గెలుపులో తోడుగా... కష్టాల్లో నీడగా...

Aug 22 2021 @ 00:10AM

అఫ్ఘానిస్తాన్‌ అధునిక చరిత్రలో మహిళలది ఒక ప్రత్యేక స్థానం. దేశ ప్రథమ మహిళలు తమదైన విశిష్ట పాత్ర పోషించారు. తాజాగా దేశం వదిలి వెళ్ళిపోయిన అధ్యక్షుడు మొహమ్మద్‌ అష్రఫ్‌ ఘనీ భార్య రూలా ఘనీ సైతం ప్రత్యేక గుర్తింపు పొందారు.


అప్ఘానిస్తాన్‌ మధ్య ఆసియా ముఖ ద్వారంగా...యూరప్‌ మార్గంలో ఉంది. అయినప్పటికీ బలీయమైన తెగల సంప్రదాయాల కారణంగా అప్ఘాన్‌ మహిళలు సామాజిక, ఆర్ధిక రంగాలలో ముందుకు రాలేకపోతున్నారు. ఆ దేశానికి 1919లో స్వాతంత్ర్యాన్ని సాధించిన రాజు అమానుల్లాఖాన్‌... తన భార్య సురయ్యా ప్రోత్సాహంతో దేశ మహిళలకు విద్యావకాశాలనూ, సమాన అవకాశాలనూ కల్పించడానికి సిద్ధపడ్డారు. ఆ ప్రయత్నాల కారణంగానూ, సురయ్యా బురఖా ధరించకపోవడంపై కొన్ని తెగలు తీవ్రస్థాయి నిరసనల వల్లా 1929లో ఆయన అధికారాన్ని కోల్పోయి, యూరప్‌కు పారిపోవాల్సి వచ్చింది. అమెరికా సేనలు ఆ దేశంలో ప్రవేశించిన అనంతరం జరిగిన ఎన్నికల్లో... అధ్యక్ష పదవికి పోటీ చేసిన అష్రఫ్‌ ఘనీ తరఫున ఆయన భార్య రూలా ఘనీ వీధులలోకి వచ్చి ప్రచారం చేశారు. ఆమె అప్ఘానీ కాదు. లెబనాన్‌లో పుట్టి, పెరిగిన క్రైస్తవురాలు. లెబనాన్‌లోని అమెరికన్‌ విశ్వవిద్యాలయంలో చదువుకొనే రోజుల్లో, 1973లో, ఒక కాఫీ దుకాణం దగ్గర అష్రఫ్‌, రూలా అనుకోకుండా కలుసుకున్నారు. వారి పరిచయం పెరిగింది. 1975లో వారు వివాహం చేసుకున్నారు. ఆ తరువాత అప్ఘానిస్తాన్‌కు వచ్చిన ఆ దంపతులు రెండేళ్ళు అక్కడే ఉన్నారు. అనంతరం అమెరికా వెళ్ళి స్థిరపడ్డారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా పని చేశారు. 1991లో, ప్రపంచబ్యాంక్‌లో అష్రఫ్‌ చేరారు. 2002లో, అప్ఘానిస్తాన్‌లో అమెరికా సేనలు ప్రవేశించిన అనంతరం... ఐక్యరాజ్యసమితి ప్రతినిధిగా మాతృదేశానికి కుటుంబ సమేతంగా తిరిగి వచ్చారు. 


తొలిసారి 1975లో అప్ఘానిస్తాన్‌ వచ్చినప్పుడూ, దాదాపు ఇరవై ఏడేళ్ళ తరువాత మళ్ళీ ఆ దేశాన్ని చూసినప్పుడూ... పరిస్థితుల్లో ఎన్నో మార్పులు తనకు కనిపించాయని రూలా చెప్పారు. 2014లో జరిగిన ఎన్నికల ప్రచార బాధ్యతల్లో రూలా పాలు పంచుకొని, తన విజయం కోసం దోహదపడ్డారంటూ... పదవీ ప్రమాణం సందర్భంగా అష్రఫ్‌ ఘనీ నొక్కి చెప్పడాన్ని ప్రపంచమంతా చూసింది.  


అధ్యక్ష పదవి కోసం అమెరికా పౌరసత్వాన్ని అష్రఫ్‌ వదులుకున్నారు కానీ రూలా వదులుకోలేదు. ఆమెకు అప్ఘానిస్తాన్‌, అమెరికా, పుట్టిన దేశమైన లెబనాన్‌ పౌరసత్వాలు ఉన్నాయి. దేశంలోని వివిధ తెగలకూ, తాలిబన్లకూ, అమెరికన్లకూ అనేక అంశాల గురించి అష్రఫ్‌ నచ్చజెప్పగలిగారు. అయితే, రూలా భార్య మతం, జాతీయత గురించి మాత్రం మౌనం వహించాల్సి వచ్చింది. ఎన్నికల తరువాత చేసిన ఒక ప్రసంగంలో... తన ఫష్తూన్‌ తెగ మూలాలను గుర్తు చేస్తూ... రూలాను ‘బీబీ గుల్‌’ అనే పేరుతో ఆయన సంబోధించారు. అష్రఫ్‌-రూలా దంపతులకు ఇద్దరు పిల్లలు. మృదుభాషి అయిన 73 ఏళ్ళ రూలా మేధావిగా గుర్తింపు పొందారు. 


అష్రఫ్‌ అమెరికన్‌ విశ్వవిద్యాలయాల్లో, ప్రపంచబ్యాంక్‌లో పనిచేస్తున్నప్పుడు... అప్ఘానిస్తాన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు పదవి నిర్వహిస్తున్నప్పుడు ఆయనకు అన్నింటా ఆమె తోడుగా నిలిచారు, సలహాలు అందించారు. 2015లో, భారతదేశంలో రూలా పర్యటించారు. వివిధ మహిళా బృందాలతో సమావేశమయ్యారు. రూలాకు అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ప్రత్యేకంగా విందు ఇచ్చి ఆమె చేస్తున్న కృషిని అభినందించారు.  ఇటీవల తాలిబన్లు కాబూల్‌ను వశపరచుకోవడంతో... అప్ఘాన్‌ అధ్యక్ష పదవిని అష్రఫ్‌ వదులుకొని, దేశాన్ని వదిలి వెళ్ళారు. రూలా కూడా తన భర్త వెంట యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ రాజధాని అబుదాబీ చేరుకున్నారు.

- మొహమ్మద్‌ ఇర్ఫాన్‌

ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి

Follow Us on:

ప్రత్యేకం మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.