ఆర్టీసీ కండక్టర్‌ నిజాయితీ..

ABN , First Publish Date - 2020-12-02T04:53:11+05:30 IST

ఓ ప్రయాణికుడు బస్సులో మరిచిపోయిన బ్యాగును.. తిరిగి అతడికి అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు ఖమ్మంజిల్లా మధిర ఆర్టీసీ డిపోనకు చెందిన కండక్టర్‌ కె.వేణు.

ఆర్టీసీ కండక్టర్‌ నిజాయితీ..
తనకు బ్యాగును అప్పగించిన కండక్టర్‌, డిపో అధికారులకు కృతజ్ఞతలు చెబుతున్న ప్రయాణికుడు చాంద్‌పాషా

 ప్రయాణికుడు మరిచిపోయిన బ్యాగ్‌ తిరిగి అప్పగింత 

బ్యాగులో రూ.6లక్షల బంగారు ఆభరణాలు

మధిర, డిసెంబరు 1: ఓ ప్రయాణికుడు బస్సులో మరిచిపోయిన బ్యాగును.. తిరిగి అతడికి అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు ఖమ్మంజిల్లా మధిర ఆర్టీసీ డిపోనకు చెందిన కండక్టర్‌ కె.వేణు. సోమవారం ఉదయం ఖమ్మం నిజాంపేటకు చెందిన షేక్‌ చాంద్‌పాషా అనే ప్రయాణికుడు హైదరాబాద్‌ వెళ్లేందుకు గాను మధిర నుంచి హైదరాబాద్‌ వెళుతు న్న ఎక్స్‌ప్రెస్‌ బస్సును ఖమ్మంలో ఎక్కాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌ చేరుకున్నాక తన బ్యాగును బస్సులోనే మర్చిపోయి దిగిపోయాడు. ప్రయాణికులు అంతా దిగివెళ్లిపోయాక బస్సులో ఓ బ్యాగ్‌ కనిపించడంతో కండక్టర్‌ వేణు దానిని తిరుగుప్రయాణంలో తీసుకొచ్చి మధిర డిపోలో అందజేశారు. అధికారులు ఆబ్యాగును పరిశీలించగా రూ.6లక్షల విలువైన ఆభరణాలు, రూ.14,600నగదు, ఇతర దుస్తులు ఉన్నాయి. ఈ క్రమంలో సదరు ప్రయాణికుడు తన బ్యాగ్‌ పోయిందని డిపో అధికారులను ఆశ్రయించగా.. అతడిని విచారించి.. ఆ బ్యాగు అతడిదేనని నిర్ధారించుకున్నాక మంగళవారం ఆబ్యాగును మధిర డీఎం సూర్యనారాయణ.. ప్రయాణికుడికి అప్పగించారు. అయితే పోయిందనుకున్న బ్యాగ్‌ బంగారం సహా తిరిగి దొరకడంతో చాంద్‌ పాషా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. నిజాయితీగా తనకు బ్యాగును అప్పగించిన కండక్టర్‌ వేణుకు, డిపో అధికారులకు చాంద్‌పాషా కృతజ్ఞతలు తెలిపాడు. ఈసందర్బంగా వేణును ఆర్టీసీ అధికారులు కార్మికులు అభినందించారు. 


Updated Date - 2020-12-02T04:53:11+05:30 IST