
కోల్కతా: బీర్భూమ్ హింసాకాండ అంశం పశ్చిమబెంగాల్ అసెంబ్లీని సోమవారంనాడు కుదిపేసింది. అధికార టీఎంసీ, విపక్ష బీజేపీ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర గలభా చోటుచేసుకుంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక ప్రకటన చేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయడంతో టీఎంసీ ఎమ్మెల్యేలు ప్రతిఘటించారు. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేలు ఒకదశలో ఒకరితో ఒకరు కలబడటంతో పలువురు గాయపడినట్టు ఇరుపార్టీల నేతలు మీడియాకు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
బీర్భూమ్ హింసాకాండలో ఎనిమిది మంది మృతిచెందిన ఘటన తొలుత అసెంబ్లీని కుదిపేసింది. రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు ఈ ఘటన అద్దం పడుతోందని, ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని విపక్ష ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. సభలోనే తమ ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ సువేందు అధికారి నేతృత్వంలో 25 మంది బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. సభలో అనుచిత ఘటనల నేపథ్యంలో సువేందు అధికారితో సహా ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలను తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు.
అసెంబ్లీలో జరిగిన గలభాలో బీజేపీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గాయపడినట్టు ఆ పార్టీ నేతలు ఆరోపించారు. అయితే, బీజేపీ ఎమ్మెల్యేలే దాడికి దిగారని, ఈ దాడిలో తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు గాయపడి ఆసుపత్రిలో చేరారని టీఎంసీ తెలిపింది. అసెంబ్లీలో చోటుచేసుకున్న ఘటనలపై సువేందు అధికారి మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీలో కూడా తమ ఎమ్మెల్యేలకు భద్రత లేకుండా పోయిందన్నారు. శాంతి భద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని తాము డిమాండ్ చేయడంతో కొందరు టీఎంసీ ఎమ్మెల్యేలు దాడికి దిగారని, ఈ దాడిలో చీఫ్ విప్ మనోజ్ టిగ్గా సహా 8 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు గాయపడ్డారని తెలిపారు. అసెంబ్లీలో ఎలాగైనా గలభా సృష్టించాలని బీజేపీ ఆడిన డ్రామా ఇదని టీఎంసీ నేత, రాష్ట్ర మంత్రి ఫరీద్ హకీం కొట్టిపారేశారు. సభలో పలువురు టీఎంసీ ఎమ్మెల్యేలు గాయపడ్డారని, బీజేపీ (ఎమ్మెల్యేలు) ప్రవర్తనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.