ఆమెకు ఇటీవలే పెళ్లయ్యింది.. అత్తారింట్లో ఉండనంటూ పుట్టింటికి వచ్చేసింది.. ఆమె చెబుతున్న కారణం విని అంతా షాకవుతున్నారు!

ABN , First Publish Date - 2021-12-02T15:26:38+05:30 IST

ఇప్పటివరకూ కొంతమంది మహిళలు తమ భర్త..

ఆమెకు ఇటీవలే పెళ్లయ్యింది.. అత్తారింట్లో ఉండనంటూ పుట్టింటికి వచ్చేసింది.. ఆమె చెబుతున్న కారణం విని అంతా షాకవుతున్నారు!

ఇప్పటివరకూ కొంతమంది మహిళలు తమ భర్త, అత్తామామలపై వరకట్న వేధిపుల ఫిర్యాదులు చేస్తుండటం చూశాం. అయితే దీనికి భిన్నంగా ఒక మహిళ తన భర్త తన పుట్టింటి నుంచి ఏమీ తీసుకోనందుకు నిరసన వ్యక్తం చేస్తోంది. ఆమె తండ్రి వివాహ సమయంలో వరునికి కారుతోపాటు కొన్ని గృహోపకరణాలు అందజేశాడు. వీటిని భర్త తీసుకోకపోవడంతో ఆగ్రహంచిన ఆమె నిరసన వ్యక్తం చేస్తూ మూడు నెలల నుంచి పుట్టింటిలోనే ఉంటోంది. అయితే భార్యను తన ఇంటికి రప్పించేందుకు భర్త కోర్టు మెట్లెక్కాడు.  కాగా అతను పెళ్లివేడుకల్లో కట్నంగా ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నాడు.  


వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో గల అరోరా కాలనీకి చెందిన ఈ నూతన దంపతులకు 2021, ఫిబ్రవరి 14న వివాహం జరిగింది. ఈ సందర్భంగా వరుడు.. వధువు తల్లిదండ్రుల నుంచి కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నాడు. ఆ తరువాత వధువు తరపు వారు వరునికి కారుతో పాటు విలువైన సామాను కూడా ఇచ్చారు. వీటిని వరుడు తీసుకునేందుకు నిరాకరించాడు. కొన్ని నెలల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. అయితే గత మూడు నెలలుగా కొత్త పెళ్లి కూతురు పుట్టింటిలోనే ఉంటోంది. ఈ ఉదంతంపై భర్త మాట్లాడుతూ.. పెళ్లి తరువాత తన భార్య కుటుంబ సభ్యులు.. ఒక గదిలో సామానుతో పాటు కారు కూడా ఉంచారన్నారు. వారు ముగ్గురు అన్నదమ్ములు, ఒక సోదరి కలిగిన కుటుంబమన్నారు. ఆ అన్నదమ్ములు.. సామాను తీసుకుని అత్తారింటికి వెళ్లాలని తమ సోదరిపై ఒత్తిడి తీసుకువస్తున్నారన్నారు. వారి ఇంటిలో ఈ సామాను పెట్టుకునేందుకు తగిన స్థలం కూడా లేదన్నారు. ఎటువంటి పరిస్థితులలోనూ తాను కట్నం అడగబోనని చెప్పినప్పటికీ ఆమె వినడంలేదని భర్త వాపోయాడు. కాగా ఆ మహిళ తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ అల్లుడు కట్నం తీసుకోలేదని అన్నారు. తమకు ఒక్కర్తే కుమార్తె అని, అందుకే ఆమెకు పెళ్లి సామాను ఇచ్చామన్నారు. కాగా ఈ ఉదంతంపై కోర్టుకెక్కిన దంపతులకు న్యాయ నిపుణులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ మహిళకు పుట్టింటివారు ఇచ్చిన సామాను కట్నంగా భావించవద్దని భర్తకు తెలిపారు. అలాగే దానిని ఆమెకు చెందిన స్త్రీ ధనంగా గుర్తించాలని సూచించారు. దీంతో సమస్య పరిష్కారమయ్యింది.

Updated Date - 2021-12-02T15:26:38+05:30 IST