ఆర్టీసీకి పండగే..!

ABN , First Publish Date - 2021-01-16T05:50:17+05:30 IST

ఆర్టీసీకి పండగే..!

ఆర్టీసీకి పండగే..!
పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ

సంతృప్తికరంగానే పండుగ సీజన్

మొత్తం 770 స్పెషల్స్‌ నడిపిన కృష్ణా రీజియన్‌ 

హైదరాబాద్‌కు నిరుత్సాహం, ఆదుకున్న ఉత్తరాంధ్ర

తిరుగు ప్రయాణాలపై ఆశలు

విజయవాడ, ఆంధ్రజ్యోతి : సంక్రాంతి పండుగ ప్రయాణాలు ఆర్టీసీ కృష్ణా రీజియన్‌కు కొంతమేర సాంత్వన కలిగించాయి. కిందటి సంవత్సరం మొత్తం 1,600 ప్రత్యేక బస్సులు నడిపిన రీజియన్‌ అధికారులకు.. ఈ పండుగ ముందు వరకు ప్రయాణాలు ఊరటనిచ్చాయనే చెప్పాలి. భోగి వరకు 770 స్పెషల్‌ బస్సులను నడిపారు. తెలంగాణాతో ఇంటర్‌స్టేట్‌ అగ్రిమెంట్‌ కారణంగా బస్సులు తగ్గించుకోవాల్సి రావటం, కొవిడ్‌ కారణంగా హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైల్లో పనిచేసే టెకీలంతా లాక్‌డౌన్‌లోనే తమ  సొంత ప్రాంతాలకు వచ్చేసి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తుండటంతో ప్రయాణాలు ఆశాజనకంగా ఉండవేమోనని ఆర్టీసీ అధికారులు భావించారు. దీంతో ఈసారి పండుగ  ముందు, తర్వాత ప్రయాణాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని బస్సులు తిప్పగలిగితే చాలనుకున్నారు. అయితే, ఆర్టీసీ ఊహించిన దానికంటే భోగి ముందు వరకు 770 స్పెషల్స్‌ నడపటం విశేషం.

ఉత్తరాంధ్రవైపు కాసుల పంట

రైళ్లను ప్రైవేటీకరించేందుకు ఉవ్విళ్లూరుతున్న రైల్వే... పాసింజర్ల స్థానంలో ఎక్స్‌ప్రెస్‌లు ప్రవేశపెట్టడం, డిమాండ్‌ ఉన్న సమయాలను అర్ధరాత్రి తర్వాత, వేకువజాముకు మార్చటం, జనరల్‌ రైళ్లు నడపకుండా స్పెషల్స్‌, ఫెస్టివల్‌ స్పెషల్స్‌ పేరుతో తత్కాల్‌ చార్జీలు వసూలు చేయటం వంటి చర్యలతో పేద, మధ్య తరగతి వర్గాలు రైళ్లకు దూరమయ్యాయి. వీరంతా ఆర్టీసీ బస్సులపై ఆసక్తి చూపించారు. దీంతో అనూహ్యంగా పేద, మధ్య తరగతి వర్గాల ఆదరణతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రికి డిమాండ్‌ ఏర్పడింది. దీంతో ఆర్టీసీ అధికారులు రికార్డు స్థాయిలో ఉత్తరాంధ్రకు స్పెషల్‌ బస్సులను నడిపారు. పండక్కి ఐదు రోజుల ముందు నుంచి రోజుకు 80-100 బస్సుల వరకు ఉత్తరాంధ్రకు నడిపారు. మధ్యలో రాయలసీమ ప్రాంతాలకు నడిపారు. 

అంతర్రాష్ట్ర రూట్లకు తగ్గిన డిమాండ్‌

అంతర్రాష్ట్ర రూట్లయిన హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరుకు రాకపోకలు గణనీయంగా తగ్గాయి. బెంగళూరు, చెన్నై నుంచి వస్తున్నవారు బస్సుల కంటే విమాన ప్రయాణాలపైనే ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి వచ్చేవారు కూడా బస్సులు, రైళ్ల కంటే సొంత వాహనాల్లోనో, విమానాల్లోనో రావడానికి మక్కువ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖకు గరిష్టంగా బస్సులను తిప్పగా, ఆ తర్వాత రాజమండ్రి, కాకినాడ  ప్రాంతాలు ఉన్నాయి. ఈసారి వలస కార్మికుల ఆదరణతో శ్రీకాకుళం, విజయనగరానికి ఎక్కువ సంఖ్యలో బస్సులు నడిపారు. రాయలసీమ సెక్టార్‌లో కూడా గణనీయంగానే బస్సులు నడిచాయి.

ఫ తిరుగు ప్రయాణంపై భారీ అంచనాలు

పండుగ తర్వాత తిరుగు ప్రయాణాలపై ఆర్టీసీ అధికారులు భారీ అంచనాలతో ఉన్నారు. ఆదివారం రాత్రి నుంచి సోమ, మంగళ, బుధ, గురువారాల్లో తిరుగు ప్రయాణాలు భారీగా ఉంటాయని భావిస్తున్నారు. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైపై ఆశలు పెట్టుకున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఇక్కడికి వచ్చేసి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ నిర్వహిస్తున్న టెకీలకు పండుగ అనంతరం ఆఫీసులకు వచ్చేయాలని ఆయా కంపెనీల నుంచి పిలుపు వస్తుండటంతో ప్రయాణాలు ఊహించని విధంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు ముంద స్తు రిజర్వేషన్‌ను ప్రారంభించారు. డిమాండ్‌ ఎంత ఉందో తెలుసుకోవటానికి కూడా ఈ రిజర్వేషన్‌ చేపట్టారు. ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో రిజర్వేషన్లు జరగలేదు.  

Updated Date - 2021-01-16T05:50:17+05:30 IST