ఆర్టీసీ ఆదాయం దండిగా..

ABN , First Publish Date - 2021-01-17T05:03:03+05:30 IST

ఆర్టీసీ ఆదాయం దండిగా..

ఆర్టీసీ ఆదాయం దండిగా..
సంక్రాంతి ముందురోజు పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌లో రిజర్వేషన్‌ కౌంటర్‌ వద్ద రద్దీ

సంక్రాంతి ఆపరేషన్‌ సక్సెస్‌

భోగి వరకు 874 బస్సులు నడిపిన కృష్ణా రీజియన్‌ 

81 శాతం ఆక్యుపెన్సీతో రూ.2కోట్ల ఆదాయం 

తిరుగు ప్రయాణాలకు 300 స్పెషల్స్‌ రెడీ

విజయవాడ, ఆంధ్రజ్యోతి : ఆర్టీసీకి ఈ సంక్రాంతి కాసుల వర్షం కురిపించింది. భోగి వరకు 874 బస్సులు నడిపి 81 శాతం ఆక్యుపెన్సీతో రూ.2 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. పండుగ ముందు, తర్వాత స్పెషల్‌ ఆపరేషన్‌ వివరాలను శనివారం ఆర్టీసీ ఆర్‌ఎం ఎం.నాగేంద్రప్రసాద్‌ తెలిపారు. భోగి ముందు వరకు 874 ప్రత్యేక బస్సులు  నడిపిన ఆర్టీసీ హైదరాబాద్‌ నుంచి విజయవాడకు 97 స్పెషల్స్‌ తిప్పింది. ఇక విజయవాడ నుంచి విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, ఇతర ప్రాంతాలకు కలిపి 777 బస్సులను నడిపింది. ఈనెల 5వ తేదీ నుంచి భోగి రోజు వరకు మొత్తం పది రోజుల పాటు ఈ స్పెషల్‌ ఆపరేషన్‌ కొనసాగింది.

నేటి నుంచి తిరుగు ప్రయాణాలు

సంక్రాంతి తిరుగు ప్రయాణాలను దృష్టిలో ఉంచుకుని ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు మరో 300 స్పెషల్‌ బస్సుల ఆపరేషన్‌ చేపట్టాలని ఆర్టీసీ కృష్ణా రీజియన్‌ నిర్ణయించింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం ఎక్కువగా ఉంటుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌, చెన్నై, విశాఖపట్నానికి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. జగ్గయ్యపేట, నూజివీడు, తిరువూరు, అవనిగడ్డ, గుడివాడ, మచిలీపట్నం నుంచి 300 స్పెషల్‌ బస్సులు నడపటానికి ప్రణాళిక రూపొందించారు.

హైదరాబాద్‌ లోటును ఉత్తరాంధ్ర తీర్చింది

గత ఏడాది సంక్రాంతి స్పెషల్‌ ఆపరేషన్‌తో పోల్చుకుంటే ప్రస్తుతం 50 శాతం మేర స్పెషల్‌ ఆపరేషన్‌ జరిగింది. భోగి ముందు వరకు 874 ప్రత్యేక బస్సులు నడిపాం. హైదరాబాద్‌ నిరాశ పరిచినా దానిని ఉత్తరాంధ్ర భర్తీ చేసింది. ఉత్తరాంధ్రకు ఎంత డిమాండ్‌ ఉన్నా బస్సులు తిప్పాం. భోగి ముందు చేపట్టిన ఆపరేషన్‌ ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. తిరుగు ప్రయాణాల కోసం కూడా మరో 300 స్పెషల్‌ బస్సులు నడపాలని భావిస్తున్నాం. ఉత్తరాంధ్రకు వారం పాటు రద్దీ ఉండే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నాం. కళాశాలలు కూడా తెరిస్తే ఇంకా రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది. 

- ఎం.నాగేంద్ర ప్రసాద్‌, ఆర్టీసీ ఆర్‌ఎం 

Updated Date - 2021-01-17T05:03:03+05:30 IST