ఆర్టీపీసీఆర్‌ మాయాజాలం!

ABN , First Publish Date - 2021-12-19T09:01:27+05:30 IST

కడప జిల్లా గువ్వలచెరువు మండలానికి చెందిన ఓ వ్యక్తి జ్వరం, జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతూ స్థానికంగా ఉన్న ప్రైవేటు ల్యాబ్‌కు వెళ్లాడు. అతడి

ఆర్టీపీసీఆర్‌ మాయాజాలం!

కరోనా పరీక్ష చేయకుండానే నెగెటివ్‌ రిపోర్టులు ..

వెబ్‌సైట్‌లో నమోదు కాకుండానే వైద్య పరీక్షలు 

క్షణాల్లో వాటా్‌ప్సలోకి వచ్చేస్తున్న నెగెటివ్‌ రిపోర్టు 

దొంగ రిపోర్టుతో కడపలో ఒకరి నుంచి 18మందికి..

ప్రైవేటు టెస్టింగ్‌ ల్యాబ్‌ల నిర్వాకం పట్టని ఆరోగ్యశ్రీ 


ఒమైక్రాన్‌ కేసులు పెరుగుతున్న వేళ రాష్ట్రంలో కరోనా పరీక్షల నిర్వహణ ఓ ప్రహసనంలా మారింది. ఆర్టీపీసీఆర్‌ వెబ్‌సైట్‌లో నమోదు కాకుండానే టెస్టింగ్‌ చేసేస్తున్నారు. ఇంటి నుంచి కదలకుండానే నెగటివ్‌ రిపోర్టు వచ్చేస్తోంది. ఎలాంటి రిపోర్టు కావాలన్నా ఒక్క ఫోన్‌కాల్‌ చేసి, రూ.2వేల నుంచి 3వేలు చెల్లిస్తే చాలు... కావాల్సిన రిపోర్టును క్షణాల్లో వాటా్‌ప్సకు పంపుతున్నారు. ప్రైవేటు టెస్టింగ్‌ ల్యాబ్‌ల తీరుతో కొవిడ్‌ వ్యాప్తి ముప్పు పొంచి ఉందన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

కడప జిల్లా గువ్వలచెరువు మండలానికి చెందిన ఓ వ్యక్తి జ్వరం, జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతూ స్థానికంగా ఉన్న ప్రైవేటు ల్యాబ్‌కు వెళ్లాడు. అతడి నుంచి రూ.3 వేలు వసూలుచేసిన సిబ్బంది టెస్టు చేయగా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. నిబంధనల ప్రకారం ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేసిన ల్యాబ్‌... ఆ ఫలితాలను వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. రిపోర్టు పాజిటివ్‌ అయితే వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం ఆరోగ్యశాఖ సిబ్బంది ఆ వ్యక్తిని సంప్రదించి, వైరస్‌ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే పాజిటివ్‌ వచ్చిన విషయాన్ని కేవలం అతనికి మాత్రమే చెప్పిన సిబ్బంది రిపోర్టును అప్‌లోడ్‌ చేయలేదు. అతడు దుకాణంలో మందులు కొని సొంత వైద్యం చేసుకున్నాడు. మూడ్రోజులకే అతని కుటుంబ సభ్యులతోపాటు మరో15మందికి వైరస్‌  వ్యాప్తి చేశాడు. ఆ ఒక్కడి కారణంగా 18మంది కరోనా బారినపడ్డారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు.  


ఇదో రకం ఆదాయ మార్గం

కరోనా పరీక్షలను కొంతమంది ల్యాబ్‌ సిబ్బంది ఆదాయ మార్గంగా మార్చుకుంటున్నారు. ‘మీరు ఇంట్లో నుంచి బయటకు రావొద్దు. శాంపిల్‌ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ ఫోన్‌ నంబర్‌ ఇవ్వండి చాలు. క్షణాల్లో నెగెటివ్‌ రిపోర్టు ఇచ్చేస్తాం...’ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు, విమాన ప్రయాణాలు, పెద్ద షాపింగ్స్‌ మాల్స్‌లోకి వెళ్లాలంటే నెగెటివ్‌ రిపోర్టు గానీ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ గానీ చూపించాల్సి వస్తోంది. దీంతో కొంతమంది టెస్ట్‌ చేయించుకోకుండానే తమకు కావాల్సిన రిపోర్టులు పొందుతున్నారు. ప్రైవేటు ల్యాబ్‌ల్లో కొందరు సిబ్బంది కేవలం పేరు, ఫోన్‌ నంబరు ఆధారంగా రిపోర్టు ఇచ్చేస్తున్నారు. కరోనా వ్యాప్తికి ఇది ప్రధాన కారణంగా మారుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


రేట్లకు తూట్లు 

ఆర్టీపీసీఆర్‌ టెస్టింగ్‌కు, కరోనా చికిత్సకు ప్రభుత్వం నిర్ధారించిన రేట్లు చాలావరకూ అమలు కావడం లేదు. ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ రూ.499కి చేయాలన్న నిబంధనను ఒక్క ల్యాబ్‌ కూడా పాటించడం లేదు. విజయవాడలోని బందర్‌ రోడ్డుకు సమీపంలో ఉన్న ఓ ల్యాబ్‌లో రూ.1,500 వసూలు చేస్తున్నారు. ఇతర జిల్లాల్లోనూ ఈ దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేయాలంటే ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ అనుమతి తప్పనిసరి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 46 ప్రైవేటు ల్యాబ్‌లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. కానీ ట్రస్ట్‌ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రైవేటు ల్యాబ్‌లు రెచ్చిపోతున్నాయి. అనుమతి లేనివారు సైతం ఇష్టారాజ్యంగా పరీక్షలు చేసి, రిపోర్టులు ఇస్తుండగా, అనుమతి ఉన్న ల్యాబ్‌ల్లో ప్రభుత్వం నిర్దేశించిన రేట్లు కంటే అధికంగా వసూలు చేస్తూ బాధితులను దోచేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.  

Updated Date - 2021-12-19T09:01:27+05:30 IST