ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యంపై స్పందించిన RTC MD Sajjanar

ABN , First Publish Date - 2021-11-08T18:18:39+05:30 IST

‘ఎమ్మెల్యే కారుకే సైడివ్వరా?’ అంటూ ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌ను బూతులు తిడుతూ ఓ వ్యక్తి దౌర్జన్యం చేసిన వీడియో సోషల్‌ మీడియాలో ఆదివారం హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే.

ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యంపై స్పందించిన RTC MD Sajjanar

ఇంటర్నెట్ డెస్క్: ‘ఎమ్మెల్యే కారుకే సైడివ్వరా?’ అంటూ ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌ను బూతులు తిడుతూ ఓ వ్యక్తి దౌర్జన్యం చేసిన వీడియో సోషల్‌ మీడియాలో ఆదివారం హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో ఆధారంగా ‘ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్’ కథనం ప్రచురించింది. ఆర్టీసీ సంస్థను గాడిలో  పెడుతున్న ఎండీ సజ్జనార్ ఈ ఘటనపై ఎలా స్పందిస్తారోనని నెటిజన్లు చర్చించుకున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఆర్టీసీ డ్రైవర్‌ను దుర్భాషలాడిన వ్యక్తిపై షాద్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఐపీసీ 341, 353, 506, 290 సెక్షన్ల కింద క్రైమ్ నంబర్ 893/2021 రిజిస్టర్ చేసినట్లు సజ్జనార్ ట్విట్టర్ ద్వారా రిప్లయ్ ఇచ్చారు. నిందితుడిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. చట్టం తన పని తాను చేస్తుందని, పౌరులెవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదని తెలంగాణ ఆర్టీసీ కోరుతున్నట్లు పేర్కొన్నారు. చట్టం ముందు ఎవరూ ఎక్కువ కాదని స్పష్టం చేశారు.


నిన్న జరిగింది ఇదీ..

రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండలం సూర్యజ్యోతి కాటన్‌ మిల్లు సమీపంలో 44వ నెంబరు జాతీయ రహదారిపై ఆదివారం ఆర్టీసీ డ్రైవర్‌పై ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యం చేశారు. వనపర్తి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్‌ నుంచి వనపర్తికి వెళ్తోంది. వెనుక నుంచి వచ్చిన ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉన్న కారు(టీఎస్ 09 ఎఫ్ఏ 0809)ఓవర్‌టేక్‌ చేసి బస్సు ఎదుట నిలిపారు. కారులో నుంచి ఇద్దరు వ్యక్తులు కిందికి దిగి బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డారు. వారిలో ఓ వ్యక్తి కర్ర పట్టుకుని బస్‌ డ్రైవర్‌ వీఆర్‌రెడ్డిని బూతులు తిడుతూ, బస్సు డోరును లాగే యత్నం చేశాడు. డోరు తీయకపోవడంతో ఆ కర్రతో డోరును కొట్టాడు. దీనిని ఓ ప్రయాణికుడు సెల్‌ఫోన్‌లో వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయడంతో వైరలైంది. కాగా.. సదరు కారుపై 14 ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు సంబంధించి రూ.14,490 చలానా పెండింగ్‌లో ఉందని తెలిసింది. 



Updated Date - 2021-11-08T18:18:39+05:30 IST