రోడ్డెక్కిన మరో 150 బస్సులు

ABN , First Publish Date - 2021-06-12T05:36:32+05:30 IST

రోడ్డెక్కిన మరో 150 బస్సులు

రోడ్డెక్కిన   మరో 150 బస్సులు

జిల్లాకు 75, దూరప్రాంతాలకు 75

విశాఖపట్నానికి 10 ఆర్టీసీ బస్సులు ప్రారంభం 

తిరుపతి, ఒంగోలు, కాకినాడ, రాజమండ్రికీ పునరుద్ధరణ 

కర్ఫ్యూ సమయాన్ని మార్చడం కారణంగానే..

పీఎన్‌బీఎస్‌కు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ

విజయవాడ, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి) : కర్ఫ్యూ సమయాన్ని సడలించటంతో ఆర్టీసీ కృష్ణా రీజియన్‌ దూరప్రాంతాలకు 150 బస్సులను అదనంగా ప్రారంభించింది. దీంతో ఆర్టీసీ నడుపుతున్న బస్సుల సంఖ్య 400కు చేరింది. కర్ఫ్యూ సమయం మధ్యాహ్నం 12 గంటల వరకు అమల్లో ఉన్నప్పుడు జిల్లావ్యాప్తంగా 250 బస్సులనే ఆర్టీసీ నడిపింది. అయితే, ప్రస్తుతం కొవిడ్‌ కే సులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో ప్రయాణాలు పెరిగాయి. వారం రోజులుగా పీఎన్‌బీఎస్‌కు ప్రయాణికుల సంఖ్య పెరిగింది. దీంతో 50శాతం సీటింగ్‌ అమలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. కర్ఫ్యూ సమయాన్ని మధ్యాహ్నం 2 గంటల వరకు పెంచడంతో తొలిరోజైన శుక్రవారం 150 బస్సులను అదనంగా బయటకు తీశారు. వీటిలో 75 బస్సులను జిల్లాకు కేటాయించారు. మిగిలిన 75 బస్సులను దూరప్రాంతాలకు నడిపారు. విశాఖపట్నం, తిరుపతి, ఒంగోలు, రాజమండ్రి, కాకినాడకు ఇవి నడిచాయి. తొలిరోజే డిమాండ్‌ బాగుంది. ఇక విశాఖపట్నం రూట్‌లో శుక్రవారం 10 బస్సులు అదనంగా నడిపారు.  

ఇంటర్‌ స్టేట్‌ బస్సులకు లభించని అనుమతి 

పొరుగు రాష్ర్టాలకు జిల్లా నుంచి వెళ్లే ఇంటర్‌ స్టేట్‌ బస్సుల విషయంలో ఎలాంటి పురోగతి లేదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా అనుమతులు ఇవ్వకపోవటంతో ఇంటర్‌ స్టేట్‌ బస్సులు ప్రారంభించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా విజయవాడ నుంచి హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, చత్తీస్‌గడ్‌కు బస్సులను నడపలేని పరిస్థితి ఏర్పడింది. ఇంటర్‌స్టేట్‌ బస్సులు నడవాలంటే ఈ నెలాఖరు వరకు వేచిచూడాల్సిందే. 

Updated Date - 2021-06-12T05:36:32+05:30 IST