ఆర్టీసీ ప్రయాణికులపై బాదుడు

ABN , First Publish Date - 2022-07-01T06:48:01+05:30 IST

ఆర్టీసీ/పీటీడీ ప్రయాణికులపై ఫ్యూయల్‌ సెస్సు పేరిట మరోసారి భారం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.

ఆర్టీసీ ప్రయాణికులపై బాదుడు

ఈసారి ఫ్యూయల్‌ సెస్సు రూపేణా భారం

కనిష్ఠంగా ఐదు నుంచి సర్వీస్‌, దూరాన్ని బట్టి రూ.140 వరకూ విధింపు 

విశాఖ రీజియన్‌లో ప్రయాణికులపై రోజుకు రూ.2.5 లక్షలు అదనపు భారం

జనం గగ్గోలు


ద్వారకా బస్‌స్టేషన్‌, జూన్‌ 30:

ఆర్టీసీ/పీటీడీ ప్రయాణికులపై ఫ్యూయల్‌ సెస్సు పేరిట మరోసారి భారం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.    పాలకులు తీసుకున్న తాజా నిర్ణయంతో విశాఖ రీజియన్‌ పరిధిలోని ప్రయాణికులపై రోజుకు రూ.2.5 లక్షల మేర అదనపు భారం పడనున్నది.  

విశాఖ రీజియన్‌ పరిధిలో ఏడు డిపోలకు చెందిన 750 బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. ఇందులో 600 బస్సులు నగర పరిధిలోనే తిరుగుతున్నాయి. మరో 25 బడి బస్సులు. మిగిలిన 125 బస్సులు విజయవాడ, తిరుపతి, హైదరాబాద్‌, భీమవరం, రాజోలు, భద్రాచలం, ఖమ్మం, రాజమండ్రి, కాకినాడ, విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, శ్రీకాకుళం, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం, బరంపురం, గుణుపూర్‌ వంటి ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణించే వారిపై ఫ్యూయల్‌ సెస్సు పేరిట అదనపు భారం పడనున్నది. ఇప్పటివరకు విశాఖపట్నం నుంచి ఏ ప్రాంతానికి వెళ్లినా ఫ్యూయల్‌ సెస్సు ఐదు నుంచి 15 రూపాయల వరకూ ఉండేది. ఇప్పుడు దాన్ని దూరాన్ని బట్టి పెంచాలని నిర్ణయించడంతో టిక్కెట్‌ చార్జీ కనిష్ఠంగా 20 రూపాయల నుంచి 140 రూపాయల వరకూ పెరగనున్నది. విశాఖ-రాజమండ్రి ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుకు ఫ్యూయల్‌ సెస్సును రూ.10 నుంచి రూ.35కు, ఆలా్ట్ర డీలక్స్‌కు రూ.10 నుంచి రూ.45కు పెరగనున్నట్టు అధికారులు చెబుతున్నారు. అలాగే విశాఖ-విజయనగరం ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌కు రూ.10 నుంచి రూ.25కు, ఆలా్ట్ర డీలక్స్‌కు రూ.10 నుంచి రూ.30కు పెరుగుతుందని లెక్కలు కట్టారు. శ్రీకాకుళం ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌కు రూ.10 నుంచి రూ.25కు, ఆలా్ట్ర డీలక్స్‌కు 10 నుంచి 35 రూపాయలకు పెరిగే అవకాశం ఉందన్నారు. ఇదే ప్రకారంగా విజయవాడ, హైదరాబాద్‌ ప్రాంతాల బస్సులకు దూరాన్ని బట్టి 10 రూపాయల నుంచి 140 వరకు పెరిగే అవకాశం వుందని అధికారులు చెబున్నారు. 

ఇక పల్లెవెలుగు సర్వీసులకు ఐదు కిలోమీటర్ల వరకు ప్యూయల్‌ సెస్సు పెంచకపోవడంతో టిక్కెట్‌ ఽధరలో ఎటువంటి మార్పు ఉండబోదు. ఆ తరువాత కిలోమీటర్లను బట్టి చార్జీ కనిష్ఠంగా ఐదు రూపాయల నుంచి గరిష్ఠంగా ఇరవై రూపాయల వరకూ పెరగనున్నది. ఆలా్ట్ర డీలక్స్‌కు 20 కిలోమీటర్ల వరకూ ఎటువంటి పెంపు లేదు. ఆ తరువాత పది నుంచి గరిష్ఠంగా 120 రూపాయల వరకూ పెంచారు. అలాగే సూపర్‌లగ్జరీ, అమరావతి సర్వీస్‌లకు 55 కిలోమీటర్ల వరకు సెస్సు పెంచలేదు. ఆ తరువాత పది నుంచి 120 రూపాయల వరకూ సెస్సు విధించారు. ఇంద్ర, గరుడ సర్వీస్‌లకు 35 కిలోమీటర్ల వరకు, నైట్‌ రైడర్‌కు 45 కి.మీ వరకు, వెన్నెలకు 45 కిలోమీటర్ల వరకు గతంలో వున్న కనీస ప్యూయల్‌ సెస్సును మాత్రమే వసూలు చేస్తారు. అక్కడ నుంచి గరిష్ఠంగా రూ.140 వరకూ వసూలు చేయనున్నారు. ఈ లెక్కన విశాఖ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులపై రోజుకు సుమారుగా రూ.2.5 లక్షల భారం పడే అవకాశం ఉంది. 


ప్రయాణికులకు ఆర్థిక భారం: బి దుర్గారావు, హెచ్‌బీ కాలనీ

ఫ్యూయల్‌ సెస్సు పేరిట ప్రయాణికులపై మరింత భారం మోపడం అన్యాయం. ఇప్పటికే అన్నిరకాల వస్తుసేవల ధరలు పెరిగాయి. పేద, మధ్య తరగతి ప్రజలు అప్పుల్లో కూరుకుపోతున్నారు. పెంచిన ఫ్యూయల్‌ సెస్సును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి.


ప్రయాణికుల జేబులకు కత్తెర

డి.సురేష్‌, పెదగంట్యాడ 

బస్సు చార్జీ, ఫ్యూయల్‌ సెస్సు, టోల్‌ ట్యాక్స్‌...ఇలా బస్సులో ప్రయాణించే వారిపై ఇన్నిరకాల ట్యాక్సులు విధించడం దోపీడీయే అవుతుంది. డీజిల్‌ రేటు పెరిగిందని ఇప్పటికే ఒకసారి బస్సు చార్జీలు పెంచారు. ఇప్పుడు మళ్లీ ఫ్యూయల్‌ సెస్సు పెంపు పేరిట అదనపు భారం మోపడం తగదు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి.


Updated Date - 2022-07-01T06:48:01+05:30 IST