బస్సుల కోసం పాఠశాల ఎదురుగా ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్లపై పడిగాపులు కాయాల్సి వస్తోంది. అద్దంకి, పొదిలి డిపోల నుంచి ప్రతి రోజు బస్సులు నడుస్తుంటాయి. సాయంత్రం 4 గంటల తరువాత ఆర్టీసీ బస్సులు సక్రమంగా తిరగక పోవడంతో విద్యార్థుల కష్టాలు చెప్పలేనివి. ఆదర్శ పాఠశాలలో 450 మందికి పైగానే విద్యార్థులు ప్రతి రోజు విద్యనభ్యసిస్తున్నారు. వీరంతా పులిపాడు, ఉల్లగల్లు, కెల్లంపల్లి, పసుపుగల్లు, పోలవరం, శంకరాపురం, నూజెండ్లపల్లి, మారెళ్ల, జమ్మలమడక, మక్కెనవారిపాలెం, ఈదర, వేముల, వేములబండ తదితర గ్రామాల నుంచి పాఠశాలకు ప్రతి రోజు విద్యార్థులు వస్తుంటారు. ప్రధానంగా అద్దంకి, పొదిలి డిపోలకు చెందిన బస్సులు పాఠశాలలు విడిచిపెట్టే సమయంలో బస్సులు రావడం లేదు. విద్యార్థులు బస్సుల కోసం సాయంత్రం 7 గంటల వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు కంగారు పడి ద్విచక్ర వాహనాలతో పాఠశాల దగ్గరకు వచ్చి తమ బిడ్డలను ఇంటికి తీసుకు వెళుతున్నారు. మరి కొంత మంది ఆటోలు మాట్లాడుకొని ప్రతి రోజు ఆటోల్లో ఇంటికి వస్తున్నారు. మారెళ్ల, జమ్మలమడక, ఈదర, వేముల ప్రాంతాలకు చెందిన ఎక్కువ మంది విద్యార్థులు ఉదయం సాయంత్రం ఆట్లో వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు. కరోనా మొదటి విడత సమయంలో కొన్ని రూట్లకు బస్సులు తాత్కాలికంగా నిలిపి వేశారు. అప్పటి నుంచి నేటి వరకు బస్సులు పునురిద్ధరించలేదు.. దీంతో కొన్ని గ్రామాలకు చెందిన విద్యార్థుల సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని అద్దంకి - పొదిలి డిపోల బస్సులు సకాలంలో తిప్పాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.

Updated Date - 2021-11-26T05:09:27+05:30 IST