ఆర్టీసీ మెరుపు సమ్మె

ABN , First Publish Date - 2020-12-03T06:17:31+05:30 IST

ఉద్యోగులపై ఆర్టీసీ యాజమాన్యం అదనపు పని భారం మోపుతూ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయా లతో ఉద్యోగుల్లో రగులుతున్న అసంతృప్తి ఆందో ళన రూపంలో బయటపడుతోంది. ఫలితంగా ఆయా డిపోల్లోని ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగుతున్నారు.

ఆర్టీసీ మెరుపు సమ్మె
ఆందోళన చేస్తున్న కార్మికులు

  మెరుపు సమ్మెకు దిగుతున్న ఉద్యోగులు

  ఉద్యోగులపై అదనపు పనిభారాన్ని నిరసిస్తూ ఆందోళన

  అమలాపురంలో మొదలు.. ఇతర డిపోలకూ విస్తరణ

  నిలిచిన సర్వీసులు.. ప్రయాణికులకు ఇబ్బందులు 

  రాజమహేంద్రవరం ఆర్టీసీ ఉద్యోగులూ సమ్మెలోకి.. 

  రాత్రి వరకూ చర్చలు..  విధులకు హాజరయ్యేందుకు సుముఖం

అమలాపురం (ఆంధ్రజ్యోతి) డిసెంబరు 2: ఉద్యోగులపై ఆర్టీసీ యాజమాన్యం అదనపు పని భారం మోపుతూ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయా లతో ఉద్యోగుల్లో రగులుతున్న అసంతృప్తి ఆందో ళన రూపంలో బయటపడుతోంది. ఫలితంగా ఆయా డిపోల్లోని ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగుతున్నారు. మంగళవారం అమలాపురంలో ప్రారంభమైన మెరుపు సమ్మె బుధవారం రాజమ హేంద్రవరం ఆర్టీసీ డిపోకు చేరింది. మరో నాలుగైదు డిపోల ఉద్యోగులు ఇప్పటికే ఆయా డిపోల యాజమాన్యాలకు అల్టిమేటం ఇచ్చారు. ఫలితంగా డిపోల్లో బస్సు సర్వీసులు స్తంభించి పోయి ప్రయాణికులు ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రధానంగా ఉద్యోగులపై అదనపు పని భారం పెర గడమే ఆందోళనకు కారణం. రోడ్లు అధ్వాన స్థితికి చేరడం, జాతీయ రహదారుల్లో టోల్‌గేట్ల సంఖ్య పెరగడంతో ఉద్యోగులపై నిర్ణీత సమయం కంటే నాలుగు నుంచి ఆరు గంటల అదనపు పని భారం మోపుతున్నారు. దీన్ని నిరసిస్తూ అమలాపురం ఆర్టీసీ ఉద్యోగులు మంగళవారం ఆందోళనకు దిగి బస్సు సర్వీసులను స్తంభింపజేయడంతో పాటు బుధవారం కూడా ఆందోళన కొనసాగించారు. సాధారణంగా ఆర్టీసీ ఉద్యోగి రోజుకు ఎనిమిది గంటలు విధులు నిర్వహిస్తారు. అదనపు పని భారం ఉంటే అందుకు ఓటీ చెల్లించే విధానం అమలులో ఉండేది. కొవిడ్‌ కారణంగా ఆర్టీసీ సంస్థ అదనపు పని భారానికి ఓటీని రద్దుచేసి డ్యూటీలు సర్దుబాటు చేస్తున్నారు. ఉదాహరణకు విజయ వాడ సర్వీసుకు వెళ్లేవారికి లింక్‌ డ్యూటీని అమలు చేసి ఓటీ కూడా ఇచ్చేవారు. రెస్టాఫ్‌ నిబంధన అమలు చేసేవారు. ప్రస్తుతం రోడ్లు, టోల్‌గేట్లు కారణంగా విజయవాడ వెళ్లి రావాలంటే పద మూడు గంటలు పైనే సమయం పడుతోంది. అలాగే రాజమహేంద్రవరంనకు రెండు ట్రిప్‌లు తిరిగే వాటిని మూడుకు పెంచడం వల్ల ఉద్యోగులు తీవ్రమైన అదనపు పనిభారంతో ఇబ్బందులకు గురవుతున్నారు. అమలాపురం డిపోలో వంద మందికిపైగా ఉద్యోగులు కరోనా బారిన పడి తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఇరవై మందికిపైగా విధులకు హాజరుకాని పరిస్థితుల్లో ఉన్నారని డిపో జేఏసీ కోకన్వీనర్‌ కె. రంగప్రసాద్‌ చెప్పారు. యాజమాన్యం నుంచి వచ్చిన ఆదేశాలతో ఎనలేని పెనుభారాన్ని మోప డం వల్ల అసలే అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్న ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. దీంతో అదనపు పనిభారాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళన జిల్లా అంతటా విస్తరిస్తోంది. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ సర్వీసులు ప్రారంభమవుతూ ప్రయాణికులతో రద్దీగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మె వల్ల మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. 

రాజమహేంద్రిలో చర్చలు

రాజమహేంద్రవరం అర్బన్‌, డిసెంబరు 2 : రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్లు, కండక్టర్లు బుధవారం మెరుపు సమ్మెకు దిగారు. విధులకు హాజరుకాకుండా బస్సులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. దీంతో రాజమహేంద్రవరం డిపోకు చెందిన సుమారు 130 బస్సులు నిలిచిపోయాయి. 650 మంది ఉద్యోగులు ఈ ఆందోళనలో పాల్గొన్నట్టు సమాచారం. దీంతో ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ ఆర్‌వీఎస్‌ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో యూనియన్‌ నేతలతో చర్చలు ప్రారంభించారు. వైసీపీ సిటీ కోఆర్డినేటర్‌ శ్రీఘాకొళపు శివరామసుబ్రహ్మణ్యం వైఎస్‌ఆర్‌ యూనియన్‌ తరపున ఈ చర్చల్లో పాల్గొన్నారు. పొద్దుపోయే వరకు చర్చలు సాగగా, విధులకు హాజరుకావడానికి ఉద్యోగులు సముఖత వ్యక్తంచేశారని సమాచారం.


Updated Date - 2020-12-03T06:17:31+05:30 IST