రుక్మాపూర్ సాంఘిక సంక్షేమ సైనిక పాఠశాల
- కేంద్ర ప్రభుత్వం గుర్తింపునిస్తూ ప్రకటన
- రక్షణశాఖతో భాగస్వామ్య పద్ధతిలో నిర్వహణ
- జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష
చొప్పదండి, మార్చి 26: రుక్మాపూర్ సాంఘిక సంక్షేమ గురుకులం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైనిక స్కూల్‌కు కేంద్ర ప్రభుత్వ గుర్తింపు దక్కింది. రక్షణశాఖతో భాగస్వామ్య పద్ధతిలో సైనిక స్కూల్‌గా ఆమోదం లభించింది. దేశవ్యాప్తంగా 21 పాఠశాలలను సైనిక పాఠశాలలుగా రక్షణశాఖ ప్రకటించగా అందులో జిల్లాలోని చొప్పదండి మండలం రుక్మాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక స్కూల్‌కు చోటు లభించింది. 2022-23 విద్యాసంవత్సరం నుంచి ఈ సైనిక స్కూల్లో ఆరో తరగతిలో ప్రవేశం కల్పిస్తారు. అఖిల భారత సైనిక స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పూర్తిగా రెసిడెన్షియల్ పద్ధతిలో సైనిక స్కూల్ కొనసాగుతుంది. 30 ఎకరాల సువిశాలమైన మైదానంలో అన్ని హంగులతో అధునాతనమైన భవనం ఉంది.
సైనిక్ స్కూల్‌గా గుర్తింపు పొందడం హర్షణీయం...
- ఎంపీ బండి సంజయ్ కుమార్
రుక్మాపూర్ సాంఘిక సంక్షేమ గురుకులాన్ని కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ సైనిక్ స్కూల్‌గా గుర్తించడం హర్షణీయం. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడంతోపాటు సైన్యంలో చేరేందుకు అవకాశం కలుగుతుంది. గతంలో నేను రక్షణ శాఖ మంత్రిని కలిసి వినతిపత్రాన్ని అందజేయగా సైనిక్ స్కూల్‌గా ప్రకటించారు. ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్, రక్షణాధికారులకు కృతజ్ఞతలు. సైనిక్ స్కూల్లో అడ్మిషన్లు సహా నిర్వహణ వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరిస్తుంది. సైనిక స్కూల్ ఏర్పాటుతో విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. రక్షణ రంగంలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.