టిక్కెట్‌ అడిగిన కండక్టర్‌ను కొట్టిచంపిన తాగుబోతు

ABN , First Publish Date - 2022-05-15T14:12:20+05:30 IST

స్థానిక కోయంబేడు బస్టాండు నుంచి బయలుదేరిన బస్సులో పీకల వరకు మద్యం సేవించిన ఓ తాగుబోతు చేసిన దాడిలో బస్సు కండక్టర్‌ ప్రాణాలు కోల్పోయారు. టిక్కెట్‌

టిక్కెట్‌ అడిగిన కండక్టర్‌ను కొట్టిచంపిన తాగుబోతు

- సీఎం దిగ్ర్భాంతి 

- రూ.10 లక్షల ఆర్థిక సాయం 

- నిందితుడి అరెస్టు


అడయార్‌(చెన్నై): స్థానిక కోయంబేడు బస్టాండు నుంచి బయలుదేరిన బస్సులో పీకల వరకు మద్యం సేవించిన ఓ తాగుబోతు చేసిన దాడిలో బస్సు కండక్టర్‌ ప్రాణాలు కోల్పోయారు. టిక్కెట్‌ తీసుకోమని చెప్పిన కండక్టరుతో గొడవకు దిగి ఆ తాగుబోతు.. ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేస్తూ, కండక్టర్‌ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం  ప్రకటించారు. శనివారం జరిగిన ఈ దారుణ ఘటన వివరాలు.. కోయంబేడు బస్టాండ్‌ నుంచి విల్లుపురంకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు శనివారం వేకువజామున బయలుదేరింది. ఈ బస్సులో పెరుమాళ్‌ (55) అనే వ్యక్తి కండక్టరుగా ఉన్నారు. బస్సు వేకువజామున 4 గంటల సమయంలో మధురాంతకం బస్టాండులో కొందరు ప్రయాణికులను ఎక్కించుకుని బయలుదేరింది. వీరిలో పీకల వరకు మద్యం సేవించిన ఓ 40 ఏళ్ళ వ్యక్తి సీటులో కూర్చొనివుండగా, టిక్కెట్‌ తీసుకోవాలని కండక్టర్‌ కోరారు. దీంతో ఆగ్రహించిన తాగుబోతు కండక్టరుతో వాగ్వాదానికి దిగాడు. ఎంతకీ టిక్కెట్‌ తీసుకోక పోవడంతో బస్సును ఆపి ఆ ప్రయాణికుడిని కిందకు దించేందుకు కండక్టర్‌ ప్రయత్నించగా, తాగుబోతు, ఆగ్రహంతో కండక్టరుపై దాడి చేశాడు. దీంతో కండక్టర్‌ కిందపడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి.. ఆ వెంటనే తాగుబోతు బస్సు దిగి పారిపోయాడు. ఆ తర్వాత తీవ్రంగా గాయపడ్డ కండక్టరును చికిత్స నిమిత్తం మేల్‌మరువత్తూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స ఫలించక  ఆయన మృతి చెందారు. బస్సు డ్రైవర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి కండక్టర్‌పై దాడి జరిపిన మురుగన్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.


రూ.10 లక్షల ఆర్థిక సాయం 

ఈ సంఘటన గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేశారు. విధి నిర్వహణలో ఉన్న కండక్టర్‌ పెరుమాళ్‌ ప్రయాణికుడి దాడిలో గాయపడి మృతి చెందినట్లు తెలుసుకుని తాను తీవ్ర ఆవేదనకు గురయ్యానని పేర్కొన్నారు. కండక్టర్‌ మృతితో శోకతప్తులైన కుటుంబీకులకు తన ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నానని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు  రవాణా శాఖ మంత్రి ఎస్‌ఎస్‌ శివశంకర్‌ పెరుమాళ్‌ కుటుంబం నివసిస్తున్న కల్లకురిచ్చికి చేరుకుని ఆయన మృతదేహానికి నివాళి అర్పించారు. బాధిత కుటుంబీకులను ఓదార్చి ప్రభుత్వం తరపున రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.

Updated Date - 2022-05-15T14:12:20+05:30 IST